వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాలిబాన్లకు బహిరంగంగా మద్దతు ఇచ్చిన పాకిస్తాన్, చైనా, రష్యా దేశాలు ఆ ప్రభుత్వాన్ని ఎందుకు గుర్తించట్లేదు? 7 కీలక ప్రశ్నలు, వాటికి సమాధానాలు..

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

''వారు అన్ని వర్గాలతో కలిసి ఉండకపోతే, ఈరోజు కాకపోతే రేపు అక్కడ అంతర్యుద్ధం తలెత్తుతుంది. అంటే దీనర్థం ఒక అస్థిరమైన, అస్తవ్యస్తమైన వ్యవస్థగా అఫ్గానిస్తాన్ మారుతుంది.''- పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.

''అంతర్జాతీయ సమాజం, ప్రజల అంచనాలకు అనుగుణంగా... అఫ్గానిస్తాన్ ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుంటుందని చైనా నమ్ముతోంది. అందరినీ కలుపుకుని వెళ్లే ఒక రాజనీతి వ్యవస్థను అఫ్గాన్‌లో తయారుచేస్తాం'' - చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ.

''అన్నింటికంటే చాలా ముఖ్యమైన విషయమేంటంటే, వారు ప్రకటించిన వాగ్దానాలు, హామీలను నేరవేర్చేలా చూడటం. ఇదే మాకు తొలి ప్రాధాన్యత అంశం'' - రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోఫ్.

అఫ్గాన్-తాలిబాన్ల శాంతి చర్చలు, దేశంలో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటు, తాలిబాన్లకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించిన మూడు దేశాలే తాజాగా ఈ వ్యాఖ్యలు చేశాయి.

ఈ మూడు దేశాలు తాలిబాన్లకు బహిరంగంగానే మద్దతు పలుకుతూ, కొత్త తాలిబాన్ పాలనకు భరోసా ఇస్తున్నాయి. కానీ ఇవి ఇప్పటివరకు తాలిబాన్ల ప్రభుత్వానికి అధికారికంగా గుర్తింపునివ్వలేదు.

తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించాలంటే అంతర్జాతీయ సమాజపు పోకడలు, టెర్రిరిస్టు సంస్థలతో సంబంధాలకు దూరం కావడం, ప్రభుత్వ పాలనలో నిజాయితీ వంటి అంశాలు అఫ్గానిస్తాన్‌లో భాగం కావాలని పాకిస్తాన్, చైనా, రష్యా ఆశిస్తున్నాయి.

ఏఏ దేశాలు ఏం ఆశిస్తున్నాయి?

ఈ మూడు దేశాలు కూడా అప్గానిస్తాన్ నుంచి సొంత ప్రయోజనాన్ని ఆశిస్తున్నాయి. భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు అఫ్గాన్‌ను ఒక అవకాశంగా పాకిస్తాన్ భావిస్తోంది. అఫ్గాన్ గత ప్రభుత్వాలు భారత్‌తో కాస్త సత్సంబంధాలను కలిగి ఉన్నాయి. కానీ ప్రస్తుత తాలిబాన్ సర్కారు, పాకిస్తాన్‌తో మంచి స్నేహాన్ని కొనసాగిస్తోంది.

అఫ్గానిస్తాన్‌లో అమెరికా ఆధిపత్యం చైనా, రష్యాలకు రుచించలేదు. ఈ రెండు దేశాలు కూడా అఫ్గాన్ నుంచి అమెరికా వెళ్లిపోతే, దాని స్థానంలో ఆధిపత్యం చెలాయించాలని కోరుకున్నాయి. చైనా ఏకంగా అఫ్గాన్‌లోని వనరులపై దృష్టి సారించింది.

అదే సమయంలో మధ్య ఆసియా దేశాల్లో ఎలాంటి ఇస్లామిక్ మతోన్మాదం ఉండకూడదని, అక్కడ అమెరికా ఆధిపత్యం తగ్గిపోవాలని రష్యా కోరుకుంది. దీనివల్ల రష్యాకు కొత్త అవకాశాలు లభిస్తాయి.

