కాశ్మీర్ లో పాక్, ఐఎస్ జెండాలు: కాల్పులు, ఉద్రిక్తం
కాశ్మీర్: జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈద్ ప్రార్థనల తర్వాత హురియత్ వేర్పాటు వాదులు చెలరేగిపోయారు. శ్రీనగర్ వీధుల్లో పాక్, ఐసిస్ జెండాలను ఎగురవేశారు.
గృహనిర్బంధంలో ఉన్న గిలానీ ఇచ్చిన పిలుపు మేరకు హురియత్ కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టారు. అనంత్‌నాగ్, శ్రీనగర్‌లో పాక్ జెండాలతో ర్యాలీ తీశారు. అడ్డుకున్న పోలీసులపై ఆందోళనకారులు రాళ్లురువ్వారు. దీంతో వాళ్లను ఎదుర్కునేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉండగానే పాకిస్థాన్ జెండాలు ఎగరవేసి సైన్యానికి సవాలు విసిరారు. రోడ్ల మీదకు చొచ్చుకుని వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసుల మీద రాళ్ల వర్షం కురిపించారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు బాష్ప వాయుగోళాలు ప్రయోగించారు.

ఆందోళన కారులను చెల్లాచెదురు చేశారు. పవిత్ర రంజాన్ సందర్బంగా శుక్రవారం ప్రార్థనలు జరిగిన కొద్ది సేపటికే ఈ సంఘటన జరిగింది. గతంతో పోల్చుకుంటే జమ్మూ కాశ్మీర్ లో పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ఇలాంటి సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి.
వేర్పాటువాద సంస్థ హుర్రియత్ ఎప్పటికప్పుడు పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేస్తు స్థానికులను రెచ్చగొడుతున్నది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నది. అయితే ఇలాంటి వారి మీద పీడీపీ తగిన చర్యలు తీసుకోకుండ చోద్యం చూస్తున్నదని విమర్శలు ఉన్నాయి.
శుక్రవారం స్థానికులు పాకిస్థాన్ జెండాలతో పాటు లష్కర్ ఈ తాలిబన్, ఇస్లామిక్ స్టేట్, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థల జెండాలు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో పాల్గోనింది అందరూ యువకులే. వారి వెంట చిన్నచిన్న పిల్లలను తీసుకు వచ్చిన విషయం ఎలక్ట్రానిక్ మీడియాలో స్పష్టంగా కనపడుతున్నది.












Click it and Unblock the Notifications