అర్ధరాత్రి వరకూ పార్లమెంట్ ఆవరణలోనే- నినాదాల హోరు
న్యూఢిల్లీ: మణిపూర్‌లో చెలరేగిన హింస చల్లారట్లేదు. రెండున్నర నెలలుగా ఈ ప్రశాంత రాష్ట్రం మండిపోతూనే వస్తోంది. మేటీ, కుకీ సామాజిక వర్గాల మధ్య మొదలైన రిజర్వేషన్ అంశం రోజురోజుకూ తీవ్రరూపాన్ని దాల్చుతూనే ఉంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపినప్పటికీ.. ఏ మాత్రం ఫలితం ఉండట్లేదు.
మే 3వ తేదీన మణిపూర్‌లో మేటీ, కుకీ సామాజిక వర్గాల మధ్య హింస చెలరేగింది. అప్పటి నుంచి 150 మందికి పైగా మరణించారు. అనేకమంది గాయపడ్డారు. ఇప్పటివరకూ ఈ హింసాత్మక పరిస్థితులకు అడ్డుకట్ట పడట్లేదు. దాడులు, ప్రతిదాడులతో తగలబడుతూనే ఉంది మణిపూర్. రాజకీయ జోక్యం కూడా పని చేయట్లేదు.

ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి.. ఊరేగించడం, అందరూ చూస్తుండగానే వారిపై అత్యాచారానికి పాల్పడిన అమానవీయ సంఘటనల వీడియోలు వెలుగులోకి రావడం- అక్కడి హింసాత్మక పరిస్థితులకు ఆజ్యం పోసినట్టయింది. ఈ ఘటన- అటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ ప్రస్తావనకు వచ్చింది. ఉభయసభల్లో ప్రకంపనలు పుట్టించింది.
దీనిపై రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్ సింగ్ గళమెత్తారు. మణిపూర్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై చర్చించాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. దీనితో ఆయన వెల్‌లోకి దూసుకెళ్లారు. ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ ఆదేశించినా.. వెనక్కి వెళ్లలేదు.

ఫలితంగా సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. సంజయ్ సింగ్‌ను వర్షాకాల సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ చేశారు. దీనికి నిరసనగా ప్రతిపక్ష పార్టీల సభ్యులు నిరసన దీక్షలకు దిగారు. పార్లమెంట్ ఆవరణలో బైఠాయించారు. ఇండియా ఫర్ మణిపూర్ అనే ప్లకార్డులను ప్రదర్శించారు. సంజయ్ సింగ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తేయాలంటూ నినదించారు.
మణిపూర్ హింసపై పార్లమెంట్‌లో చర్చించడం, సంజయ్ సింగ్ సస్పెన్షన్‌ను ఎత్తేసేంత వరకూ నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తామంటూ తేల్చి చెప్పారు. దీనికి అనుగుణంగా వారు అర్ధరాత్రి దాటేంత వరకూ పార్లమెంట్ ఆవరణలోనే కూర్చున్నారు. కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications