ఆ మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురాం: కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్,
న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను భవిష్యత్తులో తిరిగి తీసుకొచ్చే ఆలోచన లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టంచేశారు. ఈ చట్టాలను మళ్లీ తీసుకొచ్చే ఆలోచన కేంద్రానికి ఉందా? అని రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు.
మరోవైపు, పీఎం కిసాన్ పథకం ద్వారా ఫిబ్రవరి 8, 2022 నాటికి దేశ వ్యాప్తంగా 11.78 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు దాదాపు రూ. 1.82 లక్షల కోట్లు మొత్తం పలు వాయిదాల రూపంలో సాయం అందించినట్లు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. అయితే, వీరిలో 48.04 లక్షల మందిని అనర్హులుగా గుర్తించామన్నారు. అందువల్ల ఈ పథకం కింద 11.30 కోట్ల మంది మాత్రమే అర్హులుగా ఉన్నారని వివరించారు.

పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ప్రస్తుతం ఇస్తున్న సాయానికి అదనంగా డబ్బులు ఇచ్చే ప్రతిపాదన ఇప్పటికైతే లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. దేశంలోని అర్హులైన రైతులకు పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకోసారి రూ. 2వేలు చొప్పున ఏడాదికి మొత్తంగా రూ. 6వేలు సాయంగా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే.
2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశ ప్రధాన వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల విలువ రూ. 2,52,297 కోట్లుగా ఉందన్నారు కేంద్రమంత్రి. ఇది ప్రస్తుత ధరల ప్రకారం మన దేశ జీడీపీలో 1.2 శాతమని వెల్లడించారు. 2020-21లో కరోనా మహమ్మారి సంక్షోభం ఉన్నప్పటికీ.. వ్యవసాయ ఎగుమతుల్లో 22.8 శాతం వృద్ధి నమోదందని కేంద్రం వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.
దేశ రాజధాని సరిహద్దులో పంజాబ్, హర్యానా రైతులు ఏడాదిపాటు ఆందోళనలను కొనసాగించిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసింది. తాజాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ చట్టాలపై మాట్లాడారు. దేశంలోని రైతులందరికీ మేలు చేసేందుకు తాము వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని, అయితే, దేశ ప్రయోజనాల కోసం ఆ చట్టాలను రద్దు చేశామని వివిరంచారు.












Click it and Unblock the Notifications