పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పటికీ మాదే: ఎవరూ లాక్కోలేరు: గర్జించిన అమిత్ షా
Article 370: జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం తన తుది తీర్పును వెల్లడించింది. కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, బీఆర్ గవాయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన అయిదు మంది న్యాయమూర్తులు గల రాజ్యాంగ ధర్మాసనం.. ఈ ఉదయం ఈ తీర్పును వెలువడించింది.

దీనిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రసంగించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తోన్నట్లు చెప్పారు. ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక ప్రొవిజన్ అని సుప్రీంకోర్టు విశ్వసించిందని వ్యాఖ్యానించారు. ఇది శాశ్వతమని నమ్మినవారు రాజ్యాంగాన్ని, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీని అవమానించినట్టేనని విమర్శించారు.
గవర్నర్/రాష్ట్రపతి పాలనలో తీసుకున్న నిర్ణయాలను గానీ, చేసిన ప్రకటనలను గానీ సవాల్ చేసే హక్కు కూడా ఎవరికీ లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని అమిత్ షా గుర్తు చేశారు. ఆర్టికల్ 370ని ఎప్పుడైనా తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉందని, ఈ మేరకు ఆర్టికల్ 373లో దీనికి సంబంధించిన క్లాజ్‌ను పొందుపరిచినట్లు పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తరువాత కూడా కాంగ్రెస్ నేతలు దీన్ని అంగీకరించకపోతున్నారని, ఆర్టికల్ 370 రద్దు చేయడం అప్రజాస్వామ్యం అనే భావనలోనే ఉన్నారంటూ అమిత్ షా ధ్వజమెత్తారు. ఆర్టికల్ 370 అనేది వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేదని, ఆ వేర్పాటువాదం కాస్తా ఉగ్రవాదానికి బీజాలు వేస్తుందని వ్యాఖ్యానించారు.
ఒక నిర్ణయం చారిత్రాత్మక తప్పునకు దారి తీస్తుందని, దాన్ని గుర్తించిన తరువాత సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని అమిత్ షా అన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు తమ అభిప్రాయాన్ని మార్చుకోకపోతే రాజ్యసభలో ఆ పార్టీకి ఉన్న బలం ఇక ముందు ఉండకపోవచ్చని పేర్కొన్నారు.

ఇప్పటికీ కాంగ్రెస్ తమ పాత నిర్ణయానికే కట్టుబడి ఉంటే.. మరోసారి ఆ పార్టీకి ఘోర పరాజయం తప్పదని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమ గెలుపును ఎవరూ ఆపలేరని, మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అధికారాన్ని అప్పగించి తీరుతారని తేల్చి చెప్పారు. ఇదివరకు జమ్మూలో 37, కాశ్మీర్‌లో 46 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవని, పునర్విభజన తరువాత వాటి సంఖ్య 43, 47కు పెరిగాయని అమిత్ షా గుర్తు చేశారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలను రిజర్వ్‌లో ఉంచామని, అవి ఎప్పటికీ తమవేనని అమిత్ షా స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌దేనని, దీన్ని ఎవరూ తమ నుంచి లాక్కోలేరని అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు చప్పట్లతో రాజ్యసభ మారుమోగింది.












Click it and Unblock the Notifications