వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒమిక్రాన్: కోవిడ్ సోకిన వ్యక్తి నుంచి వైరస్ వ్యాపించటం ఎన్ని రోజులకు ఆగిపోతుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కరోనావైరస్ దగ్గుతున్న అమ్మాయి

కరోనావైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా చాలా దేశాల్లో కోవిడ్ కేసులు మళ్లీ అమాంతంగా పెరిగిపోతున్నాయి.

అయితే.. మొదటి వేరియంట్ల కన్నా ఒమిక్రాన్ కేసుల్లో లక్షణాలు, వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.

అంటే ఈ వేరియంట్ సోకిన వారు, ముఖ్యంగా అప్పటికే కోవిడ్ వ్యాక్సీన్లు తీసుకుని ఉంటే.. ఆస్పత్రిపాలయ్యే అవకాశాలు, చనిపోయే ప్రమాదం చాలా తక్కువగా ఉందని చెప్పొచ్చు.

అందుకే పలు దేశాలు.. కోవిడ్ సోకిన వారి ఐసొలేషన్ కాల పరిమితికి సంబంధించిన నిబంధనలను సవరిస్తున్నాయి.

కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించి ఇప్పటివరకూ మనం చూసిన వాటిలో ఒమిక్రాన్ తెస్తున్న మార్పులేమిటో ఇక్కడ చూద్దాం.

కరోనావైరస్

వైరస్ సోకిన వ్యక్తిలో లక్షణాలు కనిపించటానికి ఎంత కాలం పడుతుంది?

ప్రస్తుతం ఒమిక్రాన్ మీద అధ్యయనాలు చాలా తక్కువగానే ఉన్నప్పటికీ.. ఇప్పటివరకూ చూసిన దానిప్రకారం ఈ వేరియంట్‌కు మరింత ఎక్కువగా వ్యాపించే సామర్థ్యం ఉంది. అంతేకాదు.. తొలి రకాల కన్నా ఈ రకం వైరస్‌ ఇంక్యుబేషన్ కాలం చాలా తక్కువగా ఉంది.

వైరస్ సోకినప్పటి నుంచి లక్షణాలు కనిపించటానికి మధ్య ఉండే కాలాన్ని ఇంక్యుబేషన్ కాలం అంటారు.

కరోనావైరస్ తొలి వేరియంట్లు సోకిన వారిలో సాధారణంగా వైరస్ సోకిన తర్వాత ఐదు లేదా ఆరు రోజులకు లక్షణాలు కనిపించాయి. డెల్టా వేరియంట్‌కయితే నాలుగు రోజుల్లో లక్షణాలు కనిపించాయి.

ఒమిక్రాన్ విషయంలో ఇప్పటివరకూ తెలిసినదాని ప్రకారం.. ఇంక్యుబేషన్ కాలం రెండు, మూడు రోజులుగానే ఉంది.

''ఒమిక్రాన్ రెప్లికేషన్ చాలా వేగంగా ఉన్నట్లు కనిపిస్తోంది’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ సలహాదారు, అంటువ్యాధులు, క్లినికల్ జెనెటిక్స్ నిపుణుడు డాక్టర్ విసెంటి సొరియానో బీబీసీతో చెప్పారు.

''వైరస్ సోకిన ఒక్క రోజులోనే దాని రెప్లికేషన్ మొదలవుతోంది. రెండు రోజుల్లోనే లక్షణాలు కనిపిస్తున్నాయి’’ అని స్పెయిన్‌లోని ఇంటర్నేషన్ యూనివర్సిటీ ఆఫ్ లా రియోజా ప్రొఫెసర్ కూడా అయిన సొరియానో వివరించారు.

నిజానికి అమెరికాలో ఆరు ఒమిక్రాన్ కేసులపై నిర్వహించిన ప్రాథమిక అధ్యయనాన్ని గత డిసెంబరులో ప్రచురించారు. దాని ప్రకారం.. ఈ వేరియంట్ సగటు ఇంక్యుబేషన్ కాలం మూడు రోజులుగా ఉంది.