అయినప్పటికీ, ఈ మూడు దేశాలు తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి ఎందుకు విముఖంగా ఉన్నాయి? తాలిబాన్లతో వారి సంబంధాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటున్నాయి?

అఫ్గానిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్ నియమితులయ్యారు

గుర్తింపు విషయంలో వేచిచూసే ధోరణే ఎందుకు?

అఫ్గానిస్తాన్ ప్రభుత్వానికి గుర్తింపునిచ్చే రిస్క్ చేయడానికి చైనా, పాకిస్తాన్, రష్యా దేశాలు సిద్ధంగా లేవు అని నిపుణులు చెబుతున్నారు.

''ఒకవేళ ఈ మూడు దేశాలు, అఫ్గాన్ ప్రభుత్వానికి గుర్తింపునిస్తే ఇక వాటికి చేయడానికి ఏం ఉండదు'' అని లండన్ కింగ్స్ కాలేజీకి చెందిన విదేశీ వ్యవహారాల విభాగాధిపతి, ప్రొఫెసర్ హర్ష్ వి పంత్ అన్నారు.

''ఒకసారి దానికి గుర్తింపునిస్తే, మళ్లీ వెనక్కి తీసుకోలేరు. ఆ తర్వాత ఈ నిర్ణయానికే కట్టుబడాల్సి ఉంటుంది. అందుకే ఈ విషయంలో వేచిచూసే ధోరణి కనబరచడమే ఈ దేశాలకు మంచిది. ఇలా చేయడం వల్ల అవి అంతర్జాతీయ సమాజానికి వ్యతిరేకంగా కూడా ఏం వెళ్లడం లేదు'' అని ఆయన అన్నారు.

అదే సమయంలో తాలిబాన్ నాయకత్వ మతోన్మాదం కూడా ఈ దేశాలను ఇబ్బందిగా మారుతుంది. తాజా పాలన, 1996 కంటే భిన్నంగా ఉంటుందని తాలిబాన్లు చెప్పుకొస్తున్నప్పటికీ, వాస్తవంగా అది జరుగుతున్నట్లుగా లేదు.

అఫ్గాన్ బాలికలు

తాలిబాన్ ప్రభుత్వం వచ్చాక ఆఫ్గాన్‌లో ఏం జరుగుతోంది?

తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు గడిచాయి. కానీ అక్కడ సానుకూల పరిస్థితులేవీ కనబడటం లేదు.

దేశంలో మహిళల హక్కులు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాయి. బాలబాలికలు కలిసి చదువుకోవడాన్ని నిషేధించారు. గడ్డం గీయడం, సవరించడం చేయకూడదంటూ క్షురకులకు తాలిబాన్లు ఆదేశాలు జారీ చేశారు.

షరియా చట్టం అమలు చర్చల్లో ఉంటోంది. కూడళల్లో బహిరంగంగా మృతదేహాలను వేలాడదీస్తున్నారు. ప్రజల వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

అక్కడ తాలిబాన్ల అరాచకాలు తగ్గకపోగా ఇంకా పెరుగుతున్నట్లుగా కనబడుతోంది. తాలిబాన్ల ఈ ధోరణిని అంతర్జాతీయ సమాజం ఆమోదించదు. వీరి అండతో ఇతర తీవ్రవాద సంస్థలు ధైర్యంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయనే భయం కూడా పెరుగుతోంది.

''తాలిబాన్ల గురించి ప్రతికూల నివేదికలు వస్తున్నాయి. ఈ కారణంగానే ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలు, అఫ్గాన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి ముందుకు రావట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో చైనా, రష్యా, పాకిస్తాన్ దేశాలు ఈ ప్రభుత్వానికి గుర్తింపునిస్తే అంతర్జాతీయ సమాజంలో చర్చకు దారితీస్తుంది. అంతర్జాతీయ సమాజం మూకుమ్మడిగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ దేశాలు వెళ్లినట్లు అవుతుంది'' అని పంత్ వివరించారు.

