Hemanth Soren: హేమంత్ సోరెన్ కు సుప్రీంలో దక్కని ఊరట..!
రూ.600 కోట్ల భూకుంభకోణంలో చిక్కుకుని ఈడీ అరెస్టు చేసిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఇవాళ సుప్రీంకోర్టులోనూ ఊరట దక్కలేదు. తనపై ఈడీ నమోదు చేసిన కేసును కొట్టేసి తనకు విముక్తి కల్పించాలన్న సోరెన్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అయితే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈడీ అరెస్టుపై రాంచీ హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆయనకు సూచించింది.

జార్ఖండ్ లో అధికార దుర్వినియోగానికి పాల్పడి రూ.600 కోట్ల భూకుంభకోణం చేసి ఆ డబ్బును విదేశాలకు తరలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్ సోరెన్ పై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో ఆయన అరెస్టు తప్పదని తేలిపోవడంతో సీఎం పదవికి రాజీనామా చేసేందుకు రెండు రోజుల క్రితం గవర్నర్ నివాసానికి వెళ్లారు. అయితే అక్కడే హేమంత్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అయితే కస్టడీపై స్ధానిక కోర్టు ఇవాళ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
అయితే ఆలోపు జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించిన హేమంత్ సోరెన్.. ఆ తర్వాత పిటిషన్ వెనక్కి తీసుకుని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హేమంత్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్ధానం.. ఈడీ అరెస్టు వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. హైకోర్టులో దీనిపై తేల్చుకోవాలని సూచిస్తూ హేమంత్ సోరెన్ పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో ఇప్పుడు ఆయన తప్పనిసరిగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. హైకోర్టులోనూ ఊరట లభించకపోతే ఈడీ కోర్టు సోరెన్ ను కస్టడీకి కూడా పంపే అవకాశముంది.












Click it and Unblock the Notifications