ఒడిశా నూతన మంత్రివర్గం: 21 మంత్రులు ప్రమాణం, ఐదుగురు మహిళలకు స్థానం
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ క్యాబినెట్‌లోని 21 మంది కొత్త మంత్రులు ఆదివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పదవీ ప్రమాణాలు, గోప్యత ప్రమాణం చేశారు. మంత్రివర్గంలోని అందరనీ రాజీనామా చేయాలని శనివారం సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఆ మేరకు 20 మంది రాజీనామాలు సమర్పించగా.. కొత్త మంత్రివర్గానికి మార్గం సుగమమైంది. భువనేశ్వర్‌లోని లోక్‌సేవ భవన్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఒడిశా గవర్నర్ గణేశీ లాల్.. సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.

దాదాపు 13 మంది మంత్రులు క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, మరో ఎనిమిది మంది రాష్ట్ర మంత్రిగా (MoS) ప్రమాణ స్వీకారం చేశారు. నవీన్ గత మంత్రివర్గంలో 20 మంది సభ్యులు ఉన్నారు.
కొత్తగా చేరిన కేబినెట్ మంత్రులు- జగన్నాథ్ సారకా, నిరంజన్ పూజారి, రణేంద్ర ప్రతాప్ స్వైన్, ప్రమీలా మల్లిక్, ఉషా దేవి, ప్రఫుల్ల కుమార్ మల్లిక్, ప్రతాప్ కేశరీ దేబ్, అటాను సబ్యసాచి నాయక్, ప్రదీప్ కుమార్ అమత్, నాబా కిషోర్ దాస్, అశోక్ చంద్ర పాండా, తుకుని సాహు, రాజేంద్ర ధోలాకియా.
అదేవిధంగా సమీర్ రంజన్ దాష్, అశ్విని కుమార్ పాత్ర, ప్రీతిరంజన్ ఘరాయ్, శ్రీకాంత సాహు, తుషారకాంతి బెహెరా, రోహిత్ పూజారి, రీటా సాహు, బసంతి హేంబ్రామ్‌లు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అయితే కొత్త మంత్రులకు పట్నాయక్ ఇప్పటి వరకు శాఖలను పంపిణీ చేయలేదు. సాయంత్రానికి పంపిణీ చేసే అవకాశం ఉంది.
ఏడుగురు బీజేడీ శాసనసభ్యులు - రాజేంద్ర ధోలాకియా, అశ్విని కుమార్ పాత్ర, రోహిత్ పూజారి, శ్రీకాంత సాహు, ప్రీతిరంజన్ ఘరాయ్, బసంతి హెంబ్రామ్, రీటా సాహు, వారి రాజకీయ చరిత్రలో మొదటిసారిగా మంత్రులుగా చేరారు. అదే విధంగా, జగన్నాథ్ సారకా, అశోక్ పాండా మంత్రివర్గం నుంచి క్యాబినెట్ హోదాకు పదోన్నతి పొందారు.












Click it and Unblock the Notifications