‘సార్‌ని కాదు! నేను మేడమ్‌ను’: ప్రభుత్వ అధికారి
భువనేశ్వర్: గత 32ఏళ్లుగా పురుషుడిగా ఉంటున్న ఓ ప్రభుత్వ అధికారి.. తాను పురుషుడిని కాదు థర్ జెండర్‌ని అని చెప్పుకుంటున్నారు. ఇక నుంచి తనను మేడమ్ అని పిలవాలని కోరారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ఒడిశా రాష్ట్రంలో ఆర్థిక విభాగంలో ప్రభుత్వ అధికారిగా కొనసాగుతున్న రతికాంత ప్రధాన్ అనే వ్యక్తి.. ఇప్పుడు తన పేరును ఐశ్వర్య రుతుపర్ణ ప్రధాన్‌గా మార్చుకున్నట్లు తెలిపారు. ఇందుకు ఆ విభాగం నుంచి అనుమతి కూడా లభించింది.
ఇటీవల ట్రాన్స్‌జెండర్లను థర్డ్‌జెండర్‌గా గుర్తిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో తాను తన జెండర్‌ను బయటికి చెప్పుకునేందుకు అవకాశం వచ్చిందని ప్రధాన్ తెలిపారు. థర్డ్ జెండర్లకు రాజ్యాంగ హక్కులు కల్పించడం స్వాగతించదగ్గ విషయమని చెప్పారు.

కందమాల్ జిల్లాకు చెందిన ప్రధాన్.. తనకు చిన్ననాటి నుంచి జరిగిన అవమానాలను కూడా వెల్లడించారు. తన నిర్ణయాన్ని మొదట తన తండ్రి(రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి), బంధువులు, స్నేహితులు అంగీకరించలేదని చెప్పారు. అయితే, ఇప్పుడిప్పుడే అందరూ తన నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారని తెలిపారు.
‘నేను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు ఓ అఫిడవిట్ దాఖలు చేశాను. తానిప్పుడు ఐశ్వర్య రుతుపర్ణ ప్రధాన్‌గా మారినట్లు అందులో పేర్కొన్నాను. నా పేరు, లింగమార్పిడికి సంబంధించిన వివిధ పత్రాలను దాఖలు చేశాను. నా లింగమార్పిడి, పేరు మార్పిడికి సంబంధించి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా' అని ప్రధాన్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications