వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

No Smoking Day: సిగరెట్ మానేయాలనుకునే వారు ఇది చదవాలి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
స్మోకింగ్

దేశంలో ప్రతి ఏటా 10 లక్షల మంది సిగరెట్ తాగడం వల్ల చనిపోతున్నారని భారత ప్రభుత్వం చెబుతోంది. గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే(2016-17) ప్రకారం భారతదేశంలో సిగరెట్ తాగేవారి సంఖ్య 10 కోట్లకు పైగా ఉంది.

ఈ గణాంకాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి సిగరెట్ ప్యాకెట్‌పైన ఒక హెల్ప్ లైన్ నంబర్ ఇవ్వాలని నిర్ణయించింది. ఆ నంబర్: 1800-11-2356.

భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశాల ప్రకారం ఈ నెల నుంచి సిగరెట్ ప్యాకెట్‌పై 'ఈరోజే మానేయండి, కాల్ చేయండి-1800-11-2356' అని ముద్రిస్తారు.

కొత్త ప్యాకెట్‌పై ముద్రించే చిత్రం, హెచ్చరిక రెండింటినీ మార్చబోతున్నారు. ప్యాకెట్‌పై ఈ హెల్ప్ లైన్ నంబరుతోపాటు పొగాకు వల్ల క్యాన్సర్ వస్తుంది లేదా పొగాకు వల్ల దుర్మరణం సంభవిస్తుంది. అని ముద్రించడం తప్పనిసరి చేస్తున్నారు.

సిగరెట్ మానడం ఎలా

సిగరెట్ ఎలా మానాలి?

ప్రభుత్వం చేసిన కొత్త హెచ్చరికలు తెలిసి అందరూ " అంటే హెల్ప్ లైన్ నంబర్ వల్ల సిగరెట్ తాగేవారు, దాన్ని తాగడం మానేస్తారా?" అని ప్రశ్నిస్తున్నారు.

అది తెలుసుకోడానికి మేం జాతీయ పొగాకు విముక్తి సేవా కేంద్రానికి ఫోన్ చేశాం.

ఈ సేవా కేంద్రాన్ని 2016 నుంచి దిల్లీలో నిర్వహిస్తున్నారు. హెల్ప్ లైన్‌కు ఫోన్ చేయగానే మొదట "పొగాకు మానేయాలనే మీ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. త్వరలోనే మా కౌన్సెలర్ మీతో మాట్లాడతారు" అని ఒక రికార్డెడ్ వాయిస్ వినిపిస్తుంది.

చాలాసార్లు కౌన్సెలర్ బిజీగా ఉండడం వల్ల ఎవరూ మాట్లాడలేరు. ఫోన్ కట్ అయిపోతుంది.

ఈ హెల్ప్ లైన్‌కు మూడు సార్లు ఫోన్ చేసి మాట్లాడలేకపోయినా, నాలుగోసారి మా ప్రయత్నం ఫలించింది. ఒక కౌన్సెలర్ మాతో మాట్లాడారు. మహిళ గొంతు విని ఆమె కాస్త ఆశ్చర్యపోయారు.

ఎందుకు ఆశ్చర్యపోయారని మేం ఆమెను అడిగాం. దానికి ఆమె దేశంలో కేవలం మూడు శాతం మహిళలు మాత్రమే పొగాకు తాగుతున్నారని చెప్పారు.

"సిగరెట్ మానాలనే హెల్ప్ లైన్ నంబరుకు ఎక్కువగా పురుషులే ఫోన్ చేస్తారు. ఒక వేళ మహిళలు ఫోన్ చేసినా, తమ భర్త, సోదరుడు లేదా తమ కుటుంబంలో ఎవరి గురించో మాట్లాడుతారు.

సిగరెట్ మానడం ఎలా

మాటల పరంపర మొదలు

ఈ హెల్ప్ లైన్లో కౌన్సెలర్ మొదట మిమ్మల్ని మీ సిగరెట్ తాగే చరిత్ర గురించి చెప్పమంటారు. ఉదాహరణకు మీరు ఎప్పటినుంచి సిగరెట్ తాగుతున్నారు? మీకు అది ఎప్పుడు వ్యసనంగా మారింది? మీరు రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు? ఇలా చాలా..

అది తెలుసుకోవడం వారికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ వివరాల వల్ల తమకు ఫోన్ చేసిన వ్యక్తితో సిగరెట్ వ్యసనం మాన్పించడం సులభమా, కష్టమా వారికి తెలుస్తుంది.

అన్నీ తెలుసుకున్న తర్వాత, కౌన్సెలర్ సిగరెట్ తాగే వ్యక్తిని ఒకటి అడుగుతారు. "సిగరెట్ మానేయడానికి డెడ్‌లైన్ పెట్టుకున్నారా?

