• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఉత్తరాంధ్ర రాజకీయాలు: టీడీపీ కంచుకోట వైసీపీకి పెట్టని కోటగా మారుతోందా

By BBC News తెలుగు
|

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలకు ఉత్తరాంధ్ర ప్రాంతం చాలా కీలకం. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ల నుంచీ ఈ ప్రాంతం అనేక సంచలనాలకు వేదికగా నిలిచింది.

వి.వి.గిరి, ఆచార్య ఎన్జీ రంగా, గౌతు లచ్చన్న, పీవీజీ రాజు, తెన్నేటి విశ్వనాథం, ఎన్‌టీ రామారావు లాంటి ఉద్ధండులను చట్టసభలకు పంపిన చరిత్ర ఈ ప్రాంతానిది.

ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందన్న నమ్మకం రాజకీయాల్లో బలంగా ఉంది.

“స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లో కాంగ్రెస్-కమ్యూనిస్టు-సోషలిస్టుల మధ్య ఎక్కువగా రాజకీయాలు నడిచేవి” అని అంబేద్కర్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ లీలావర ప్రసాద్ బీబీసీతో అన్నారు.

“1957, 1962నాటి ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్, సోషలిస్టు నేతలలో పార్టీలు మారడం మొదలైంది. సోషలిస్టుగా ముద్రపడ్డ పీవీజీ రాజు కాంగ్రెస్‌ తరపున ఎంపీ అయ్యారు. కృషికార్‌ లోక్‌పార్టీ (కె.ఎల్‌.పి) రాకతో 1967లో ఉత్తరాంధ్రలో పలువురు కాంగ్రెస్‌వాదులు, కరుడుగట్టిన సోషలిస్టులు పెద్దసంఖ్యలో కె.ఎల్‌.పి వైపు మొగ్గు చూపారు. అప్పట్లో కె.ఎల్‌.పి తరఫున రాష్ట్ర శాసన సభకి ప్రతిపక్షనేతగా శ్రీకాకుళం జిల్లా సోంపేట నుంచి గెలిచిన గౌతు లచ్చన్న వ్యవహరించారు’’ అని ఆయన చెప్పారు.

''కమ్యూనిస్టు పార్టీలో చీలిక కారణంగా ఉత్తరాంధ్రలోనూ 1967 ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, సీపీఎం (ఎల్) పార్టీల తరపున పలువురు తలపడ్డారు. 1978 నాటికి కాంగ్రెస్‌వాదులు ఇందిరా కాంగ్రెస్‌లో చేరగా, సోషలిస్టు, ప్రజా సోషలిస్టు, కె.ఎల్‌.పి.లకు చెందిన నేతలు జనతా పార్టీవైపు మొగ్గు చూపారు" అని వివరించారు లీలా వరప్రసాద్‌.

టీడీపీ ఆవిర్భావంతో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పెను మార్పు మొదలైందని ఆయన అన్నారు.

గౌతు లచ్చన్న

టీడీపీ రాకతో మారిన రాజకీయాలు

1983లో వచ్చిన తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర కంచుకోటగా మారింది. కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీల నేతలు టీడీపీలో చేరిపోయారు.

అయితే తిరిగి 1989నాటికి టీడీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు పెరిగాయి. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలైన ఆనందగజపతిరాజు, రాజాన రమణి కాంగ్రెస్‌లోకి, విశాఖ మేయర్‌ డీవీ సుబ్బారావు బీజేపీలోకి మారారు.

ద్రోణంరాజు సత్యనారాయణ, భాట్టం శ్రీరామమూర్తి వంటి నాయకులు పూర్తిగా కాంగ్రెస్‌కే అంకితమయ్యారు. 1994 ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనంతో ఉత్తరాంధ్రలో కాంగ్రెస్‌ పూర్తిగా డీలాపడగా ఆ పార్టీ ద్వితీయ శ్రేణీ నాయకులు చాలా మంది టీడీపీలో చేరారు.

1982లో రాజకీయాల్లోకి వచ్చి అప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన కింజారపు ఎర్రన్నాయుడుకి 1989లో టీడీపీ టిక్కెట్ లభించలేదు. దీంతో హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఆయన, సోంపేట నుంచి గౌతు శివాజీలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచారు.

ఆ తరువాత వారిని అప్పటి అసెంబ్లీ స్పీకర్‌ కాంగ్రెస్‌ అనుబంధ సభ్యులుగా గుర్తించారు.

1995 ఆగస్టు సంక్షోభంలో ఉత్తరాంధ్రలో అధిక శాతం టీడీపీ నాయకులు చంద్రబాబు నాయకత్వాన్ని సమర్ధించగా, దాడి వీరభద్రరావు, కళావెంకటరావు, ప్రతిభాభారతి, అప్పయ్య దొరవంటి సీనియర్ నేతలు లక్ష్మీపార్వతి నేతృత్వంలోని ఎన్టీఆర్ టీడీపీవైపు ఉండిపోయారు.

వీరిలో అప్పయ్యదొర, కళా వెంకటరావు తప్ప మిగతావారు తిరిగి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీలో చేరారు.

పవన్ కల్యాణ్

కొత్త పార్టీల్లో పాత ముఖాలు

చిరంజీవి, జగన్‌ మోహన్‌రెడ్డి, పవన్‌ కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌లో కొత్తపార్టీలతో ప్రజల ముందుకు వచ్చారు. అయితే పార్టీలు కొత్తవే, కానీ అందులో నేతలు మాత్రం పాత వారే.

2008లో అప్పటికే అధికారంలో ఉండటంతో కాంగ్రెస్‌ నుంచి వలసలు పెద్దగా లేనప్పటికీ, టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రజారాజ్యంలో చేరారు. తమ్మినేని సీతారాం, దాడి వీరభధ్రరావు, కళా వెంకటరావు, గణబాబు, గంటా శ్రీనివాసరావు తదితరులు వీరిలో కొందరు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో కొందరు కాంగ్రెస్‌లోకి, మరికొందరు టీడీపీలోకి వెళ్లారు.

2011 మార్చిలో స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో కాంగ్రెస్‌ నాయకులు పెద్ద ఎత్తున చేరారు. కొణతాల రామకృష్ణ, ధర్మాన కృష్ణదాస్‌, గొల్ల బాబురావు, పెన్మత్స సాంబశివరావువంటి వారితోపాటు కాంగ్రెస్‌లోని ముఖ్యనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా చేసిన వారు చాలామంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

2014లో జనసేన స్థాపించిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి దించారు. అయితే, జనసేన పార్టీ ఉత్తరాంధ్రతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పెద్దగా ప్రభావం చూపలేదు. విశాఖ గాజువాక నుంచి పోటీ చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సైతం ఓడిపోయారు.

విజయనగరం

రాజులు- రాజకీయాలు

ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలో రాజకీయాలు విచిత్రంగా కనిపిస్తుంటాయి. శ్రీకాకుళంలో కొన్ని కుటుంబాలు, విజయనగరంలో రాజవంశానికి చెందినవాళ్లు రాజకీయాలు నడిపిస్తుంటారు. విశాఖలో మాత్రం పార్ట్‌టైమ్‌ నేతలదే హవా.

"శ్రీకాకుళం జిల్లాలో 1955 నుంచీ కుటుంబ రాజకీయాలే నడుస్తున్నాయి’’ అని ఏయూ పొలిటికల్ సైన్స్ రీసెర్చ్ స్కాలర్‌ పైడి రమేశ్‌బాబు బీబీసీతో అన్నారు.

“ఈ కుటుంబాల నుంచి చాలామంది రాష్ట్ర కేంద్ర స్థాయిల్లో ఉన్నత పదవులు నిర్వహించారు. గౌతు, మజ్జి, కిమిడి, పాలవలస, విశ్వాసరాయి, నిమ్మక, తమ్మినేని, బొడ్డేపల్లి, ధర్మాన, బగ్గు, కింజరాపు, కన్నేపల్లి కుటుంబాలు ఇందులో ప్రధానమైనవి. ఏ ఎన్నికల్లో చూసినా వారిలో వారే ఒకరిపై ఒకరు పోటీకి దిగుతూ వచ్చారు" అన్నారు రమేశ్ బాబు.

విజయనగరం జిల్లాలో రాజకీయాలన్ని రాజులవే. ఒకప్పుడు పాలకులుగా, సంస్థానాధీశులుగా చక్రం తిప్పిన విజయనగరం, బొబ్బిలి, కురుపాం రాజులు ఆ తరువాత వివిధ పార్టీల్లో చేరి జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.

