మాకు భయం లేదు, గెలుస్తాం: అరవింద్ కేజ్రివాల్
న్యూఢిల్లీ: తాను విశ్వాస తీర్మానం ఎదుర్కొనేందుకు ఎలాంటి భయాలకు లోనుకావడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అన్నారు. ఆయన నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం గురువారం శాసనసభలో విశ్వాస తీర్మానం ఎదుర్కోనున్న సందర్భంగా కేజ్రివాల్ మీడియాతో మాట్లాడారు. శాసనసభలో విశ్వాస తీర్మానం నెగ్గినా, నెగ్గకపోయినా తమకు ప్రజల మద్దతు ఉందని ఆయన తెలిపారు.
తాము విశ్వాస తీర్మానం నెగ్గినా, ఓడిపోయినా తమకు ఏమాత్రం భయం లేదని, తాము అధికారం కోసం ఎదురు చూడటం లేదని అరవింద్ కేజ్రివాల్ తేల్చి చెప్పారు. తాము ఎన్ని రోజులపాటు అధికారంలో ఉంటామనేది కూడా తమకు ముఖ్యం కాదని తెలిపారు. ఒక వేళ విశ్వాస తీర్మానం పట్ల మాకు భయం ఉండి ఉంటే దేవలయానికి వెళ్లి ప్రార్థనలు చేసుకునే వారిమని కేజ్రివాల్ చెప్పారు.

70 స్థానాలున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో 28 శాసనసభ స్థానాలు గెలుచుకున్నఆమ్ ఆద్మీ పార్టీ గత ఆదివారం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది శాసనసభ్యుల మద్దతును తీసుకుంది.
కాగా ఢిల్లీ శాసనసభలో ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి మనీష్ సిసోడియా విశ్వాస పరీక్ష తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు టోపీలు ధరించి సభలోకి రావడం పట్ల భారతీయ జనతా పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. బిజెపి ఎమ్మెల్యేల ఆందోళనల మధ్యే ఆప్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.















Click it and Unblock the Notifications