అలా అడగడం వల్ల సిగరెట్ వ్యసనం మానేయడానికి వాళ్లు ఎంత సిద్ధంగా ఉన్నారు అనేది కౌన్సెలర్‌కు తెలుస్తుంది.

సిగరెట్ మానడం ఎలా

వ్యసనం వదిలించే క్లాస్ షురూ

మొదటి సలహా - ఉదయం లేవగానే 2 గ్లాసుల వేడి నీళ్లలో నిమ్మరసం పిండుకుని తాగాలి. నీళ్లలో తేనె కూడా వేసుకుని తాగచ్చు.

రెండో సలహా- సిగరెట్ తాగాలని ఎప్పుడు అనిపించినా "మీలో మీరు నేను సిగరెట్ తాగడం మానేయాలి" అనుకోవాలి. సిగరెట్ తాగడం మానేయాలనే సంకల్పం చాలా అవసరం.

మూడో సలహా- సంకల్పంతోపాటు, మీరు సిగరెట్ మానేయాలని డెడ్‌లైన్ పెట్టుకున్నాక కూడా మీకు సిగరెట్ తాగాలని అనిపిస్తే. ప్రశాంతంగా కూచుని, దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. నీళ్లు తాగాలి. అలా చేయడం వల్ల మీ ఆలోచనను మళ్లించవచ్చు.

నాలుగో సలహా- అల్లం, కరక్కాయలను బాగా నలగ్గొట్టి దాన్ని ఎండబెట్టాలి. దాన్లో నిమ్మకాయ పిండి, ఉప్పు వేసి ఒక డబ్బాలో వేసి ఎప్పుడూ మీ దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడు సిగరెట్ తాగాలని అనిపించినా, మీరు ఆ పొడి తింటూ ఉండాలి. దానితోపాటు నారింజ, బత్తాయి, ద్రాక్ష పండ్లు తినడం, వాటి జ్యూస్ తాగడం వల్ల కూడా సిగరెట్ తాగాలనే కోరికను చంపేయవచ్చు.

హెల్ప్ లైన్ నంబర్‌ నుంచి ఈ సలహాలు తీసుకున్న తర్వాత కౌన్సెలర్ మీకు వారం లోపల ఫాలో-అప్ కాల్ చేస్తారు.

ప్రస్తుతం ఈ హెల్ప్ లైన్ నంబరుకు రోజుకు 40-45 కాల్స్ వస్తున్నాయి. కౌన్సెలర్ చెప్పిన దాని ప్రకారం ఈ హెల్ప్ లైన్ గురించి వార్తాపత్రికల్లో ప్రకటన వచ్చిన రోజు వారికి వచ్చే కాల్స్ ఎక్కువగా ఉంటాయి.

ఈ హెల్ప్ లైన్ సెంటర్ ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకూ పనిచేస్తుంది. ఇక్కడ ప్రస్తుతం 14 మంది కౌన్సిలర్లు పనిచేస్తున్నారు.

హెల్ప్ లైన్ నంబర్‌ నుంచి అందే సాయాన్ని బట్టి సిగరెట్ లేదా పొగాకు మానే ప్రయత్నంలో మొదట్లో మనకు చికాకు, తడబాటు, ఆతృతగా ఉంటుంది. ఇది వారికి ఎన్ని సిగరెట్లు తాగే అలవాటు ఉంది, ఎన్నిరోజుల్నించీ ఉంది, అనేదానిపై ఆధారపడుతుంది.

సిగరెట్ మానడం ఎలా

హెల్ప్ లైన్ నంబర్ వల్ల లాభమేంటి?

కొత్త ఆదేశాల ప్రకారం సిగరెట్ ప్యాకెట్‌పై చిత్రాలు-హెచ్చరికలు ముద్రించడం వల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయని మ్యాక్స్ ఇన్‌స్టిట్యూట్ డాక్టర్ హరిత్ చతుర్వేది చెప్పారు.

"పొగాకు వ్యసనం వదులుకోవాలని అనుకోని వాళ్లను నేను ఇప్పటివరకూ చూళ్లేదు. ఇలా హెల్ప్ లైన్ నంబర్ సిగరెట్ ప్యాకెట్ వల్ల ఉండడం వల్ల సిగరెట్ మానేయడానికి ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి అనేది వాళ్లకు తెలుస్తుంది. అంతేకాదు, అప్పుడే సిగరెట్ తాగడం ప్రారంభించిన వారు కూడా అది చూసి మొదటే జాగ్రత్త పడతారు" అని ఆయన బీబీసీతో చెప్పారు.

భారతదేశంలో గత కొన్నేళ్లుగా పొగాకు ప్యాకెట్‌పై ముద్రించిన హెచ్చరికల వల్ల ఏటేటా ఆ వ్యసనం నుంచి బయటపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోందని డాక్టర్ హరిత్ చతుర్వేది చెప్పారు.

