15 ఏళ్ల తర్వాత బీజేపీతో పొత్తు,నాడు ఎందుకు విడిపోయారు..?
లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీలు వేగాన్ని పెంచాయి. పొత్తులు లెక్కలు తేల్చుకునే పనిలో పడ్డాయి. ప్రాంతీయ పార్టీల వైపు జాతీయ పార్టీలు చూస్తుండగా.. వారితో కలిసి వెళితే వచ్చే లాభాలను ప్రాంతీయ పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీ టీడీపీ కలయిక దాదాపు ఖరారైందనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఎన్డీయే-నవీన్ పట్నాయక్ బీజేడీ పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
ఒడిషాలో తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్.ఒకప్పుడు ఎన్డీయేలో నవీన్ పట్నాయక్ పార్టీ ఉన్నింది. అయితే కొన్ని కారణాలతో బయటకు వచ్చేసింది. తాజాగా బీజేడీతో బీజేపీ అగ్రనాయకత్వం చర్చలు జరుపుతోంది. బీజేడీ ఎన్డీయే కూటమిలో చేరడం దాదాపు ఖాయమైపోయిందనే వార్త ప్రచారంలో ఉంది. ఇక అధికారిక ప్రకటనే తరువాయంటూ ఢిల్లీలో వార్త షికారు చేస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి బిజూ జనతాదళ్ పార్టీ 2009లో బయటకు వచ్చేసింది. అంతకుముందు 11 ఏళ్లపాటు ఎన్డీయే కూటమితో బీజేడీ ప్రయాణించింది. 2009లో సీటు పంపకాల్లో విబేధాలు తలెత్తడంతో ఎన్డీయేకు గుడ్‌బై చెప్పేసి సొంతంగతా బరిలోకి దిగింది.

ఇక తాజాగా రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్న వేళ బీజేపీకి 8 లోక్‌సభ సీట్లు ఇచ్చేందుకు బీజేడీ అంగీకారం తెలిపినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే బీజేపీ మాత్రం మరొక సీటు పెంచి మొత్తంగా 9 చేయాలని పట్టుబడుతోంది. అదే సమయంలో ఒడిషా అసెంబ్లీ స్థానాలపై కూడా ఒక క్లారిటీ వచ్చినట్లు సమాచారం. బీజేపీకి 55 సీట్లు దక్కవచ్చని తెలుస్తోంది.2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించగా 23 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది.
ఇదిలా ఉంటే సీఎం నవీన్ పట్నాయక్ నివాసంలో బీజేడీ నేతలు దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిపారు.అదే సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమై పొత్తులపై చర్చించారు.ఇక నవీన్ పట్నాయక్‌తో చర్చలు ముగిసిన తర్వాత బీజేడీ ఉపాధ్యక్షుడు ఎమ్మెల్యే దేవీ ప్రసాద్ మిశ్రా మాట్లాడారు. బీజేపీతో పొత్తుపై చర్చలు జరిపామని చెప్పిన ఆయన... ఒడిషా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నవీన్ పట్నాయక్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించిందని ఆయన గుర్తు చేశారు.
1998లో బీజేడీ బీజేపీలు పొత్తు పెట్టుకున్నాయి. వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన రెండు పార్టీలు మంచి ఫలితాలనే రాబట్టాయి. అయితే 2008లో కంధమాల్ అల్లర్లు జరిగాయి. దీంతో ఇంటా బయటా దీనిపై పెద్ద రచ్చే జరిగింది. అనంతరం 2009లో బీజేడీ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి సొంతంగా పోటీ చేస్తోంది. 2008 ఆగష్టు 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరిగిన అల్లర్లలో 40 క్రైస్తవులు మరణించగా 395కు పైగా చర్చిలను కూల్చివేయడం జరిగింది.600 గ్రామాల్లో దాడులు జరిగాయి.5600కు పైగా ఇళ్లల్లో దోపిడీ జరిగింది.ఈ ఘటనతో 54వేల మంది నిరాశ్రయులయ్యారు.
విశ్వహిందూ పరిషత్ నేత స్వామి లక్ష్మానంద్ సరస్వతితో పాటు ఆయన నలుగురు అనుచరులను మాస్కులు ధరించిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హతమార్చారు. దీంతో అల్లర్లు చెలరేగాయి. అయితే మావోయిస్టులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానించగా... కందమాల్ జిల్లాలోని క్రైస్తవ మతానికి చెందిన గిరిజనులే ఈ హత్యలు చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేయడంతో అల్లర్లు చెలరేగాయి.ఈ ఘటనతో బీజేడీ బీజేపీ మధ్య గ్యాప్ ఏర్పడి వారి పొత్తులపై ప్రభావం చూపింది.












Click it and Unblock the Notifications