పూసపాటి రాజులు మొదట కాంగ్రెస్‌లో, ఆ తర్వాత తెలుగుదేశంలో కలిసి పని చేశారు. టీడీపీ పుట్టినప్పటి నుంచి విజయనగరం జిల్లాలో పూసపాటి వంశీయులే ఆ పార్టీకి పెద్ద దిక్కు.

బొబ్బిలి రాజులు కూడా కాంగ్రెస్‌, టీడీపీలలో పని చేశారు. రెండు చోట్లా మంత్రి పదవులు అనుభవించారు. చారిత్రకంగా విజయనగరం, బొబ్బిలి రాజుల మధ్య శతృత్వం ఉన్నా, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒకే పార్టీలో కొనసాగారు.

“కురుపాం, శత్రుచర్ల వంశీయులు కూడా రాజకీయాల్లో పదవులు అనుభవించారు. విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన వ్యక్తి పెనుమత్స సాంబశివరాజు. ప్రస్తుత రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆయన శిష్యులే. బొత్స రాజకీయంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా గుర్తింపు కలిగిన నేత. విజయనగరం జిల్లాలో మండలస్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకూ అన్ని పదవులు అధిష్టించిన వారు బొత్స కుటుంబీకులే. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెల్చిన పతివాడ నారాయణ స్వామి కూడా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు" అని రమేష్ విజయనగరం జిల్లా రాజకీయాలను విశ్లేషించారు.

విశాఖపట్నం

ఇక విశాఖలో కుటుంబ రాజకీయాలు లేకపోయినా ఇది వలస నేతలకు విడిది కేంద్రంగా మారిందని రమేశ్‌బాబు అన్నారు.

''రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడికైనా విశాఖ ఆదరిస్తుంది అన్న పేరు వచ్చింది. ఇక్కడ నుంచి నాన్‌ లోకల్‌ నేతలు అనేకమంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఇప్పుడున్న వారిలో కూడా నాన్‌ లోకల్‌ లీడర్లే ఎక్కువ. ఎంపీ విజయ సాయి రెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు వంటి వారు ఈ కోవలోకే వస్తారు. అయ్యన్నపాత్రుడు, వాసుపల్లి గణేశ్‌ కుమార్, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, దాడి వీరభద్రరావు, పి. బాలరాజువంటివారు స్థానిక లీడర్లలో కొందరు’’ అని చెప్పారు.

ఉత్తరాంధ్ర వైసీపీ

టీడీపీ వర్సెస్ వైసీపీ

సమైక్య రాష్ట్రంలో కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఉత్తరాంధ్రలో మాత్రం తెలుగుదేశం పార్టీ హవా ఉండేది. ఈ ప్రాంతపు బీసీల్లో తెలుగుదేశానికి మంచి పట్టు ఉంది. అయితే ప్రస్తుతం టీడీపీ ఈ ప్రాంతంలో ప్రాభవం కోల్పోతోంది.

2014 ఎన్నికల్లో టీడీపీకి ఉత్తరాంధ్ర నుంచే 24 మంది ఎమ్మెల్యేలు ఉండగా, 2019 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం 23 సీట్లే సాధించింది టీడీపీ.

అదే వైసీపీ 2014లో ఉత్తరాంధ్రలో 9 సీట్లకు పరిమితం కాగా, 2019లో ఏకంగా 28 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్, జనసేనలకు ఉత్తరాంధ్ర ప్రజలు అసలు చోటే ఇవ్వలేదు.

2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఉన్న 34 అసెంబ్లీ స్థానాలకు కేవలం 6 సీట్లే టీడీపీ గెల్చుకుంది. విశాఖలో 4, శ్రీకాకుళంలో 2 చోట్ల విజయం సాధించగా విజయనగరంలో టీడీపీ ఒక్క సీటు కూడా పొందలేకపోయింది.

2022 లేదా 2023లో జమిలి ఎన్నికలు అనే వార్తలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బలపడాల్సిన టీడీపీ ఉత్తరాంధ్రలో మరింత బలహీనపడుతోంది.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెంనాయుడిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేసి బీసీలలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పట్టునిలుపుకోవాలని చంద్రబాబు భావించారు. కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అలాగే శ్రీకాకుళం ఎంపీ రామ్మెహన్‌ నాయుడు ప్రభావం కూడా పార్టీలో పెద్దగా కనిపించడం లేదు.

కార్యనిర్వాహక రాజధాని ప్రకటనతో విశాఖలోని టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులు వైసీపీ కండువాలను కప్పుకున్నారు. విశాఖలో దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ జగన్‌ పార్టీకి బహిరంగ మద్ధతు తెలిపారు. మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీలో క్రియాశీలంగా లేరు.

అశోక్ గజపతిరాజు

“టీడీపీకి అత్యంత కీలకమైన విజయనగరం జిల్లా రాజకీయం అంతా అశోక్‌ గజపతి రాజు కనుసన్నల్లోనే జరుగుతుండేది. కానీ ఇప్పుడు ఆ రాజుగారిని కాదని టీడీపీలో మరో వర్గం కొత్తగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా అశోక్‌ గజపతి నాయకత్వాన్ని ప్రశ్నిస్తోంది"అని విశాఖకు చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని టీడీపీ నాయకుడు బీబీసీతో అన్నారు.

2019 ఎన్నికల్లో అశోక్‌ గజపతి కుమార్తె అదితి గజపతిరాజుకు విజయనగరం శాసనసభ టిక్కెట్ ఇప్పించుకోవడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మీసాల గీతకు టిక్కెట్ లభించలేదు.

"2019 ఎన్నికల తరువాత పార్టీలో ఎవరున్నారు, ఎవరు లేరో తెలియడం లేదు. ఏడాదిగా పార్టీ సమావేశాలు జరగలేదు. పార్టీని బలపర్చేందుకే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాను. కోటలో కాకుండా ఇంకెక్కడైనా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాలనే మూడేళ్లుగా పార్టీలో చర్చ నడుస్తోంది" అని మాజీ ఎమ్మెల్యే గీత బీబీసీతో అన్నారు.

పార్టీలో సభ్యులుగా ఉన్న వారు కార్యాలయం ఎక్కడున్నా, వెళ్తారని అశోక్‌గజపతిరాజు అన్నారు.

"ఇదంతా చూస్తుంటే...పార్టీని బలహీనపర్చడానికి ప్రయత్నిస్తున్నారని అనిపిస్తోంది’’ అని తన బంగ్లాలో పెట్టిన మీడియా సమావేశంలో అశోక్‌ గజపతి రాజు అన్నారు.

విజయనగరం టీడీపీ నాయకులు

'పార్టీలో స్తబ్దత పెరిగింది’

ఉత్తరాంధ్ర టీడీపీలో స్తబ్ధత ఎక్కువైనట్లు కనిపిస్తోందన్నారు ఏయూ జర్నలిజం విభాగం ప్రొఫెసర్ సి.రామకృష్ణ.

1994 ఎన్నికల్లో టీడీపీ అధినేతగా ఉన్న ఎన్టీఆర్ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి గెలిచి సీఎం పదవి చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు.

"విజయనగరం టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న అశోక్ గజపతిరాజును పట్టించుకోకపోయినా పార్టీ నాయకుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్రకు చెందినవాడే అయినా అశోక్ గజపతి రాజుకు మద్దతుగా మాట్లాడలేదు’’ అని రామకృష్ణ అన్నారు.

''విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాసుపల్లి గణేశ్‌ కుమార్‌, మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుని పార్టీ అధిష్టానంగానీ, సీనియర్లు గానీ ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఇదంతా చూస్తుంటే ఉత్తరాంధ్రలో పార్టీ క్రమంగా బలం కోల్పోతున్నట్లు కనిపిస్తోంది’’ అని టీడీపీ ప్రస్తుత పరిస్థితిని ఆయన విశ్లేషించారు.

చంద్రబాబు నాయుడు

అప్పుడు తెలంగాణ... ఇప్పుడు ఉత్తరాంధ్ర

''ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో టీడీపీని వివిధ కారణాలతో వీడుతున్న వారు పెరుగుతున్నారు. ఇప్పటికే విజయనగరంలో సీనియర్ నాయకుడు గద్దె బాబురావు పార్టీని వీడారు. అశోక్‌ గజపతి రాజు మాన్సాస్‌ ట్రస్ట్‌లో చోటు చేసుకున్న పరిణామాలు, ఇటు కుటుంబలోని వివాదాలతో పెద్దగా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.