''అందుకే, ఈ దేశాలు అంతర్జాతీయ స్థాయిలో తాలిబాన్ ప్రభుత్వానికి మద్దతును కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించేలా ప్రపంచాన్ని సిద్ధం చేయడమే ఎజెండాగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. ఎక్కువ దేశాలు ఈ దిశగా నిర్ణయం తీసుకుంటే, తాలిబాన్లకు సంబంధించి పాకిస్తాన్ మరింత బలోపేతం అవుతుంది.''

తాలిబాన్

ఇస్లామిక్ తీవ్రవాదం పెరుగుతుందా?

తాలిబాన్ సర్కారు పాలన ఉన్నంత కాలం, తమకు వ్యతిరేక కార్యకలాపాలు అఫ్గానిస్తాన్‌లో పురుడు పోసుకోకూడదని మొదటి నుంచి రష్యా, చైనా, పాకిస్తాన్ దేశాలు పట్టుబట్టాయి.

తెహ్రీక్-ఇ-తాలిబాన్ గురించి పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. జిన్‌జియాంగ్ ప్రావిన్సులో తూర్పు తుర్కిస్తాన్ ఇస్లామిక్ ఉద్యమం బలోపేతం అవుతుందేమోనని చైనా భయపడుతుంది. పొరుగు దేశాలతో శాంతి సంబంధాలను కొనసాగించాలని రష్యా కోరుకుంటోంది.

పంజ్‌షీర్ వ్యాలీలో తమ రాజకీయ ప్రత్యర్థుల్ని తాలిబాన్లు చంపిన తీరుపై తజిక్, ఉజ్బెక్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అఫ్గానిస్తాన్‌తో పాటు రష్యాకు కూడా కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు చాలా దగ్గరగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ దేశాల్లో పెరుగుతోన్న ఆగ్రహం, మతోన్మాదం నుంచి రష్యా తప్పించుకోవడం కష్టమే.

''తాలిబాన్ ప్రభుత్వం చాలా రాడికల్‌గా మారుతుంది. ఇది భవిష్యత్‌లో మరింతగా విస్తరిస్తుంది. ఏ దేశంలో కూడా ఇస్లామిక్ మతోన్మాదం హద్దుల్లో ఉండదు. అది పక్కదేశాలకు కూడా విస్తరిస్తుంటుంది. రష్యా, చైనా, పాకిస్తాన్‌లను కూడా ఈ భయమే వెంటాడుతోంది'' అని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ సెంటర్ ఫర్ సౌత్ ఏషియన్ స్టడీస్ ప్రొఫెసర్ సంజయ్ కె భరద్వాజ్ అన్నారు.

సంజయ్ మరీ ముఖ్యంగా తాలిబాన్ ప్రభుత్వంలో హక్కానీ గ్రూప్ ఆధిపత్యం గురించి నొక్కి చెప్పారు. హక్కానీ మతోన్మాదం ఎలాంటిదో ప్రపంచం మొత్తానికి తెలుసు. అందుకే ఈ మూడు దేశాలు అఫ్గాన్‌లో అందరితో కలిసే పనిచేసే ప్రభుత్వం ఏర్పడాలని భావిస్తున్నాయి. ఇలాంటి ఉదారమైన ప్రభుత్వం ఏర్పడితే, అఫ్గాన్‌ వేదికగా తమకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు జరగవని ఆశిస్తున్నాయి.

ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్‌కు ఉన్న సమస్యలు ఏంటి?

చైనా, రష్యాలతో పోలిస్తే పాకిస్తాన్‌కు ఉన్న సమస్యలు కాస్త భిన్నమైనవి. తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతాయని మాత్రమే కాదు, దారుణమైన తమ దేశ ఆర్థిక పరిస్థితి గురించి కూడా పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది.

