పెట్రోల్, గ్యాస్ సంక్షోభం.. దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్..??
కరోనా కారణంగా దాదాపు రెండేళ్లపాటు ప్రపంచ దేశాలు అతలాకుతలం అయ్యాయి. ప్రపంచ దేశాల్లో ఈ మహమ్మారి తీసుకొచ్చిన మార్పులు చాలానే ఉన్నాయి. థియేటర్లు మూతపడడం వల్ల ఓటీటీలు పుట్టుకొచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం విస్తృతంగా పెరిగింది. ప్రజలకు శుభ్రతపై అవగాహన రెట్టింపు అయింది. ఇప్పటికీ బయటకు వెళ్లి వస్తే చేతులు కడుక్కోవడం, మాస్కు ధరించడం అలవాటుగా మారిపోయింది. కొవిడ్-19 మన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితే ప్రపంచ దేశాల్లో కనిపిస్తోంది.
ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో ఆర్థిక సంక్షోభం వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. మార్చి 2న హార్మూజ్ జలసంధిని మూసివేసిన విషయం తెలిసిందే. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాతోపాటు అటు సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్ లాంటి దేశాల్లోనూ యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ప్రపంచ దేశాలకు ముడి చమురును పంపాలంటే హార్మూజ్ జలసంధి మాత్రమే కీలకంగా ఉంది. ఇప్పుడు ఆ జలసంధి మూసివేసిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి.
మరోవైపు ఇప్పటికే పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలు కేవలం 26 రోజులకు మాత్రమే సరిపోతాయి. ఆ తర్వాత దేశం ఆగిపోయే పరిస్థితి ఉంది. దాంతో ముందు జాగ్రత్తగా వర్క్ ఫ్రం హోం ప్రకటించింది పాకిస్థాన్. ఇంటి నుండే పనులు చేసుకోండి.. ఆఫీసులకు రావొద్దు.. అనవసరంగా బయట తిరగొద్దు అని ఆదేశాలు జారీ చేసింది.

అయితే భారత్ లోనూ ఇలాంటి పరిస్థితే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్ లోనూ ఆయిల్ ధరలు పెరగడం, గ్యాస్ కొరత ఏర్పడటం వల్ల ఆఫీసులకు వెళ్లే ఖర్చు అధికమవుతోంది. రవాణా ఖర్చులు పెరగడంతో ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయమే.. భారత్ లోనూ అమలయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే పెట్రోల్ ఖర్చులు తగ్గిపోవడం, ట్రాఫిక్ టెన్షన్ తప్పడం లాంటి లాభాలు ఉన్నాయి. కానీ నిత్యావసరాల ధరలు పెరగడం, ఇంటి ఖర్చులు పెరగడం లాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications