వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌: పాఠ్య పుస్తకాల ద్వారా హిందువులపై ద్వేషం పెంచుతోందా... హిందువులు ప్రపంచానికి శత్రువులా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పాకిస్తాన్‌

మీ పేరు ఏ ఇమ్రానో, అబ్దుల్లానో, అమీరో అనుకుందాం. మీరు పాకిస్తాన్‌లో ఉంటున్నారని అనుకుందాం. ఎవరైనా అపరిచిత వ్యక్తికి మీరు పేరు చెబితే అతను దాని గురించి ఎక్కువగా ఆలోచించడు. కానీ అదే పాకిస్తాన్‌లో మీ పేరును ఏ కిశోరో, ముకేశో, ఆకాశో అని చెబితే ఎలా ఉంటుంది? మీరు ఇండియా నుంచి వచ్చారా అని కచ్చితంగా అడుగుతారు.

అంతేకాదు మీరు స్వాతంత్ర్య దినాన్ని ఆగస్ట్‌ 14న కాకుండా, ఆగస్టు 15న జరుపుకొమ్మని సలహా కూడా ఇస్తారు. ఇండియా జట్టు పాకిస్తాన్‌ వచ్చిందటే, మిమ్మల్ని టార్గెట్‌ చేసుకుని సెటైర్లు కూడా వేస్తారు.

పుట్టినప్పటి నుంచి అక్కడే పెరుగుతున్నా, హిందువుగా పుట్టినందుకు చింతించేలా అక్కడి మతపరమైన పక్షపాత పరిస్థితులు ఉంటాయి. చివరకు చాలామంది భయంతో, న్యూనతా భావంతో గడపాల్సి ఉంటుంది.

పాకిస్తాన్‌లోని హిందువులు అక్కడి పాఠ్యపుస్తకాలను చదివితే వారిలో కచ్చితంగా ఆత్మన్యూనతా భావం పెరిగి పోతుంది. హిందువులను కించపరుస్తూ అక్కడి స్కూలు, కాలేజీ టెక్ట్స్‌ బుక్కుల్లో చాలా విషయాలు ఉన్నాయి.

సింధ్‌ ప్రావిన్సుకు చెందిన విద్యార్ధినీ విద్యార్ధులతో మాట్లాడితే ఈ విషయాలు ఇంకా బాగా చెబుతారు.

'హిందువులు అరాచక శక్తులు'

పాతిక, ముప్ఫై సంవత్సరాల వయసున్న కొందరు యువతీ యువకులతో బీబీసీ మాట్లాడింది. స్కూలు, కాలేజీ పుస్తకాలలో పాఠాలు ఎలా ఉంటాయో వారు వివరించారు.

"చరిత్రలో హిందువులు ముస్లింలను చాలా హింసించారు.", " కాఫీర్ అంటే మనుషులను లేదా విగ్రహాలను ఆరాధించే వాడు.", " పూర్వ కాలంలో హిందువులు తమ కుమార్తెలను పుట్టిన వెంటనే సజీవంగా పాతిపెట్టేవారు."

ఇలాంటి వాక్యాలు అనేకం కనిపిస్తాయి.

పాకిస్తాన్‌

'హిందువులు మానవత్వానికి శత్రువులు'

వివిధ రంగాలకు చెందిన కొందరు యువకులు పుట్టినప్పుడు వారి చుట్టూ ఉన్న వాతావరణంలో సహనం, సోదరభావం కనిపించేది. ఈద్, హోలీ, దీపావళి పండుగలను అందరూ కలిసే జరుపుకునే వారు.

కానీ స్కూలు, కాలేజీ వయసుకు వచ్చాక తమలో ద్వేషం, పక్షపాతపు బీజాలు నాటుతున్నట్లు ఈ యువతీ యువకులు గుర్తించారు. ఆ పని చేసేది మరెవరో కాదు, వారి పాఠ్యపుస్తకాలే.

పాకిస్తాన్‌ సింధ్‌ ప్రాంతంలోని హైదరాబాద్‌ నగరంలో నివసిస్తున్న రాజేశ్‌ కుమార్‌ మెడికల్‌ ఫీల్డ్‌లో పని చేస్తారు. ఆయన సామాజిక కార్యకర్త కూడా.

సింధ్‌ టెక్ట్స్‌బుక్ బోర్డు 11, 12 తరగతులకు సంబంధించిన 'పాకిస్తాన్‌ స్టడీస్‌' పుస్తకాన్ని రాజేశ్‌ కుమార్ ఉదహరించారు. ఆయన ఈ పుస్తకాన్ని కాలేజీ రోజుల్లో చదివారు.

