వాళ్ల కోసం పోతే వీళ్లు దొరికారు- ఇన్నేళ్లుగా ఇంతమంది అక్రమంగా నివస్తోన్నారా?
అట్టారీ సరిహద్దు చెక్‌పోస్ట్ మూత పడింది. నిర్మానుష్యంగా మారింది. రాత్రి 9 గంటల సమయంలో ఈ చెక్‌పోస్ట్‌ను సరిహద్దు భద్రత బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. దీన్ని మూసివేశాయి. పాకిస్తాన్‌తో అధికారికంగా రాకపోకలు సాగించడానికి ఇన్ని సంవత్సరాలు అందుబాటులో ఉంటూ వస్తోన్న ఈ చెక్‌పోస్ట్.. ఇక ఇప్పట్లో తెరచుకోవడం అసాధ్యం.
చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లతో భారత్‌కు వచ్చిన, ఇక్కడ నివసిస్తోన్న పాకిస్తానీయులు కూడా తమ స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. మే 1 తేదీ లోపలే వాళ్లంతా కూడా భారత్‌ను వదిలి పాకిస్తాన్‌కు వెళ్లి పోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించే అవకాశాలు ఉండకపోవచ్చు.

అత్యవసర వైద్య చికిత్స, వ్యాపార కార్యకలాపాలు, ఇక్కడ నివసిస్తోన్న తమ బంధువులను కలుసుకోవడం, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి కారణాలతో తరచూ పలువురు పాకిస్తానీయులు విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖలు జారీ చేసే అధికారిక డాక్యుమెంట్లతో భారత్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రాకపోకల కోసం వారికి అందుబాటులో ఉన్న ఒకే ఒక్కటి ఈ అట్టారీ బోర్డర్ చెక్‌పోస్ట్.
ఈ పరిస్థితుల మధ్య గుజరాత్‌లో అక్రమంగా నివసిస్తోన్న పాకిస్తానీయుల కోసం అక్కడి పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా 550 మంది బంగ్లాదేశీయులు వెలుగులోకి వచ్చారు. వాళ్లంతా కూడా నకిలీ/ఫోర్జరీ డాక్యుమెంట్లతో కొన్ని సంవత్సరాలుగా గుజరాత్‌లో నివసిస్తోన్నట్లు పోలీసులు గుర్తించారు. వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.
ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల్లో ఎక్కువ మంది అహ్మదాబాద్, సూరత్‌లల్లో నివసిస్తోన్నట్లు పోలీసులు తెలిపారు. డాక్యుమెంట్ల ధృవీకరణ, విచారణ పూర్తయిన తర్వాత వారిని దేశం నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.
అక్రమంగా నివసిస్తోన్న పాకిస్తానీయుల కోసం గుర్తించడానికి స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, క్రైమ్ బ్రాంచ్, యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు, సోదాలను నిర్వహించాయి. పోలీసుల అదుపులో ఉన్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై ఆయా చట్టాల కింద కేసులు నమోదుచేస్తామని వివరించారు.
అదుపులోకి తీసుకున్న వ్యక్తులందరి వద్ద భారత్‌లో నివసించడానికి చెల్లుబాటు అయ్యే ఎలాంటి డాక్యుమెంట్లు లేవని, చిరునామాను సృష్టించుకోవడానికి నకిలీ పత్రాలను ఉపయోగించినట్లు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజ్‌దీప్ సింగ్ నకుమ్ అన్నారు.












Click it and Unblock the Notifications