టీడీపీ విప్ జారీ- రెండేళ్లలోనే ఎన్నికలు: మూడంచెల్లో..!!
One Nation One Election: వన్ నేషన్- వన్ ఎలక్షన్ దిశగా కసరత్తు ముమ్మరమైంది. నేడు మరో ముందడుగు పడబోతోంది. ఈ బిల్లును అధికార ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం లోక్‌సభ సమక్షానికి తీసుకుని రాబోతోంది. ఈ మధ్యాహ్నం 12 గంటలకు దీన్ని సభలో ప్రవేశపెట్టనుంది.
అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలతో పాటు స్థానిక సంస్థలకూ ఒకేసారి మధ్యంతర ఎన్నికలను నిర్వహించడానికి ఉద్దేశించిన బిల్లు ఇది. ఈ ముసాయిదా బిల్లుకు ఇదివరకే కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలిపింది.

వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రివర్గం యధాతథంగా ఆమోదం తెలిపింది. ఇదే ముసాయిదా బిల్లును నేడు సభలో టేబుల్ చేయనుంది. ఈ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన అనంతరం జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
దీనిపై ప్రత్యేకంగా అధికార, ప్రతిపక్ష సభ్యులతో కూడిన ఓ జేపీసీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జమిలి ఎన్నికల బిల్లులో ఏవైనా సవరణలు ఉంటే ఈ కమిటీ ఇచ్చే సూచనలు, సలహాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తుంది.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలులోకి వస్తే 2027 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభకు ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో స్థానిక సంస్థలకూ పోలింగ్ షెడ్యూల్ అవుతుంది. పంచాయతీలు మొదలుకుని మున్సిపల్ కార్పొరేషన్ల వరకూ ఈ ఎన్నికలు జరుగుతాయి.
ఈ ముసాయిదా బిల్లు నేడు లోక్‌సభ సమక్షానికి రాబోతోన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వాన్ని వహిస్తోన్న ఇండియా బ్లాక్ కూటమి సహా అన్ని పార్టీలు కూడా విప్ జారీ చేశాయి. నేటి సభా కార్యకలాపాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుందంటూ తమ ఎంపీలకు సూచించాయి.
అలాగే- తమ కూటమి భాగస్వామ్య పార్టీలు కూడా విప్‌ను జారీ చేయాలంటూ బీజేపీ ఆదేశించింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ, శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) మూడంచెల విప్‌ను ఇచ్చాయి. జమిలి ఎన్నికలతో పాటు గవర్నమెంట్ యూనియన్ టెరిటరీ యాక్ట్ 1963, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 సభ ముందుకు వస్తాయి.












Click it and Unblock the Notifications