Babri Masjid: మళ్లీ బాబ్రీ మసీదు నిర్మాణం ప్రారంభం..! కూల్చేసిన రోజే.. !
ఉత్తర్ ప్రదేశ్ లోని పైజాబాద్ జిల్లాలో ఉన్న అయోధ్యలోని బాబ్రీ మసీదును 1992లో కరసేవకులు పలు హిందూ సంస్థల కార్యకర్తలతో కలిసి కూల్చేశారు. అయోధ్యలో రామ జన్మభూమిపై ఈ మసీదు నిర్మించినట్లు ఆరోపిస్తూ అప్పటికే పలు ఉద్యమాలు చేసిన వీరు.. భారీ ఎత్తున తరలివచ్చి కూల్చివేతకు పాల్పడ్డారు. దీనిపై ఇప్పటికీ కోర్టుల్లో విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో అయోధ్య రామజన్మభూమి యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత యూపీలో మరో స్థలంలో నిర్మిస్తున్న మసీదు నిర్మాణం నత్తనడకన సాగుతోంది.
ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ముర్షీదాబాద్ లో బాబ్రీ మసీదు కూల్చేసిన రోజు అంటే డిసెంబర్ 6న (ఇవాళ) మరో బాబ్రీ మసీదు నిర్మిస్తానని టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ గతంలో ప్రకటించారు. దీనిపై ముస్లింలు హర్షం వ్యక్తం చేయగా.. హిందూ సంస్థలు ఆయన సొంత పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ను టార్గెట్ చేశాయి. దీంతో ఆగ్రహించిన సీఎం మమతా బెనర్జీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయినా ఆయన పట్టు వీడలేదు.

చెప్పినట్లుగానే సస్పెండైన టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ఇవాళ ముర్షీదాబాద్ లో బాబ్రీ మసీదు నిర్మాణం ప్రారంభించారు. 40 వేల ముస్లింలు దీనికి తరలివచ్చారు. భారీ భద్రత మధ్య ఈ కార్యక్రమం జరిగింది. దీనికి హాజరైన 40 వేల మందికి బిర్యానీ కూడా తినిపించారు. దాదాపు 3 వేల మంది వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని నడిపించారు. ఖురాన్ లోని వాక్యాలు చదువుతూ బాబ్రీ మసీదు నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఇద్దరు ఖాజీలు (మతగురువులు) ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

#WATCH | Murshidabad, West Bengal: Suspended TMC MLA Humayun Kabir lays the foundation stone of Babri Masjid. pic.twitter.com/rvCnocvTbK
— ANI (@ANI) December 6, 2025
ఈ ప్రాంతంలో బాబ్రీ మసీదుతో పాటు ఓ ఆస్పత్రి, విద్యా సంస్థ, ఇక్కడికి వచ్చే అన్ని మతాల వారి కోసం ఓ గెస్ట్ హౌస్ కూడా నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ప్రకటించారు. తాము చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని ఆయన ఆరోపించారు. అయినా ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చి ఇందులో పాల్గొన్నారన్నారు. రాజ్యాంగం ప్రకారం నచ్చిన ప్రార్ధనాస్ధలాల్ని ఏర్పాటు చేసుకునే అవకాశం తమకు ఉందన్నారు.












Click it and Unblock the Notifications