ప్రస్తుతం పాకిస్తాన్, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే జాబితాలో ఉంది. ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాలిబాన్ ప్రభుత్వానికి మద్ధతుగా ఉంటే అది పాకిస్తాన్ ప్రతిష్టను మరింత దిగజార్చగలదు.

''1996 నుంచి పరిస్థితులు చాలా మారిపోయాయి. అంతకుముందు అఫ్గానిస్తాన్‌ గురించి ప్రపంచంలో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడేమో ప్రపంచమంతా మానవ హక్కుల గురించి మాట్లాడుతోంది. అప్పట్లో తెహ్రీక్-ఇ-తాలిబాన్ ఉండేది. పాకిస్తాన్‌లో ఇప్పుడున్నంత తీవ్రవాదం అప్పట్లో లేదు. తాలిబాన్లను మొదట గుర్తించిన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఇప్పుడు మౌనం పాటిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఒక్కటే అంత పెద్ద సాహసం చేయలేదు'' అని ప్రొఫెస్ సంజయ్ వివరించారు.

తాలిబాన్ అధికార ప్రతినిధి

ఇతర దేశాలు కోరుకునే ప్రభుత్వాన్ని తాలిబాన్లు ఏర్పాటు చేస్తారా?

అఫ్గానిస్తాన్‌లో తరచుగా చెప్తోన్న 'సమ్మిళిత ప్రభుత్వ' పాలన చేయడానికి తాలిబాన్లు ఎంత మేరకు సిద్ధంగా ఉన్నారు.

అమెరికా, భారత్, రష్యా, చైనా, పాకిస్తాన్ దేశాలన్నీ తమ తమ ఆలోచనల ప్రకారం అఫ్గాన్‌లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు కావాలని అనుకుంటున్నాయి. కానీ ఈ దేశాలన్నింటి ఆలోచనలను తాలిబాన్లు పరిగణలోకి తీసుకోగలరా?

ప్రస్తుత పరిస్థితుల్లో తాలిబాన్ల పాలనలో సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చాలా కష్టమని హర్ష్ పంత్ నమ్ముతున్నారు. 'ఒకవేళ నిజంగా వారు అదే కోరుకొని ఉంటే పంజ్‌షీర్ వ్యాలీలో హింసాత్మక పద్ధతులను వినియోగించకపోయేవారు. దానికి బదులుగా రాజకీయ పరిష్కారం గురించి చర్చలు జరిపేవారు. అక్కడ అంతర్గత కలహాలు ఇంకా ముగియలేదు' అని పంత్ అన్నారు.

అయినప్పటికీ, అంతర్జాతీయ సమాజం అఫ్గాన్‌లో సమ్మిళిత ప్రభుత్వ పాలన కోసం పట్టుబడుతోంది. ఎందుకంటే అటువంటి వ్యవస్థ లేకపోతే తాలిబాన్లు కూడా అఫ్గానిస్తాన్‌ను నియంత్రించలేరు.

ఇలాంటి పాలన లేకపోతే అక్కడ అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి, విదేశీ వ్యవహారాలు సాధ్యం కావు. ఇది అఫ్గానిస్తాన్‌లో చైనా ఆర్థిక ప్రయోజనాలను ప్రభావితం చేస్తుంది.

పంజ్‌షీర్ వ్యాలీలో పోరాటం

తాలిబాన్ల ముందున్న సవాళ్లు ఏంటి?

అంతర్జాతీయ సమాజం గుర్తింపు పొందడానికి తాలిబాన్ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ఐక్యరాజ్యసమితి అసెంబ్లీలో అఫ్గానిస్తాన్ తరఫున ప్రసంగించేందుకు తాలిబాన్ ప్రతినిధికి అవకాశమివ్వాలని వారు డిమాండ్ చేశారు.

