ఓలా క్యాబ్ డ్రైవర్: కారులో భార్యను కాల్చేశాడు
చెన్నై: తమిళనాడులో ఓలా క్యాబ్ డ్రైవర్ తన భార్య బ్రతికుండగానే కారులో పెట్టి నిప్పంటించి పరారైనాడు. తీవ్రగాయాలైన ఆమె చికిత్స పొందుతూ మరణించింది. తన భర్త నిప్పంటించి పారిపోయాడని ఆమె పోలీసులకు చెప్పి మరణించింది.
చెన్నైలోని అలైమ్మన్ కోయిల్ స్ట్రీట్ లో నివాసం ఉంటున్న ప్రేమ (28) మరణించిందని పోలీసులు చెప్పారు. చెంగల్ పేట్ కు చెందిన ప్రేమ, నాగరాజు (30)ల వివాహం ఐదు సంవత్సరాల క్రితం జరిగింది. వీరు అలైమ్మన్ కోయిల్ స్ట్రీట్ లో నివాసం ఉంటున్నారు.
నాగరాజ్, ప్రేమ దంపతులకు తిషాంత్ రాజ్ (4), యశవంత్ రాజ్ (2) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాగరాజ్ ఓలా క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆదివారం నాగరాజ్ భార్య, కుమారులను పిలుచుకుని కారులో బయటకు వెళ్లాడు.
నందనం ప్రాంతానికి వెళ్లిన సమయంలో కుటుంబ విషయంలో నాగరాజ్, ప్రేమ గొడవపడ్డారు. ఇద్దరి మద్య మాటామాటా పెరిగింది. అత్యవసరానికి కారులో పెట్టిన పెట్రోల్ తీసుకుని మీద పోసుకున్న ప్రేమ నేను ఆత్మహత్య చేసుకుంటానని భర్తను బెదిరించింది.
ఆ సమయంలో కారు దిగిన నాగరాజ్ భార్య, ఇద్దరు కుమారులను కారులో పెట్టి డోర్లు లాక్ చేసి నిప్పంటించి పరారైనాడు. కారుకు మంటలు వ్యాపిస్తున్న సమయంలో ప్రేమ కారు అద్దాలు పగలగొట్టింది.

కారులో ఉన్న ఇద్దరు పిల్లలను బయటకు పంపిచింది. చివరికి ఆమె బయటకు వచ్చింది. అయితే ఆమె 90 శాతం కాలిపోయింది. అటు వైపు వెలుతున్న వారు విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను వెంటనే కేఎంసీ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో తన భర్తే నిప్పంటించి పరారైనాడని ప్రేమ పోలీసులకు చెప్పింది. చికిత్స విఫలమై ప్రేమ మరణించిందని పోలీసులు చెప్పారు. ఇద్దరు పిల్లలకు గాయాలు కావడంతో కేఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.
ప్రేమ తల్లి అమరావతి ఫిర్యాదు చెయ్యడంతో సైదాపేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాగరాజు మారుతి డిజైర్ కారు తీసుకుని ఓలా ట్యాక్సీ కంపెనీకి అటాచ్ చేశాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications