పాక్ తో యుద్దమే శరణ్యం ; 'ఉగ్రవాదులకు ఆధార్ కార్డులున్నాయి' : సుబ్రహ్మణ్య స్వామి
న్యూఢిల్లీ : పదే పదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ భారత్ తో కవ్వింపు చర్యలకు పాల్పడుతోన్న పాక్ తో యుద్దమే శరణ్యం అంటున్నారు బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి. సోమవారం ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్బంగా.. ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీఏ ప్రభుత్వంలోనే స్లీపర్ సెల్స్ పెరిగిపోవడంతో పాటు.. దేశంలో పలువురు ఉగ్రవాదులకు ఆధార్ కార్డులు ఉన్నాయంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు స్వామి.
ఇక భారత్ పాక్ సరిహద్దులో చెలరేగుతోన్న ఉద్రిక్తతల గురించి స్పందిస్తూ.. 'యుద్ధం తప్ప మరో దారి లేనట్లుగానే కనిపిస్తోంది. మన మౌనాన్ని పాకిస్థాన్ తప్పుగా అర్థం చేసుకుంటోంది, కాబట్టి పాకిస్థాన్ కు గుణపాఠం చెప్పాల్సిన అవసరముంది' అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు స్వామి. పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడడం, బారాముల్లాలో మరోసారి ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

యూపీఏ హయాంలో దేశంలో బలపడిపోయిన స్లీపర్ సెల్స్ ఇప్పుడు దాడులకు తెగబడుతున్నారన్నారు. దేశంలో పాగా వేసిన కొందరు ఉగ్రవాదులకు ఆధార్ కార్డులు కూడా ఉన్నాయన్నారు స్వామి. బారాముల్లాలో జరుగుతున్న దాడులకు కారణం గత యూపీఏ వైఫల్యమేనని విమర్శించారు. పాక్ నటులకు మద్దతు పలికిన సల్మాన్ గురించి పరోక్షంగా ప్రస్తావించిన స్వామి.. ప్రస్తుతం పాక్ తో భారత్ ఘర్షణ పడుతోందన్న విషయం గుర్తించాలన్నారు. పాక్ నుంచి ఎవరిని ఇండియాకు అనుమతించకూడదని సూచించారు.












Click it and Unblock the Notifications