యూపీలో బీజేపీకి ఎదురుగాలి.. అందుకే ప్రధాని మోదీ ర్యాలీ రద్దు : జయంత్ చౌదరి సెటైర్లు
ఉత్తరప్రదేశ్‌లో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుంది. అటు యోగి సర్కార్‌పై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సమాజ్ వాదీ పార్టీ కూటమి వ్యూహాలతో ముందుకువెళ్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ సత్తా చాటేందుకు ప్రియాంక గాంధీ అంతా తానై చెమటోడుస్తోంది. దళితులు, అణగారిన వర్గాల ఓటు బ్యాంకుతో ప్రధాన పార్టీలకు దీటైన జవాబు ఇచ్చేందుకు మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కసరత్తు చేస్తోంది.

బిజనౌర్‌లో మోదీ పర్యటన రద్దు.. జయంత్ చౌదరి సెటైర్లు
యూపీలోని బిజనౌర్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో చివరిలో మోదీ పాల్గొనాల్సిన ర్యాలీ రద్దైంది. దీంతో ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ ప్రజలతో వర్చువల్ ద్వారా మాట్లాడారు. ఆ ర్యాలీకి యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ హాజరయ్యారు. కాగా, ప్రధాని మోదీ ర్యాలీ రద్దు చేసుకోవడంపై ఆర్‌ఎల్‌డీ నేత జయంత్ చౌదరి సెటైర్లు విసిరారు. బిజనౌర్ వాతావరణమా బాగోలేదా..? లేక బీజేపీ వాతావరణమా అని ఎద్దేవా చేశారు..

కమలం వాతావరణమే చెడిపోయింది..
ప్రధాని నరేంద్ర మోదీ యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారంటూ వచ్చిన వార్తలను, బిజనౌర్ వాతావరణ పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని జయంత్ చౌదరి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. బిజనౌర్‌లో వాతావరణ పరిస్థితులు బాగున్నాయన్నారు. బిజనౌర్‌లో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.. కానీ కమలం వాతావరణమే చెడిపోయినట్లుందంటూ చురకులు అటించారు. బిజనౌర్‌లో బీజేపీ ర్యాలీకి పట్టుమని 1000 మంది కార్యకర్తలు కూడా పాల్గొనలేదని జయంత్ చౌదరి ట్విట్ చేశారు.

బీజేపీ వర్సెస్ అఖిలేష్
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీతో ఆర్‌ఎల్‌డీ పొత్తు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో అఖిలేష్, జయంత్ చౌదరి కూటమి వర్సెస్ బీజేపీ అన్న విధంగా పోటీ జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూపీ ఎన్నికలు ఈనెల 10 నుంచి మార్చి 7 వరకు మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు విడుదల కానున్నాయి...












Click it and Unblock the Notifications