"మానవ జాతికి శత్రువులైన హిందువులు, సిక్కుల చేతిలో వేలమంది మహిళలు, పిల్లలు, వృద్ధులు, యువకులు హత్యలకు, అవమానాలకు గురయ్యారు" అని ఈ పుస్తకంలోని 33 వ పేజీలో ఉంది.

సిక్కులు, హిందువులు మానవత్వానికి శత్రువులని పుస్తక రచయితల మనసులో నాటుకుని పోయి ఉండాలి. అదే విషయాన్ని పుస్తకాల్లో రాశారు.

పాకిస్తాన్‌

'ముస్లింలకు శత్రువులు'

ఇటీవలే డాక్టరైన రాజవంతి కుమారి తాను తొమ్మిది, పదో తరగతులలో చదివిన 'పాకిస్తాన్‌ స్టడీస్‌' పుస్తకాన్ని ప్రస్తావించారు. అందులో హిందువులను ముస్లింలకు శత్రువులుగా పేర్కొన్నారు.

ఈ పుస్తకంలోని 24వ పేజీలో ఒకచోట హిందూ ముస్లింలు కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని ప్రస్తావించారు. కానీ ఆ తర్వాతి పేజీల్లో మాత్రం హిందువులు ముస్లింలకు శత్రువులన్న అంశాన్ని ప్రముఖంగా చెప్పారు.

తాను హిందువునని, ముస్లింలకు శత్రువు అని ఎలా చెబుతారని రాజవంతి ప్రశ్నించారు.

"నేను చిన్నప్పటి నుంచి ముస్లింలతో పెరిగాను. నా స్నేహితులంతా ముస్లింలే. మేము, వారు కలిసి అన్ని పండగలను జరుపుకున్నాం. మా మధ్య శత్రుత్వం ఎక్కడుంది?" అని ఆమె ప్రశ్నించారు.

పక్షపాతం, ద్వేషం

పాకిస్తాన్‌ జనాభాలో 3.5% ముస్లిమేతరులు. ఒక అంచనా ప్రకారం పాకిస్తాన్‌లో హిందువుల జనాభా 1.5%.

2011లో అమెరికా ప్రభుత్వం చేసిన ఒక అధ్యయనం ప్రకారం, పాకిస్తాన్‌ పాఠశాలల్లో బోధించే పుస్తకాలలో హిందువులు, ఇతర మైనారిటీల పక్షపాతాన్ని నూరి పోస్తారని, ద్వేషాన్ని బోధిస్తారని తేలింది.

ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ రిలిజియస్‌ ఫ్రీడమ్‌ ఆఫ్‌ అమెరికా అనే సంస్థ ఈ పరిశోధన కోసం ఒకటి నుంచి పదో తరగతి వరకు వివిధ పాఠ్య పుస్తకాలను పరిశీలించింది. అలాగే స్కూళ్లను సందర్శించిన అక్కడి విద్యార్ధులు, టీచర్లతో మాట్లాడింది.

ఈ పరిశోధన ప్రకారం పాఠశాల పుస్తకాలు పాకిస్తాన్‌లో నివసిస్తున్న హిందువుల విధేయతను పొరుగు దేశమైన భారత్‌కు అనుసంధానించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తాయి.

ముస్లిమేతరులలో పాకిస్తాన్‌పట్ల భక్తి లేదన్న అభిప్రాయం విద్యార్ధుల్లో కనిపించింది.

పాకిస్తాన్‌

'మహిళలపై చిన్న చూపు'

షికార్‌పూర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి, న్యూస్‌ పేపర్‌ కాలమిస్టు పారా మాంగి పాఠ్యపుస్తకాలలో హిందూ వ్యతిరేకతపై స్పందించారు.

"పాఠాల్లో సంకుచితత్వం హిందూ సమాజాన్ని భయపెడుతోంది. మహిళల స్థితి చాలా అధ్వాన్నంగా ఉంది." అన్నారు.

"మహిళలను హిందూ మతంలో దేవతలుగా పూజిస్తారు. దుర్గా మాతా, కాళీ మాతా అంటారు. కానీ వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇది ప్రతి మతంలోనూ ఉంది. ప్రపంచంలో ప్రతిచోటా మహిళలు హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు" అన్నారు పారా.

పుస్తకాలలో హిందువులపై జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమని, అందుకు తన జీవితమే ఉదాహరణ అంటారు రాజవంతి కుమారి.