కరోనావైరస్

ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తి నుంచి ఎన్ని రోజుల వరకు మిగతా వారికి సోకవచ్చు?

ఎవరికైనా కోవిడ్ వైరస్ సోకిన తొలి దశలోనే వారి నుంచి ఇతరులకు సోకే అవకాశం అధికంగా ఉంటుందన్నది తెలిసిందే.

ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో లక్షణాలు కనిపించటానికి ముందు ఒకటి, రెండు రోజుల నుంచీ.. లక్షణాలు కనిపించిన తర్వాత రెండు, మూడు రోజుల వరకూ.. వారి నుంచి ఇతరులకు ఈ వైరస్ సోకవచ్చు.

''ఈ వైరస్ ఎవరి నుంచైనా ఇతరులకు కేవలం ఐదు రోజుల వరకే సోకుతుందని మేం భావిస్తున్నాం. అంటే.. కోవిడ్ టెస్టులో పాజిటివ్ నిర్ధారణ అయిన రోజును ఆ వైరస్ సోకిన రెండో రోజుగా పరిగణించవచ్చు. అలా పాజిటివ్ వచ్చిన తర్వాత మూడు నుంచి ఐదు రోజుల వరకూ వారి నుంచి ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది’’ అని ప్రొఫెసర్ సొరియానో వివరించారు.

దీనినిబట్టి.. ఒమిక్రాన్ వైరస్ మన శరీరంలో కేవలం ఏడు రోజుల వరకే ఉంటున్నట్లుగా కనిపిస్తోంది.

''కానీ ఇది వైద్యశాస్త్రం. గణితశాస్త్రం కాదు. కాబట్టి కొంత మార్జిన్ ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందిలో కాస్త తక్కువగా మూడు, నాలుగు రోజులు మాత్రమే ఉండొచ్చు. కొందరిలో ఏడు రోజులు ఉండొచ్చు. వాస్తవమేమిటంటే.. ఒమిక్రాన్ వేరియంట్‌ దానిముందు వేరియంట్ల కన్నా చాలా వేగంగా సోకుతుంది’’ అని చెప్పారు సొరియానో.

అంటే ఈ వేరియంట్ సోకిన వారిలో లక్షణాలు కనిపించిన ఏడు రోజుల తర్వాత.. వారిలో లక్షణాలు సమసిపోయినట్లయితే.. వారి నుంచి ఇతరులకు ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉండదు.

అయితే సదరు వ్యక్తి నుంచి వైరస్ సోకే అవకాశం ఇంకా ఉందా లేదా అనేది తెలుసుకోవటానికి యాంటీజెన్ టెస్టులు – అంటే రాపిడ్ టెస్టులు – చేయించుకోవటం చాలా ముఖ్యమని ప్రొఫెసర్ సొరియానో చెప్తున్నారు.

''ఈ టెస్టులు చాలా చౌక. ఇంకా వైరస్ సోకగలిగే కేసులను ఉత్తమంగా కనిపెడతాయి’’ అన్నారాయన.

ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ సోకే కాలపరిమితి తక్కువగా ఉన్నందువల్ల.. ఈ వైరస్ సోకిన వారు ఐసొలేట్ కావాల్సిన కాలాన్ని పలు దేశాలు తగ్గించాయి.

అమెరికాలో ఐసొలేషన్ కాలాన్ని పది రోజుల నుంచి ఐదు రోజులకు తగ్గించారు. బ్రిటన్‌లో పది రోజుల నుంచి ఏడు రోజులకు తగ్గించారు. అయితే ఐసొలేషన్ నుంచి బయటకు రావటానికి రెండు యాంటీజెన్ టెస్టుల్లో నెగిటివ్ రావాలనే నిబంధన పెట్టారు.

కరోనావైరస్

కోవిడ్ సోకి, లక్షణాలు కనిపించిన తర్వాత జనంలో ఎప్పుడు కలవొచ్చు?

అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సూచనల ప్రకారం.. మీకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయితే మీరు ఈ కింది పనులు చేయాలి.

  • ఇంట్లో ఐదు రోజుల పాటు ఐసొలేట్ కావాలి.
  • ఐదు రోజుల తర్వాత మీకు లక్షణాలు లేకపోయినా, లక్షణాలు తగ్గిపోతున్నా మీరు ఐసొలేషన్ వీడొచ్చు, ఇంటి నుంచి బయటకు వెళ్లొచ్చు.
  • జనంలో ఉన్నపుడు మరో ఐదు రోజుల పాటు మాస్కు ధరించటం కొనసాగించాలి.
  • ఒకవేళ మీకు జ్వరం ఉన్నట్లయితే అది తగ్గే వరకూ ఐసొలేషన్ కొనసాగించాలి.

ఆధారం: CDC

జనం

కోవిడ్ సోకిన వ్యక్తికి ఏ లక్షణాలూ లేకపోతే ఏమవుతుంది?

కోవిడ్ విషయంలో.. అది సోకిన వారిలో వైరస్ శరీరంలో ఉన్నంత కాలం లక్షణాలేవీ లేకపోవటం మనం చూశాం.

ఒమిక్రాన్ విషయంలో కూడా.. లక్షణాలు ఉన్న వారి నుంచి వైరస్ ఎలా సోకుతుందో, లక్షణాలు లేని వారి నుంచి కూడా అలాగే సోకుతుందని ప్రొఫెసర్ సొరియానో వివరించారు.

''పిల్లలకు కోవిడ్ సోకినపుడు సాధారణంగా లక్షణాలు కనిపించవు. వారి మీద అధ్యయనాలు జరిగాయి. వారిలో లక్షణాలు కనిపించకపోయినప్పటికీ.. వారిలో ఉన్న వైరల్ లోడ్.. కోవిడ్ లక్షణాలున్న పెద్దవాళ్లలో ఉన్న స్థాయిలో ఉన్నట్లు తేలింది’’ అని ఆయన చెప్పారు.

కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయి, లక్షణాలేవీ కనిపించని ఒక వ్యక్తి నుంచి.. వైరస్ సోకే అవకాశం పది రోజుల తర్వాత ఉండదని నిపుణులు చెప్తున్నారు.

లక్షణాలు కనిపించని వ్యక్తి నుంచి ఇతరులకు వైరస్ సోకుతుందా?

కోవిడ్ సోకినా లక్షణాలు కనిపించని వారి నుంచి ఇతరులకు ఆ వైరస్ వ్యాపించగలదని అధ్యయనాల్లో వెల్లడైంది.

జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నెట్‌వర్క్ ఓపెన్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. కోవిడ్ సోకిన ప్రతి నలుగురిలో ఒకరికి.. ఈ వైరస్ సోకి లక్షణాలు కనిపించని వారి నుంచి అది సోకే అవకాశం ఉంది.

లక్షణాలు లేని వారి నుంచి వైరస్ వ్యాపించే నిష్పత్తి.. ఒమిక్రాన్ వేరియంట్‌తో మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

వైరస్ సోకినా లక్షణాలు కనిపించని వారు ఐసొలేట్ కాకపోవటం వల్ల, వైరస్ వ్యాప్తిని నిరోధించే పద్ధతులను పాటించకపోవటం వల్ల.. వారి నుంచి ఇది మరింత ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది.

అందుకే.. వైరస్ సోకినా, లక్షణాలు కనిపించని వారు.. తమకు తెలియకుండా ఇతరులకు ఆ వైరస్‌ను వ్యాపించకుండా ఉండటానికి.. మాస్కులు ధరించాలని, ముఖ్యంగా ఇంట్లోనూ మాస్కులు ధరించి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Omicron: How many days does the virus stop transmitting from a person infected with Covid
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X