వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆన్‌లైన్ మోసాలు: ‘నా దగ్గర నూటికి నూరు శాతం లాభం వచ్చే ప్రాజెక్ట్ ఉంది.. రోజుకు రూ.150 - 800 సంపాదించవచ్చు’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఈమెయిల్, వాట్సాప్‌ల నుంచి వచ్చే మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలి.

విశాఖపట్నానికి చెందిన సుధాకర్‌కు (పేరు మార్చాం) నవంబరు 07న 5.45 నిమిషాలకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజీలో డబ్బులు సంపాదించేందుకు మంచి బిజినెస్‌ ఆఫర్ ఉంది.

అయితే, ఆ మెసేజీ పంపిన వ్యక్తి సుధాకర్ కాంటాక్ట్ లిస్ట్‌లో లేరు. కానీ, ఈ రోజుల్లో ఫోన్ నంబర్స్ అందరికీ సులువుగా అందుబాటులో ఉండటంతో, తెలిసిన వారే ఆ మెసేజీ పంపి ఉంటారని సుధాకర్ అనుకున్నారు. ఆ మెసేజ్‌లో వివరాలిలా ఉన్నాయి.

"హాయ్, ఐ యామ్ ఆనీ , నా దగ్గర నూటికి నూరు శాతం లాభం వచ్చే ప్రాజెక్ట్ ఒకటి ఉంది. షాపింగ్ వెబ్ సైటులో ఆన్‌లైన్ ఆర్డర్‌లను సంపాదించి సేల్స్ పెంచాలి. మీరు టాస్క్ పూర్తి చేసిన ప్రతి సారి మీరు పూర్తి చేసిన టాస్కులకు అనుగుణంగా కమీషన్ చెల్లిస్తాం. రోజుకు రూ.150 - 800 సంపాదించవచ్చు. ఆ డబ్బును 3-5 నిమిషాల్లో తిరిగి పెట్టుబడిగా పెట్టవచ్చు. ఈ ప్రాజెక్టుకు రిజిస్టర్ చేసుకునేందుకు కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ పూర్తి అవ్వగానే మీకు రూ. 50 వస్తాయి. ఆ తర్వాత మీరు నన్ను సంప్రదిస్తే, ప్రాసెస్‌ వివరిస్తాను" అని మెసేజ్‌ సారాంశమని సుధాకర్ బీబీసీకి వివరించారు.

"రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే, రూ.1000 పెట్టుబడి పెడితే 30 శాతం లాభం అసలుతో కలిపి ఇస్తాం"" అని చెప్పారన్నారు.

సురేంద్ర ఇదంతా నమ్మకమైన వ్యాపారమే అని భావించి ముందు రూ.1000 వాట్సాప్ చాట్‌లో ఉన్న వ్యక్తి చెప్పిన అకౌంట్ కు ఫోన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిపారు.

"వెబ్‌సైటులో లాగిన్ అవ్వగానే, అదొక షాపింగ్ వెబ్‌సైటును తలపించింది. అందులో చిన్న పిల్లల బొమ్మలు, చాకోలెట్స్, గిఫ్ట్స్ ఉన్నాయి. అయితే, ఆ బ్రాండులను నేనెప్పుడూ ఇండియాలో చూడలేదు" అని సుధాకర్ అన్నారు.

"మనం కట్టిన రూ.1000కు కొన్ని ఉత్పత్తులను ఇస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తూ వెళుతుంటే టాస్క్ పూర్తయింది అంటూ మెసేజ్ వస్తుంది. అలా మొదటిసారి 20 టాస్క్‌లు పూర్తి కాగానే, మన అకౌంట్‌లోకి కొన్ని నిమిషాల్లోనే కట్టిన డబ్బులు, వడ్డీతో సహా క్రెడిట్ అయ్యాయి" అని చెప్పారు.