"మా ఇంట్లో మేం ఐదుగురం అక్కాచెల్లెళ్లం. మా అమ్మా నాన్నలు మమ్మల్ని ఎప్పుడూ తక్కువగా చూడలేదు. హిందువులు ఆడ పిల్లల్ని లక్ష్మీదేవిగా భావిస్తారు" అన్నారు రాజవంతి.

"హిందూమతంతో సహా ప్రపంచంలోని అన్ని మతాలు సమానత్వం, మానవత్వం గురించి బోధిస్తాయి" అన్నారు రాజేశ్‌ కుమార్‌.

పాకిస్తాన్‌

ప్రజల స్పందన

పుస్తకాలు ప్రచురించిన తర్వాత సింధ్‌ టెక్ట్స్‌బుక్‌ బోర్డ్‌ ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుంటుందని, వారు మార్పులు చేర్పులు సూచిస్తే అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆ బోర్డ్‌ టెక్నికల్‌ డైరక్టర్‌ యూసప్‌ అహ్మద్‌ షేక్‌ అన్నారు.

"కొన్ని సంవత్సరాల కిందట, సింధ్‌ ప్రావిన్స్‌లో పాఠ్యపుస్తకాలలో సాంఘిక శాస్త్రం, పాకిస్తాన్‌ స్టడీస్‌ పుస్తకాలపై మైనారిటీల నుండి కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. వీటిలోని కొన్ని అంశాలు ముస్లిమేతరులను బాధ పెడుతున్నాయని మాకు చెప్పారు. వాటిని సమీక్షించాం. అభ్యంతరాలను తొలగించాం" అని యూసఫ్‌ వెల్లడించారు.

త్వరలో మరికొన్ని అభ్యంతరాలను కూడా సమీక్షిస్తామని షేక్‌ తెలిపారు.

హిందువులుగా జీవితం కష్టం

"పాకిస్తాన్‌లో హిందువుగా జీవించడం చాలా కష్టమైన పని. కొన్నిసార్లు హిందూ పేర్లు పెట్టుకోవడం కూడా శాపంగా మారుతుంది." అన్నారు యువ జర్నలిస్ట్ సంజయ్‌ మిథారాణి.

"పుస్తకాలలో ఏది ఉందో అదే నిజమని పిల్లలు నమ్ముతారు'' అని రాజవంతి కుమారి అన్నారు.

"రెండు, మూడు, నాలుగు తరగతులలో ఉన్న పిల్లలు చరిత్రను ఎలా అర్థం చేసుకుంటారు? వారికి ఏది బోధిస్తే అదే నిజమనుకుంటారు. వారి ఆలోచనలు కూడా అలాగే మారతాయి. హిందువులు మన శత్రువులు అని వారు అనుకోవడం మొదలు పెడతారు" అన్నారామె.

"ప్రతి తరం ఈ పుస్తకాలను చదివి హిందువులపై ద్వేషాన్ని పెంచుకుంటోంది. ఇతర మతాల ప్రజలను ద్వేషించే యువకులను మనం సిద్ధం చేస్తున్నామని పాలకులు గుర్తుంచుకోవాలి" అని పారా మాంగి అన్నారు.

పాకిస్తాన్‌

నిజమైన చరిత్ర ఎలా ఉండాలి?

పాకిస్తాన్‌కు చెందిన ప్రసిద్ధ హిందువులను, వారి విజయాలను కూడా సిలబస్‌లో చెబితే, హిందూ విద్యార్థులు ఈ విషయాలపై ఆసక్తి చూపడమే కాకుండా, ఇతర విద్యార్థులకు కూడా జ్ఞానం పెరుగుతుందని సంజయ్‌ మిథారాణి అభిప్రాయపడ్డారు. ఇది జాతీయ ఐక్యతను పెంపొందించడానికి సహాయపడుతుందని అన్నారు.

పాకిస్తాన్‌లో ఇన్నాళ్లూ జాతీయతావాద పాఠ్యాంశాలను బోధించారని, ఇకపై కొత్త పుస్తకాలలో అన్ని మతాలకు సమాన ప్రాముఖ్యత ఇవ్వాలని తాను కోరుకుంటున్నానని విద్యావేత్త ఏహెచ్‌ నయ్యర్ అన్నారు.

"మన రాబోయే తరాలకు నిజమైన చరిత్రను చెప్పాలి. పాకిస్తాన్ యువతలో సహనం, సోదరభావాన్ని పెంచే పాఠ్యాంశాలను ప్రోత్సహించడానికి మనం ప్రయత్నించాలి" అన్నారు నయ్యర్‌.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Pakistan: Is hatred against Hindus increasing through textbooks,Are Hindus enemies of the world
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X