
జర్నలిస్టులకు లక్షరూపాయల క్యాష్ గిఫ్ట్-దీపావళి కానుకగా ఇచ్చిన ప్రభుత్వం
దేశంలో రాజకీయాల స్వరూపం మారిపోతోంది. దాంతో పాటే వాటిని ప్రజలకు చేర్చే జర్నలిస్టులు, మీడియా సంస్ధల పాత్ర, స్వభావాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అదే సమయంలో వాటిని తమ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకునేందుకుప్రయత్నిస్తున్న రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల వైఖరి కూడా వివాదాస్పదమవుతోంది. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన చోటు చేసుకుంది.
ఏపీకి పొరుగు రాష్ట్రమైన కర్నాటకలో తాజాగా దీపావళి సందర్భంగా అక్కడి జర్నలిస్టులకు ముఖ్యమంత్రి కార్యాలయం లక్ష రూపాయల చొప్పున నగదు బహుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సాధారణంగా పండుగల సందర్భంగా జర్నలిస్టుల్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు వ్యక్తిగతంగా ఇలాంటి బహుమతులు ఇస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయమే ఇలా జర్నలిస్టుకు లక్ష రూపాయల చొప్పున నగదును పంపడం వివాదాస్పదంగా మారింది.

ఇలా కర్నాటక ముఖ్యమంత్రి కార్యాలయం పంపిణీ చేసిందని భావిస్తున్న లక్ష రూపాయల నగదు కొంతమంది జర్నలిస్టులకే చేరడంతో, మిగతా వారు దీనిపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ బయటపడ్డారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) కొందరు జర్నలిస్టులకు దీపావళి గిఫ్ట్ బాక్సుల్లో రూ.లక్ష నగదును 'బహుమతి' ఇచ్చిందన్న ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కంగుతినిపించాయి. దీంతో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై క్షమాపణలు చెప్పారని, జర్నలిస్టులకు కానుకగా ఇచ్చిన నగదు గురించి తనకు తెలియదని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ఆయన విచారణకు ఆదేశించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కర్నాటకలో రాజకీయ వ్యవహారాల్ని కవర్ చేస్తున్న కొన్ని ఎంపిక చేసిన మీడియా సంస్ధల జర్నలిస్టులకు దీపావళి సందర్భంగా అక్టోబర్ 22న స్వీట్లు, డ్రైఫ్రూట్స్ తో కూడిన గిఫ్ట్ బాక్స్ లతో పాటు లక్ష రూపాయల నగదు ఉన్న కవర్ కూడా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కర్నాటక సీఎంఓ విమర్శల పాలైంది.