ఈ చెల్లింపులన్నీ మొబైల్ పేమెంట్ల ద్వారానే జరిగాయి. "దీంతో, ఆ వ్యక్తుల పై నమ్మకం ఏర్పడింది. ఇది నిజమైన వ్యాపార ప్రతిపాదనే అని అనుకున్నాను". వెంటనే వాట్సాప్‌లో మరో సందేశం వచ్చింది. మీరు మరో రూ.3000 పెట్టుబడి పెడితే, కొన్ని నిమిషాల్లోనే మరిన్ని డబ్బులు సంపాదించవచ్చు" అని చెబుతారు. ఇక్కడే అసలు కిటుకు ఉంది.

రూ.1000 - రూ.40,000 వరకు డిమాండ్

"ఈ క్షణంలో ఆగిపోతే మోసానికి గురయ్యే అవకాశం ఉండదు. కానీ, డబ్బుకు ఆశపడి మరో సారి పెట్టుబడి పెడదామని భావిస్తే, అసలు కూడా వెనక్కి తిరిగి రాదు" అని సురేంద్ర చెప్పారు. సురేంద్ర మరో రూ.3000 పెట్టుబడి పెట్టి లాభం సంపాదించాలని అనుకున్నారు.

రూ. 3000 అకౌంట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేయగానే, మళ్లీ టాస్క్స్ ఇస్తారు. కానీ, ఈ సారి టాస్కులు సునాయాసంగా సాగవు. 10 టాస్కులు పూర్తయ్యేసరికి, అకౌంట్ లోకి మరిన్ని ఉత్పత్తులు డంప్ చేసి, మరో రూ. 12,000 కడితేనే మిగిలిన టాస్క్‌లు పూర్తి చేయడం అవుతుందని చెబుతారు.

మొదట కట్టిన రూ.3000 ను ఆ టాస్కులు పూర్తయితేనే కానీ వెనక్కి ఇవ్వమని చెబుతారు. రూ. 3000 పోతాయేమోననే భయంతో మరో 12,000 ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు సుధాకర్ చెప్పారు. ఈ సారి 19వ టాస్క్ వచ్చేసరికి మరో 40,000 డిపాజిట్ చేయమంటూ మెసేజ్ వచ్చింది. ఇదంతా వెబ్ సైటు లోనే జరుగుతుందని వివరించారు.

ఈ టాస్క్స్ చేస్తున్నంత సేపూ వాట్సాప్ లో పింగ్ చేసిన వ్యక్తి మనతో మాట్లాడుతూనే ఉంటారు. మీ డబ్బులు వెనక్కి వస్తాయనే భరోసా కల్పిస్తారు. పెట్టుబడి పెట్టమని ప్రోత్సహిస్తూ ఉంటారు. మనతో ఒకరు చాట్ చేస్తూ ఉండటంతో, డబ్బులు పోవనే నమ్మకంతో పెట్టుబడి పెడుతూ వెళతాం.

అయితే, ఈ ఆన్‌లైన వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు సురేంద్ర ఆ వ్యక్తికి కాల్ చేయాలని అనుకోలేదు. చాట్ చేస్తున్నారనే నమ్మకం, మొదటి సారి పెట్టిన డబ్బులు వెనక్కి రావడంతో ఆయనకు అనుమానం రాలేదు.

ఈ సారి రూ. 40,000 ట్రాన్స్‌ఫర్‌ చేయమని మెసేజీ వచ్చింది. అంత డబ్బు నా దగ్గర లేకపోవడంతో, ఆ విషయం చెప్పేందుకు వాట్సాప్‌లో చాట్ చేస్తున్న నంబర్‌కు కాల్ చేశాను. ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ నంబర్ మనుగడలో లేదనే సందేశం వచ్చింది.

ఫోన్ తీస్తారేమోనని రెండు రోజుల పాటు ప్రయత్నించిన తర్వాత, నేను మోసపోయానని అర్ధమయింది. వెంటనే విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాను. కానీ, అప్పటికే వాళ్లు అకౌంట్ల నుంచి డబ్బును విత్‌డ్రా చేశారు అని తెలిసింది" అని తాను మోసపోయిన విధానాన్ని సుధాకర్ బీబీసీకి వివరించారు.

వాట్సాప్ వెబ్‌ యాప్‌లలో తరచూ డిస్కనెక్షన్ సమస్యలు వస్తున్నాయి.

