పాక్ ఉగ్రవాది నవెద్ యాకూబ్ ఢిల్లీకి షిఫ్ట్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది మహమ్మద్ నవెద్ యాకూబ్ ను ప్రత్యేక విమానంలో ఢిల్లీ తరలించడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సిద్దం అయ్యారు. అతనిని ఢిల్లీ తీసుకు వెళ్లి హెడ్ క్వార్టర్స్‌లో విచారణ చేసి పూర్తి వివరాలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు.
గురువారం మద్యాహ్నం ప్రత్యేక విమానాన్ని సిద్దం చేశారు. బుధవారం రాత్రి వరకు జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో నవెద్ ను విచారించి పలు ఆసక్తికరమైన విషయాలు బయటకు లాగారు. అయితే భద్రతా, విచారణ తదితర కారణాల వలన నవెద్ ను ఢిల్లీకి తరలించాలని ఎన్ఐఏ అధికారులు నిర్ణయించారు.
జమ్మూ కాశ్మీర్ లోని ఉధంపూర్ లో బీఎస్ఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని నవెద్ ఇంకో ఉగ్రవాదితో కలిసి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. స్థానికులు ప్రాణాలకు తెగించి నవెద్ ను ప్రాణాలతో పట్టుకుని జవాన్లకు అప్పగించారు. ఎన్ఐఏ కోర్టు 14 రోజులు నవెద్ ను విచారణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది.

ఇప్పటికే నవెద్ కు సహాయం చేసిన 11 మందిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. నవెద్ కు 12 మంది ఉగ్రవాదులతో సంబంధం ఉందని దర్యాప్తు చేస్తున్న అధికారులు గుర్తించారు. నవెద్ మీద అనేక సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు.
నవెద్ పట్టుబడిన తరువాత అతను రోజుకు ఒక మాట చెబుతున్నాడు. అతను చెప్పే మాటలలో ఎంత నిజం ఉంది అని ఆరా తీయ్యడానికి ఢిల్లీ తీసుకు వెలుతున్నామని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. నవెద్ కొత్త విషయాలను తెర మీదకు తీసుకు వస్తున్నాడని దర్యాప్తు చేస్తున్న అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications