రాజీనామాకు షాకింగ్ కారణం తెలిపిన నితీష్: దండగమారి ప్రభుత్వం.. రద్దుకూ సిఫారసు
Nitish Kumar: ఊహించినట్టే- బిహార్ రాజకీయాలు మలుపు తిరిగాయి. అధికారంలో ఉన్న మహాకూటమి ప్రభుత్వం కుప్పకూలింది. ఈ కూటమి నుంచి బయటికి రావాలని జనతాళ్ (యునైటెడ్) నిర్ణయించింది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంది.
జేడీయూ- రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ మహా ఘట్‌బంధన్ సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. తన పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించారు. కొద్దిసేపటి కిందటే ఆయన పాట్నాలోని రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిశారు. తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.

అనంతరం రాజ్‌భవన్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. రాజీనామా చేయడానికి గల కారణాలను క్లుప్తంగా వెల్లడించారు. ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు రద్దు చేయాలని కోరినట్లు వివరించారు.
రాష్ట్ర పరిపాలన, రాజకీయాలు సవ్యంగా సాగట్లేదని నితీష్ కుమార్ వివరించారు. అందరి అభిప్రాయాలను తీసుకున్నామని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి క్షేత్రస్థాయిలో నివేదికలను తెప్పించుకున్నామని వివరించారు. మహాకూటమిలో భాగస్వామ్య పక్షాలైన ఆర్జేడీ, కాంగ్రెస్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
పని చేసే వాతావరణం లేకుండా చేశారని నితీష్ కుమార్ చురకలు అంటించారు. అందుకే- అన్ని కోణాల్లో ఆలోచించిన తరువాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మెజారిటీ నాయకుల నిర్ణయం మేరకే మహా కూటమి నుంచి బయటికి వచ్చామని, ఇక తరువాత ఏం చేయాలనేది త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.

కాగా- ఈ సాయంత్రం ఎన్డీఏ కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. తనకు మద్దతు ఇవ్వనున్న జేడీయూ, బీజేపీ- దాని మిత్రపక్షాల శాసన సభ్యుల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు అందజేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ కూటమిని ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు.
జేడీయూ, బీజేపీ, ఆవామీ లీగ్‌కు చెందిన 127 మంది సభ్యులు.. నితీష్ కుమార్ నాయకత్వాన్ని సమర్థించడం ఖాయంగా కనిపిస్తోంది. తనకు మద్దతు ఇస్తోన్న సభ్యులతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు అందజేసిన అనంతరం ఆయన ఆహ్వానం మేరకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications