అదను చూసి దెబ్బకొట్టారు..మోడీ-షా దెబ్బకు మూడు పార్టీలు ఫసక్
మహారాష్ట్రలో అర్థరాత్రి మహా డ్రామా చోటుచేసుకుంది. ఇక శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయనుకున్న సమయంలో ఒక్కసారిగా బీజేపీ షాక్ ఇచ్చింది. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం అన్నీ ఒక గంట సమయంలో చకచకా జరిగిపోయాయి. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనక చక్రం తిప్పింది ఎవరు..?

మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టులు
మహారాష్ట్రలో రాజకీయాలు మలుపులు మీద మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి నెలరోజులు గడుస్తున్నప్పటికీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. ఇక ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని శుక్రవారం సాయంత్రం శరద్ పవార్ ప్రకటించారు కూడా. శివసేన నుంచి ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారని కూడా చెప్పారు. ఇక మహా ప్రతిష్టంభనకు తెరపడిందని భావిస్తున్న క్రమంలోనే ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్‌లు ప్రమాణస్వీకారం చేసి ట్విస్టు ఇచ్చారు. అదే సమయంలో శివసేనకు షాక్ ఇచ్చారు.

బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న షా
ఓ వైపు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదు తొలుత చెప్పినప్పటికీ ... ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సుధీర్ ముంగన్‌తివార్ మాత్రం మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ఉంటారని బలంగా బల్ల గుద్ది మరీ చెప్పారు. అప్పడు ఆయన వ్యాఖ్యలను అంతా చాలా తేలిగ్గా తీసిపారేశారు. కానీ ఎంతో కొంత సమాచారం లేనిదే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉండరు. అంతేకాదు అమిత్ షా కూడా మహారాష్ట్రలో బీజేపీ సర్కార్ వస్తుందని కొద్దిరోజుల క్రితం చెప్పారు. అమిత్ షా అనుకుంటే ఏమైనా జరగొచ్చు అనేది అందరూ భావించారు. కానీ ఈ పరిస్థితుల్లో అద సాధ్యం కాదని అనుకున్నారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో అమిత్‌షా ది అందెవేసిన చేయి. ఇప్పుడు కూడా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు షా మాత్రమే చక్రం తిప్పి ఉంటారనేది స్పష్టమవుతోంది.

అజిత్ పవార్ కేసులపై స్పష్టమైన హామీ..?
అప్పటి వరకు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఉండగా కొత్త ప్రభత్వం ఏర్పాటు కావాలంటే ప్రజాస్వామ్యపాలనలోకి రావాలి. ఇక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారంటే అంతకు కొన్ని క్షణాల ముందు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేసి ఉండాలి. మరి ఇది రాష్ట్రపతికి ఎప్పుడు తెలిపారో కూడా తెలియాల్సి ఉంది. ఇక ఎన్సీపీ నేత అజిత్ పవార్‌పై కేసులున్నాయి. ఈ కేసులపై ఏమైనా స్పష్టమైన హామీ బీజేపీ ఇచ్చిందా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. శరద్ పవార్‌ను కాదని లోలోపల అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో మాట్లాడి ఉంటారనేది అర్థమవుతోంది.
Recommended Video

విమర్శలు పట్టించుకోని బీజేపీ
మొత్తానికి అమిత్ షా అనుకున్నది చేస్తారనేది మళ్లీ రుజువైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటు కాంగ్రెస్ శివసేనతో కలిసి బీజేపీకి షాక్ ఇవ్వగా, అర్థరాత్రి బీజేపీ ఎన్సీపీతో కలిసి శివసేన కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చింది. బీజేపీ చేసిన పనిపై విమర్శలు వస్తున్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా మహారాష్ట్రలో సర్కార్ ఏర్పాటుకే ప్రాధాన్యత చూపింది. అర్థరాత్రి హైడ్రామాతో మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త కోణం ఆవిష్కృతమైంది. ఎన్సీపీ శివసేనలోనే చీలికలను తీసుకురావడంలో మోడీ-షా ద్వయం సక్సెస్ అయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications