చొరబాటుపై పార్లమెంట్లో విపక్షాల రచ్చ-కేంద్రం ప్రకటనకు డిమాండ్-నిందితులపై ఉపా కేసు..
పార్లమెంటులో నిన్న చోటు చేసుకున్న చొరబాటు ఘటనపై ఇవాళ ఉభయసభల్లోనూ విపక్షాలు నిరసనకు దిగాయి. ప్రభుత్వం వైఫల్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపించాయి. పార్లమెంటు భవనంలోకి అగంతకులు చొరబడిన వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ఉభయసభలు ప్రారంభం కాగానే వాయిదా పడ్డాయి.
నిన్న పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనకు సంబంధించి అరెస్టు చేసిన నలుగురిపై ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం (యూఏపీఏ), ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. వారిని ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఘటనలపై లోక్ సభ స్పీకర్ ఆదేశాల మేరకు హోంశాఖ దర్యాప్తు చేపట్టింది. అటు పార్లమెంట్‌లో నిన్న జరిగిన భారీ భద్రతా లోపంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. వారి నుంచి వివరాలు తీసుకుని తదుపరి చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ఢిల్లీ పోలీసుల ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో నిందితులందరూ భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ అనే సోషల్ మీడియా గ్రూప్‌తో సంబంధం కలిగి ఉన్నట్లు తేలింది. నిందితులు ఏడాదిన్నర క్రితం మైసూర్‌లో సమావేశమై ప్లాన్ అమలుపై చర్చించారు. దాదాపు తొమ్మిది నెలల క్రితం చండీగఢ్ విమానాశ్రయం సమీపంలో రైతుల నిరసనలో మరో సారి భేటీ అయ్యారని తేలింది. దీంతో నిందితులంతా పక్కా ప్లాన్ తోనే ఈ చొరబాటుకు పాల్పడినట్లు అర్ధమవుతోంది.
నిరుద్యోగం, రైతుల సమస్యలు, మణిపూర్ హింస వంటి సమస్యలతో తాము కలత చెందామని ఐదుగురు నిందితులు పోలీసులకు విచారణలో వెల్లడించారు. ఈ సమస్యలపై చట్టసభ సభ్యులు చర్చలు జరపడానికి ఎంపీల దృష్టిని ఆకర్షించడానికి రంగు పొగను ఉపయోగించారని వారు చెప్తున్నారు. వారంతా ఒకే భావజాలం కలిగి ఉన్నారని, అందువల్ల ప్రభుత్వానికి ఒక సందేశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని పోలీసులు తెలిపారు. అయితే ఈ చొరబాటుకు వీరు పాల్పడేలా ఎవరైనా వీరికి ఆదేశాలు ఇచ్చారా లేదా అన్న అంశంపై దర్యాప్తు సాగుతోంది.












Click it and Unblock the Notifications