వాజ్‌పేయి చనిపోయారని పాఠశాలకు సెలవిచ్చారు!
భువనేశ్వర్: మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి బతికుండగానే ఓ పెద్ద తప్పు జరిగిపోయింది. ఆయన చనిపోయారంటూ ఒడిశాలోని బాలాసోర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రద్ధాంజలి సభ నిర్వహించి నివాళులర్పించారు. అంతేగాక, పాఠశాలకు సెలవు కూడా ఇచ్చారు.
వివరాల్లోకి వెళితే.. ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కమలకాంత్ దాస్ ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమానికి వెళ్లినప్పుడు వాజ్‌పేయి చనిపోయారని మరో ఉపాధ్యాయుడు చెప్పాడట. దీంతో ఆయన పాఠశాలకు ఫోన్ చేసి సెలవు ప్రకటించారు.
విద్యార్థులందరినీ ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పారు. అంతకుముందు, వాజ్‌పేయి ఆత్మకు శాంతి చేకూరాలంటూ పాఠశాల మిగతా ఉపాధ్యాయులు, విద్యార్థులు కలసి మౌనం పాటించారు. అనంతరం ఇళ్లకు వెళ్లిపోయారు.

ఈ విషయమంతా తెలుసుకున్న కొందరు స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదుచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో కలెక్టర్ ఘటనపై విచారణకు ఆదేశించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి.. పాఠశాల ప్రధానోపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు.
ఇది ఇలా ఉండగా, గత జులైలో జార్ఖండ్ మంత్రి నీరా యాదవ్ కూడా భారత మాజీ రాష్ట్రపతి ఏపిజె అబ్దుల్ కలాం మరణించకముందే ఆయన చనిపోయారని.. నివాళులర్పించారు. ఈ ఘటనపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఆ మంత్రి విచారం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత జులై 27న అబ్దుల్ కలాం మృతి చెందారు.












Click it and Unblock the Notifications