అఫ్గాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి రోజుల్లో మహిళల హక్కులతో పాటు అందరికీ స్వేచ్ఛ వంటి వాగ్దానాలను తాలిబాన్లు చేశారు. కానీ ప్రస్తుతం మాత్రం అక్కడ అలాంటి పరిస్థితి ఉన్నట్లు కనిపించడం లేదు.

తాలిబాన్ల మధ్య ఉన్న అంతర్గత కలహాలు కూడా ఇప్పుడు బయటపడ్డాయి. కాబుల్‌ను స్వాధీనపరుచుకున్న తర్వాత, ప్రభుత్వ ఏర్పాటు గురించి అధ్యక్ష భవనం వేదికగా ముల్లా బారాదర్, హక్కానీ గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగినట్లు ఊహాగానాలు కొనసాగుతున్నాయి.

అమెరికాతో చర్చల్లో కీలక పాత్ర వహించిన ముల్లా బారాదర్ అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. తాలిబాన్ నాయకుడు ముల్లా హిబ్తోల్లా అఖుంద్‌జాదా కూడా చాలా కాలంగా కనిపించడం లేదు. దీంతో వారి మధ్య సమస్యలు మరింత జఠిలమయ్యాయి. అసలు ఆయన బతికున్నారా లేదా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

ఇవే కాకుండా సంప్రదాయ జాతులు, గిరిజన వర్గాల మధ్య కూడా ఘర్షణలు కొనసాగుతున్నాయి. తూర్పు ప్రాంతంలో నివసించే పష్తున్లు బలోపేతం అయ్యారు. వారు దక్షిణ గిరిజన తెగలకు వ్యతిరేకులుగా మారారు.

పంజ్‌షీర్ వ్యాలీ ఘర్షణల తర్వాత హజారా కమ్యూనిటీలోనూ భిన్నమైన ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ప్రభుత్వంలో కొలువుదీరిన 33 మంత్రుల్లో కేవలం ముగ్గురు మాత్రమే మైనారిటీ వర్గాలకు చెందినవారు. ఇందులో ఇద్దరు తజిక్కులు కాగా మరొకరు ఉజ్బెక్ కమ్యూనిటీకి చెందినవారు. దేశంలోని అతిపెద్ద సంప్రదాయవాదుల సమూహాల్లో ఒకటైన షియా హజారా కమ్యూనిటీకి చెందిన ఒక్కరు కూడా మంత్రి వర్గంలో చోటు దక్కించుకోలేకపోయారు. ప్రభుత్వంలో మహిళా మంత్రులు కూడా లేరు.

అంతర్గత వివాదాలను చక్కదిద్దుకోవడంతో పాటు, తాలిబాన్లు తమ కఠిన వైఖరిని కూడా మార్చుకోవాల్సి ఉంటుందని ప్రొఫెసర్ సంజయ్ భరద్వాజ్ అన్నారు. కానీ అదంతా సులభంగా అయ్యే పని కాదు.

''మతోన్మాదం ఆధారంగానే ఈ గ్రూపులు ఏర్పడతాయి. ఈ మతోన్మాదాన్ని వదిలేస్తే, ఈ గ్రూపులు ఉనికిని కోల్పోతాయి. ఒకవేళ ఎవరైనా ఉదారవాద వైఖరిని అవలంబిస్తే, వారిని వ్యతిరేకించేందుకు ఈ గ్రూపుల్లో నుంచే కొత్త గ్రూపు పుట్టుకొస్తుంది'' అని సంజయ్ అన్నారు.

గతంలో ఈ తీవ్రవాద సంస్థలన్నింటికి అమెరికా, అఫ్గానిస్తాన్ ప్రభుత్వాలు ఉమ్మడి శత్రువుగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అధికారం కోసం వారిలో వారే కొట్టుకుంటున్నారు. ఇది బయటకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాలిబాన్ ప్రభుత్వానికి గుర్తింపు దక్కడం చాలా కష్టం అని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Pak, China and Russia who have supported Taliban govt now are seen nowhere why
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X