
ముఖేష్ అంబానీ ఇంటి అడ్రస్ గురించి ఆరా తీసిన ఆగంతకుల్లో ఒకడి గుర్తింపు: సొంత రాష్ట్రం నుంచే
ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, అపర కుబేరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి వార్తల్లోకెక్కారు. ఇదివరకు ఆయన ఇంటి సమీపంలో కారును పార్క్ చేయడం, అందులో జిలెటిన్ స్టిక్స్ లభించిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. ముఖేష్ అంబానీ నివాసం ఉంటోన్న ఆంటీలియా బంగళా గురించి ఇద్దరు వ్యక్తులు ఆరా తీయడం కలకలం తాజాగా కలకలం రేపింది.
ఈ విషయంపై ఓ క్యాబ్ డ్రైవర్.. ముంబై పోలీసులను అప్రమత్తం చేశాడు. ముఖేష్ అంబానీ ఇంటి అడ్రస్ గురించి తన వద్ద ఆరా తీశారంటూ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. ఆ ఇద్దరు ఉర్దూలో మాట్లాడారని వివరించాడు. ఇద్దరి చేతుల్లోనూ బ్యాగులు ఉన్నాయని, అనుమానాస్పద స్థితిలో కనిపించారని చెప్పాడు. దీనితో ముంబై పోలీసులు ఆంటీలియా వద్ద కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రతను ఇదివరకటి కంటే అధికం చేశారు. ఈ ఘటనపై ఆజాద్ మైదాన్ పోలీసులు దర్యాప్తు చేశారు. ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో- ఆ ఇద్దరిలో ఒకడిని గుర్తించారు. అతణ్ని విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. అతని పేరును ఆజాద్ మైదాన్ పోలీసులు ఇంకా వెల్లడించలేదు. దర్యాప్తు ముగిసిన తరువాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. ఆ గుర్తు తెలియని వ్యక్తి.. గుజరాత్‌కు చెందినవాడని, ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడని పేర్కొన్నారు. ఏ కారణంతో అతను ముంబైకి వచ్చాడు?, అనుమానాస్పద ముఖేష్ అంబానీ ఇంటి గురించి ఎందుకు ఆరా తీశాడు? అనే విషయాలపై అతణ్ని ప్రశ్నించాల్సి ఉందని చెప్పారు.

అతని వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గానీ లేవని నిర్ధారించినట్లు ఆజాద్ మైదాన్ పోలీసులు పేర్కొన్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తోన్నామని చెప్పారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ముంబై కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చామని వివరించారు. ఆ గుర్తు తెలియని వ్యక్తి కోసం కొన్ని చోట్ల తనిఖీలను కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. గుజరాత్‌కు చెందిన ట్యాక్సీ డ్రైవర్‌కు మరో ఆగంతకుడికి సంబంధించిన వివరాలు తెలియదని అంటున్నారు.
Recommended Video
ఈ ఏడాది ఫిబ్రవరిలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ ఎస్‌యూవీ కారు అంటీలియా సమీపంలో పార్క్ చేసి ఉంచిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టడానికి ఏకంగా జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. ఈ కారుతో సంబంధం ఉందనే కారణంతో ఎన్ఐఏ అధికారులు అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజేను అరెస్ట్ చేశారు. దీనిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అంతలోనే- ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తెరమీదికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.