ఇలాంటి మోసాలు చేసేవారిని పోలీసులు కనిపెట్టగలరా?

ఇటువంటి మోసాలను వాట్సాప్ నంబర్ ట్రేస్ చేయడం ద్వారా కనిపెట్టవచ్చని పేరు వెల్లడి చేయడానికి ఇష్టపడని ఒక పోలీసు అధికారి వివరించారు. ఆయన గతంలో సీఐడీ సైబర్ క్రైమ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పని చేశారు.

ఇలాంటి కేసుల్లో సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌కు ఒక నోటీసు ఇచ్చి వివరాలను సేకరించవచ్చని చెప్పారు. అయితే, బాధితులు పోగొట్టుకున్న సొమ్ము రూ.50,000 ఉంటే దానిని కనిపెట్టేందుకు పోలీసులకయ్యే ఖర్చు సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని చెప్పారు.

"దీనికి తోడు, నేరాలు చోటు చేసుకుంటున్న స్థాయిలో సిబ్బంది ఉండరు. దాంతో, తక్కువ మొత్తం ఉన్న కేసుల పై దృష్టి సారించి విచారణ చేసేందుకు జాప్యం జరగడం లేదా అలసత్వం చోటు చేసుకోవడమో జరుగుతుంది" అని వివరించారు.

"ఈ వెబ్ సైట్లు నిర్వహిస్తున్న వారు ప్రధానంగా నేరం చోటు చేసుకున్న ఊర్లోనో, రాష్ట్రంలోనో ఉండరు. పక్క రాష్ట్రాలు, లేదా కొన్నిసార్లు విదేశాల నుంచి కూడా తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. వారిని ట్రేస్ చేసిన తర్వాత చివరకు వారు ఎవరో నియమించిన సిబ్బంది అని తేలుతుంది. అసలు నేరస్తులను కనిపెట్టి పట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది" అని చెప్పారు.

సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యమని సూచించారు. ఆన్‌లైన్‌లో అపరిచితులు డబ్బు అడిగినప్పుడు ట్రాన్స్‌ఫర్‌ చేయకుండా ఉంటే మోసానికి గురికాకుండా ఉండవచ్చని చెప్పారు.

అపరిచితులకు ఓటీపీలు, యూపీఐ అడ్రస్‌లు ఇవ్వడం మంచిది కాదు.

పెరుగుతున్న సైబర్ మోసాలు

ఇటీవల హైదరాబాద్‌లో ''మీ కంపెనీ నుంచి డబ్బును దొంగిలించింది నేనే, నాకు సహకరించిన వారిని విడుదల చేస్తే మీ డబ్బును వాపసు చేస్తా" అంటూ హైదరాబాద్ కు చెందిన ఒక సంస్థకు ఒక సైబర్ నేరస్తుడు మెయిల్ పంపారు. భువనేశ్వర్ కేంద్రంగా ఈ నేరం జరిగినట్లు పోలీసులు తెలిపినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.

ఇలాంటి రక రకాల పర్సనల్, బిజినెస్, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, వ్యాపార అవకాశాలు కల్పిస్తామని చెబుతూ జరిగే ఫ్రాడ్‌లు వార్తల్లో కనిపిస్తూనే ఉంది.

కోవిడ్ లాక్‌డౌన్ తర్వాత టెక్నాలజీ వాడకం పెరిగింది. నిత్యావసర వస్తువుల నుంచి ఇళ్ల కొనుగోలు వరకూ అన్నీ ఆన్ లైన్ ట్రాన్సాక్షన్‌లు జరుగుతున్నాయి. మొబైల్ యాప్స్ వాడకం పెరిగింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అందించిన డేటా ప్రకారం భారతదేశంలో 2020లో 50,035 సైబర్ నేరాలు నమోదయ్యాయి. ఇది 2019 కంటే, 12 శాతం ఎక్కువ.

టెక్నాలజీ వాడకంతో పాటు మోసాల సంఖ్య కూడా పెరిగిందని ఆంధ్ర యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ వి. వల్లీ కుమారి చెప్పారు.

