తుపాను బీభత్సం.. రేపటి నుంచి మూడు రోజులపాటు పాఠశాలలు మూసివేత
అక్వాన్ తుపాను కారణంగా ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తుపాను ప్రభావం ఉన్న ఆరు జిల్లాల్లో రేపటినుంచి మూడు రోజులపాటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధిత అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 20 మధ్యాహ్నం నాటికి నార్త్ ఏపీ, యానాం అలాగే దక్షిణ ఒడిషా ప్రాంతాల్లో అక్వాన్ తుపాను తీవ్ర ప్రభావం చూపుతుందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఒడిషా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐఎండీ అందించిన సమాచారం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల 30 నిమిషాల సమయానికి అక్వాన్ తుపాను బంగాళాఖాతంలోని సౌత్ అలాగే వెస్ట్ సెంట్రల్ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది.
ఇక ఏపీ విషయానికి వస్తే.. తుపాను నరసాపురానికి 500 కి.మీ. దూరంలో అలాగే చెన్నైకి 560 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే కళింగపట్నానికి 540 కి.మీ. దూరంలో.. పూరీకి 690 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. నవంబర్ 21 మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఇక తుపాను ప్రభావం కారణంగా నవంబర్ 19న ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 60-70 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

మరోవైపు అక్వాన్ తుపాను తెలంగాణపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. దాంతోపాటు రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