శ్రీకాకుళం జిల్లాలో కూడా తెలుగుదేశం పరిస్థితి అంతంత మాత్రమే. అచ్చెన్నాయుడు ఈఎస్‌ఐ స్కాంలో అరెస్టు కావడం, పార్టీ స్థైర్థ్యాన్ని దెబ్బతీసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో నాకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లు అని చెప్పి ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు...తెలంగాణకు దూరమయ్యారు.

ఇప్పుడు అమరావతి, విశాఖ రాజధానుల విషయంలో కూడా టీడీపీ గట్టిదెబ్బ తగిలింది. ఎవరిని కాదన్నా మరొక ప్రాంతానికి టీడీపీ అన్యాయం చేసిందనే విమర్శలు ఎదుర్కోవాలి. ఇది టీడీపీకీ పరీక్ష సమయంలాంటిది" అని గడచిన కొన్నేళ్లుగా టీడీపీ వ్యవహరాలను కవర్‌ చేస్తున్న సీనియర్ పాత్రికేయులు అన్నారు.

'ఎప్పటికీ టీడీపీ బలంగానే ఉంటుంది’

"ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. కానీ ఉత్తరాంధ్రలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. విజయనగరంలో అశోక్‌ గజపతి, మీసాల గీత మధ్య వివాదం సహా ఉత్తరాంధ్ర టీడీపీలోని సమస్యలన్నీ కుటుంబ సమస్యల్లాంటివే. అంతా సర్దుకుంటుంది. ఈ ప్రాంతంలో టీడీపీ ఎప్పటీకి బలంగానే ఉంటుంది" అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు బీబీసీతో అన్నారు.

టీడీపీలో నెలకొన్న ఈ పరిస్థితిని అవకాశంగా మలుచుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించిందని, ప్రత్యర్థి పార్టీని నిర్వీర్యం చేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తోందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఏయూ పొలిటికల్‌ సైన్స్‌ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ రవి అన్నారు.

"వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలోని టీడీపీ ముఖ్యనేతల్ని తమ పార్టీలో చేర్చుకోవడం అందులో భాగమే. విజయనగరం జిల్లాలోని అశోక్ గజపతి రాజు కుటుంబ రాజకీయాలు రచ్చకెక్కడం, సింహాచలం ఆలయ పాలక మండలి వివాదం, మాన్సాస్ ట్రస్ట్ వివాదం ఇవన్నీ ఆ రాజకీయ క్రీడలో భాగమే” అని ఆయన వ్యాఖ్యానించారు.

'టీడీపీకి ఇక్కడ స్థానం లేదు’

ఉత్తరాంధ్రలో టీడీపీ పని ఇక అయిపోయినట్టేనని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ బీబీసీతో అన్నారు.

'ఉత్తరాంధ్రలో టీడీపీ పూర్తిగా ఖాళీ అవుతుంది. కాంగ్రెస్, జనసేనల గురించి అసలు చర్చే అవసరం లేదు. ఈ మూడు పార్టీలకు క్యాడర్ ఇప్పటికే చేజారిపోయారు. స్థానిక ఎన్నికల తరువాత టీడీపీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక ఈ ప్రాంతంలో బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కేవలం పట్టణాలకు, నగరాలకు మాత్రమే పరిమితమైందన్న ముద్ర నుంచి ఆ పార్టీ బయటపడలేదు.

"టీడీపీ పార్టీని అణగదొక్కేందుకు వైసీసీ ప్రయత్నిస్తుంటే...ఆ స్థానంలో బీజెపీ ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. ఉత్తరాంధ్రలో బీజెపీకి నాయకులున్నారు. కానీ కార్యకర్తలు లేరు. అందుకే బీజెపీ ఇక్కడ ఎదగలేకపోతోంది. విశాఖలో కొంత ప్రభావం ఉన్నా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుతం దాని ప్రభావం కనిపించడం లేదు” అని రిటైర్డ్ ఫ్రొఫెసర్ రవి అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
YSRCP eyeing on north Andhra which is a strong hold for TDP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X