ప్రొఫెసర్ వల్లీ కుమారి వివిధ రకాల ఆన్‌లైన్‌ ఫైనాన్షియల్ మోసాల గురించి బీబీసీకి వివరించారు.

వాట్సాప్‌ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లను చూసిన వెంటనే నమ్మకూడదు.

ఈ సైబర్ మోసాలెలా ఉంటాయి?

  • సోషల్ మీడియా, ఎస్‌ఎంఎస్ ఫ్రాడ్

సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మెసేజీలు లేదా లింక్ పంపించి ఆ లింక్ క్లిక్ చేయమని అడుగుతారు. లింక్ పై క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ చేయమని అడుగుతుంది. కొన్నిసార్లు లింక్ క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయమని అడిగి దాని ద్వారా అకౌంట్‌లో డబ్బులను దొంగిలిస్తారని చెప్పారు.

మొబైల్ ఎస్ఎంఎస్‌ల ద్వారా అపరిచితుల నుంచి వచ్చే లింక్‌లను క్లిక్ చేయకూడదని ప్రొఫెసర్ వల్లీ కుమారి సూచించారు. సాధారణంగా ప్రముఖుల అకౌంట్లను టార్గెట్ చేసి ఇలాంటి పనులకు పాల్పడుతూ ఉంటారని ఆమె చెప్పారు.

ఇటువంటి ఉదాహరణను బీబీసీతో మాట్లాడిన పోలీస్ అధికారి వివరించారు.

ఒకామెకు ఒక సంస్థలో ప్రాజెక్ట్ లీడ్‌గా ఉద్యోగం వచ్చిందని చెబుతూ, అందు కోసం నౌకరీ.కామ్ వెబ్ సైటు ద్వారా రిజిస్టర్ చేసుకుని వివరాలను పొందుపరచాలని కోరారు. అయితే, ఈ వెబ్‌సైటులో లాగ్ ఇన్ అయినప్పుడు https తో ఉండటంతో ఆ వెబ్ సైట్ నమ్మశక్యమైందేనని ఆమె అనుకున్నారు. కానీ, అందులోంచి వేరే లింక్ క్లిక్ చేసినప్పుడు వెళ్లిన వెబ్ సైటు https లేకపోవడంతో, అక్కడ ఆమెను ఓటీపీ అడగడం, ఎంటర్ చేయడంతో అకౌంట్లో డబ్బులన్నీ పోగొట్టుకున్నారు.

"ఇలాంటి వెబ్ సైట్లు చూసినప్పుడు URLలో వెబ్‌సైట్‌ పేరు, URL బాక్స్‌లో లాక్ సింబల్ తో పాటు https అని ఉంటే ఆ వెబ్‌సైట్‌ వెరిఫై అయిందని అర్ధం" అని ప్రొఫెసర్ వల్లీ కుమార్ వివరించారు.

  • ఈ-మెయిల్ ఫ్రాడ్/వాయిస్ కాల్

ఈ మెయిల్ ద్వారా, వాయిస్ కాల్స్ ద్వారా రక రకాల మోసాలు చోటు చేసుకుంటాయి. ఈ తరహాలో తెలిసిన వారి పేరుతో ఉన్నట్లుగానే డబ్బులు కావాలని అభ్యర్థిస్తూ మెయిల్ పంపిస్తారు. అందులో అర్జెంట్ గా డబ్బు అవసరముంది అని చెబుతూ అకౌంట్ కు డబ్బులు బదిలీ చేయమని అడుగుతారు. నేరుగా అడిగేందుకు మొహమాట పడి ఈ-మెయిల్ పంపారేమో అనుకుని చాలా మంది డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఇందులో వారి పరిచితుల పేర్లతోనే ఈ మెయిల్ పంపిస్తూ ఉంటారు.

కానీ, ఆ ఈ మెయిల్ ను జాగ్రత్తగా గమనిస్తే ఒక అక్షరం, లేదా ఒక సింబల్ తేడా ఉంటుంది.

ఈ-మెయిల్ ద్వారా డబ్బు పంపమని ఎవరు అడిగినా సదరు వ్యక్తులను అడిగి తెలుసుకోవడం ముఖ్యమని వల్లీ కుమారి సూచించారు.

