మరోసారి పార్లమెంటుకు రైతులు: నవంబర్ 29న ట్రాక్టర్లతో మార్చ్, హెచ్చరిక
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుమారు ఏడాది నిరసనలు చేపడుతున్న రైతు సంఘాల నేతలు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిరసనలకు ఏడాది కావస్తున్న సందర్భంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు నవంబర్ 29న పార్లమెంట్ కు ట్రాక్టర్ల కవాతు నిర్వహించాలని నిర్ణయించారు.
సంయుక్త కిసాన్ మోర్చాకు చెందిన తొమ్మిది మంది సభ్యుల కమిటీ మంగళవారం ఈ మేరకు నిర్ణయించింది. నవంబర్ 29న ఘాజీపూర్, టిక్రీ సరిహద్దుల నుంచి సుమారు 500 మంది రైతులు తమ ట్రాక్టర్లలో పార్లమెంటు వైపు బయల్దేరతారని రైతు సంఘం నేతలు తెలిపారు. వారిని మధ్యలో ఎక్కడైనా అడ్డగిస్తే.. అక్కడే నిరసనకు దిగుతారని చెప్పారు.

ఈ ఏడాది జులైలోనూ వర్షాకాల సమావేశాల సమయంలో రైతులు పార్లమెంటు సమీపంలో నిరసన చేపట్టారు. వీరికి వివిధ పార్టీల నేతలు కూడా సంఘీభావం తెలిపారు. నవంబర్ 26 లోగా కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, లేనిపక్షంలో నిరసనలు ఉధృతం చేస్తామని రైతు సంఘాల నేతలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే.
Recommended Video
ఈ క్రమంలోనే నవంబర్ 22న లక్నోలో మహాపంచాయత్ నిర్వహించనున్నట్లు రైతు సంఘం నేతలు ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమం చరిత్రాత్మకం కానుందని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేష్ టికాయత్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వాంచల్ ప్రాంతంలోనూ రైతుల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఏడాదిగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ చట్టాలపై సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. రైతులతో చర్చలకు తాము ఎప్పుడైనా సిద్ధమేనని కేంద్రం చెబుతోంది. అయితే, చట్టాల రద్దు మాత్రం కుదరదని స్పష్టం చేస్తోంది. పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ సరిహద్దులో గత ఏడాది కాలంగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications