'ఆపరేషన్ సింధూర్' వెనుక మాస్టర్ మైండ్ - మోదీ నమ్మిన జేమ్స్ బాండ్..!!
ఆపరేషన్ సింధూర్. భారత సైన్యం మరో సారి తమ శక్తి యుక్తిలను చాటిన ఆపరేషన్. పెహల్గామ్ ఉగ్ర దాడి తరువాత అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉగ్రవాదుల పైన భారత సైన్యం మెరుపు దాడి చేసింది. పాక్ తో పాటుగా పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టు బెట్టింది. కాగా, నాడు సర్జికల్ స్ట్రైక్స్.. నేడు ఆపరేషన్ సింధూర్ వెనుక మోదీ టీంలో మాస్టర్ మైండ్ కీలకంగా వ్యవహరించారు. జేమ్స్ బాండ్ గా పిలిచే ఆ మాజీ ఐపీఎస్ ఇప్పుడు ఈ ఆపరేషన్ల వెనుక ప్రధాన పాత్ర పోషించారు. పాదరసం లాంటి ఆలోచనలతో శత్రువులను మట్టు బెట్టే సామర్ధ్యంతో ప్రధాని మోదీకి నమ్మిన బంటుగా మారారు.
దోవల్ ది జేమ్స్ బాండ్
ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన సమయంలోనే మరో కీలక నియామకం జరిగింది. ప్రధాని మోదీ ఏరి కోరి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ ను ఎంపిక చేసారు. ఈ నిర్ణయం వెనుక పెద్ద చరిత్రే ఉంది. అజిత్ దోవల్ 1968 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. అసాధారణ మేధస్సు ఆయన సొంత. ఆయనను తరచుగా జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మిలిటరీ ఆపరేషన్స్.. శత్రు దేశాల గుట్టు దోవల్ కు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదు. ఇప్పుడు జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న దోవల్ సర్వీసులో ఉన్న సమయంలో పాకిస్తాన్‌లో 7 సంవత్సరాలు రహస్యంగా గడిపారు. అక్కడి రహస్యాలను భారత్ కు అందించటంలో కీలక పాత్ర పోషించారు.

మోదీ నమ్మిన అధికారి
అదే విధంగా ఖలిస్తాన్ ఉగ్రవాదం సమయంలోనూ అజిత్ దోవల్ ఉగ్రవాద గ్రూపులను చొరబాటు చేయడానికి పనిచేసే చురుకైన ఫీల్డ్ ఏజెంట్ గా వ్యవహరించారు. ఆపరేషన్ బ్లాక్ థండర్‌కు ముందు, దోవల్ గోల్డెన్ టెంపుల్ ప్రాంతంలో రిక్షా పుల్లర్‌గా పనిచేశారు. తరువాత గోల్డెన్ టెంపుల్ లోపల దాక్కున్న ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. వారికి మద్దతు ఇవ్వడానికి పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్‌గా నటిస్తూ భారత ప్రభుత్వానికి సమాచారం చేరవేసేవారు. కాందహార్‌లో IC 814 హైజాకర్లతో చర్చలు జరపటంలో కీలక పాత్ర పోషించారు. ఇక, ప్రధాని గా మోదీ బాధ్యత లు చేపట్టిన సమయంలోనే కీలకమైన జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. నాటి నుంచి పాకిస్థాన్ తో సహా విదేశాలతో సంబంధాలు.. సైనిక ఆపరేషన్లలో దోవల్ నిర్ణయాత్మక శక్తిగా మోదీ టీంలో వ్యవహరిస్తున్నారు.
సర్జికల్ స్ట్రైక్స్.. ఆపరేషన్ సింధూర్
భారత్ లో ఉగ్రదాడుల నియంత్రణలో ప్రధాన భూమిక దోవల్ దే. ఇక, ప్రధాని మోదీ ప్రతీ విదేశీ పర్యటనలోనూ దోవల్ ఉండాల్సిందే. 2016 లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాల పైన భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ వెనుక మొత్తం ప్లాన్ దోవల్ అమలు చేసినట్లు చెబుతారు. ఇక, తాజా గా పహల్గాం ఘటన తరువాత వరుసగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర సక్సెస్ వరకు ప్రతీ నిర్ణయం వెనుక అజిత్ దోవల్ స్కెచ్ ఉంటుంది. విదేశీ - సైనిక చర్యల్లో దోవల్ సూచనలకు ప్రధాని మోదీ ప్రాధాన్యత ఇస్తారు. ఇక.. అర్ద్రరాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్ ను ప్రధాని మోదీ స్వయంగా పర్య వేక్షిస్తున్న సమయంలోనూ దోవల్ ప్రతీ క్షణం అప్డేట్స్ మోదీకి అందించారని సమాచారం. దీంతో, ఆపరేషన్ సింధూర ద్వారా మరోసారి అజిత్ దోవల్ సెన్సేషన్ గా నిలుస్తున్నారు.












Click it and Unblock the Notifications