వాయిస్ కాల్ ద్వారా పెన్షన్ ప్లాన్, ఇన్సూరెన్సు, లాటరీలు, లేదా రిసార్ట్ లో ఫ్రీస్టే వచ్చిందని చెబుతూ పరిచయం లేని వారు కాల్ చేస్తారు. మీకొక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ పంపించండి అని అడుగుతారు. నిజంగానే డబ్బులు వచ్చాయేమో అనుకుని ఆ ఓటీపీ పంపగానే వాళ్ళ అకౌంట్లలో డబ్బును తీసేస్తారు. ఆ వెంటనే మొబైల్ సిమ్ ను కూడా మార్చేస్తారని వల్లీ చెప్పారు.

సాధారణంగా రిటైర్డ్ ఉద్యోగులు లేదా గృహిణులును ఈ మోసాలకు లక్ష్యంగా చేసుకుంటారని ఆమె చెప్పారు.

  • కార్డు/ వెబ్ సైట్ ఫ్రాడ్

కార్డు స్వైప్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి కార్డు క్లోన్ అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు కూడా మోసానికి గురయ్యే అవకాశం ఉంది. క్లోన్డ్ వెబ్‌సైట్స్ లేదా ఫేక్ వెబ్ సైట్ల ద్వారా కూడా అనేక మోసాలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు రివ్యూలు చూసుకోవాలి.

సుధాకర్ కు జరిగిన మోసంలో వెబ్ సైటును వెరిఫై చేయకుండా, వాట్సాప్ చాట్‌లో ఉన్నదెవరో తెలుసుకోకుండా పెట్టుబడి పెట్టడమే మోసపోవడానికి కారణమయిందని పోలీసు అధికారి అన్నారు.

వెబ్‌సైటులో ఉన్న ఉత్పత్తుల ఫొటోలు అనుమానాస్పదంగా ఉన్నా, ఉత్పత్తుల ధరలు మార్కెట్ ధరల కంటే అతి తక్కువగా ఉన్నా అది రెడ్ ఫ్లాగ్‌లా చూడాలని అని చెప్పారు. ధర తక్కువగా ఎందుకుందో ఒక సారి అలోచించి ఆ వెబ్‌సైటులో ఉన్న రివ్యూలను పరిశీలించాలని వల్లీ కుమారి చెప్పారు.

మోసాల నుంచి తప్పించుకోవడమెలా?

ఏ పరిష్కారమూ పూల్ ప్రూఫ్ అని చెప్పలేమని అంటూ, మాల్ వేర్స్ నుంచి తప్పించుకోవడానికి మొబైల్స్, ల్యాప్‌టాప్స్‌లో యాంటీ వైరస్ సా‌ఫ్ట్‌వేర్‌ ఉండటం మంచిదని వల్లీ కుమారి చెప్పారు.

ఆన్‌లైన్ మోసాల నుంచి తప్పించుకోవాలంటే ఓటీపీలు షేర్ చేయకుండా ఉండటం, అపరిచితులు పంపిన క్యూఆర్ కోడ్‌లు స్కాన్ చేయకుండా ఉండటం, యుపీఐ షేర్ చేయకుండా ఉండటం లాంటివి చేయాలని పోలీస్ అధికారి సూచించారు.

అత్యాశ కూడా మోసాలకు దారి తీస్తుందని, అకస్మాత్తుగా వచ్చే డబ్బు కోసం ఆశ పడకుండా ఉండటం ముఖ్యమని అన్నారు.

ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (14సి)లో భాగంగా జనవరి 2020లో నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. సైబర్ సెక్యూరిటీకి ముప్పుగా అనిపించిన 266 మొబైల్ అప్లికేషన్స్‌ను బ్లాక్ చేసినట్లు సోమవారం జరిగిన సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. సైబర్ నేరాలను నియంత్రించేందుకు పోలీసులకు, న్యాయవాదులకు శిక్షణ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Online scams: ‘I have a project that is 100% profitable for a fortune, can earn Rs.150 - 800 per day’
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X