ఆస్ట్రేలియా ప్రభుత్వం 2006లో సిగరెట్ ప్యాకెట్‌పై ఇలాంటి ఒక హెల్ప్ లైన్ నంబర్ ముద్రించడం ప్రారంభించింది. ఇది అక్కడ ఎంత ఎఫెక్ట్ చూపించిందో 2009లో ఒక రిపోర్ట్ విడుదల చేశారు. దాని ప్రకారం ప్యాకెట్‌పై హెల్ప్ లైన్ నంబర్ వేశాక ఆ నంబరుకు ఫోన్ చేసేవారి సంఖ్య పెరిగింది. దీనిని బట్టి సిగరెట్ మానేయాలని అనుకునేవారికి అది ఎలాగో తెలియడం లేదనేది చెప్పవచ్చు.

ప్రపంచంలోని 46 దేశాల్లో పొగాకు ఉత్పత్తులను ప్యాక్ చేసేటప్పుడే ఈ నంబర్ వేస్తున్నారు.

"గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే(2016-17)లో పొగాకు ఉత్పత్తులపై ఉన్న హెచ్చరిక చిత్రాలను చూసి సిగరెట్ తాగేవారిలో 62 శాతం, బీడీ తాగేవారిలో 54 శాతం మంది వాటిని మానేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది" అని వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ భావనా ముఖోపాధ్యాయ్ చెప్పారు.

"ఒక నెల వరకూ ఎవరైనా సిగరెట్ ముట్టుకోకూడదు అనుకుంటే.. వాళ్లు మళ్లీ సిగరెట్ తాగే అవకాశం తక్కువ. కానీ ఎవరైనా ఆరు నెలల వరకూ సిగరెట్ తాగలేదంటే, వాళ్లు మళ్లీ సిగరెట్ తాగే అవకాశం ఉండదు" అని డాక్టర్ చతుర్వేది చెప్పారు.

సిగరెట్ మానడం ఎలా

జనం ఏమంటున్నారు?

భారత ప్రభుత్వం కొత్త ఆదేశాల గురించి ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని బీబీసీ భావించింది.

"సిగరెట్ ప్యాకెట్‌పై ఈరోజు కూడా హెచ్చరికలు ముద్రిస్తున్నారు. కానీ తాగే వారు ఇప్పటికీ తాగుతున్నారు. నేను కూడా ఇప్పటికీ తాగుతున్నాను. ప్యాకెట్‌పై హెల్ప్ లైన్ నంబర్ వేసినంత మాత్రాన ఎలాంటి తేడా ఉండదు" అని దిల్లీ విద్యార్థిని సదఫ్ ఖాన్ అన్నారు.

"కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడమో, లేదంటే జబ్బు పడడమో జరిగేవరకూ ఎవరూ సిగరెట్ మానరు. సిగరెట్ తాగడం మొదలుపెట్టడానికి, వదిలేయడానికీ ఎలాంటి కారణాలూ ఉండవు" అని ముంబైకి చెందిన మల్కిత్ సింగ్ అంటారు.

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే రిపోర్ట్ ప్రకారం దేశంలో 10.7 శాతం వయోజనులు పొగాకు సేవిస్తున్నారు. దేశంలో 19 శాతం పురుషులు, 2 శాతం మహిళలు పొగాకు తాగుతున్నారు.

ఇక కేవలం సిగరెట్ తాగే విషయానికే వస్తే 4 శాతం మంది వయోజనులు సిగరెట్ తాగుతున్నారు. సిగరెట్ తాగేవారిలో 7.3 శాతం మంది పురుషులు, 0.6 శాతం మంది మహిళలు ఉన్నారు.

ప్రపంచ ఆరోగ్యం సంస్థ నివేదిక ప్రకారం భారతీయ మహిళల్లో సిగరెట్ కంటే బీడీ తాగేవారే ఎక్కువ. దేశంలో 1.2 శాతం మంది మహిళలు బీడీ తాగుతున్నారు.

స్మోకింగ్

భారత్‌లో సిగరెట్‌ తాగడంపై చట్టం

2014లో భారత్‌లో ఒక చట్టం రూపొందించారు. సిగరెట్ ప్యాకెట్‌పై చిత్రంతోపాటూ 'సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం' అని ముద్రించడం తప్పనిసరి చేశారు. కానీ సిగరెట్ తయారీ కంపెనీలు ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. 2016లో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

భారత్‌లో పొగాకుకు సంబంధించిన ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధం ఉంది. 18 ఏళ్ల వయసులోపు వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. బహిరంగ ప్రాంతాల్లో సిగరెట్ తాగడంపై కూడా నిషేధం ఉంది. అలా ఎవరైనా చేస్తే వారికి జరిమానా విధించవచ్చనే నిబంధనలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

English summary
No Smoking Day: Helpline number given on cigarette packets
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X