పాన్-ఆధార్ కార్డ్ లింక్ గడువు తేదీ పొడిగింపు: ఎప్పటివరకంటే..?
న్యూఢిల్లీ: పర్మినెంట్ అకౌంట్ నెంబర్(PAN).. ఆధార్(Aadhaar) కార్డ్ లింక్ చేయని వారికి కేంద్రం మరో అవకాశాన్ని ఇచ్చింది. పాన్-ఆధార్ లింక్ గడువు తేదీని జూన్ 30, 2023 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. పన్ను చెల్లింపుదారులకు ఇంకొంత కాలం సమయం ఇచ్చేందుకు గడువు తేదీ పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది.
ఆదాయపుపన్ను చట్టం 1961 ప్రకారం ఆధార్ నెంబర్‌ను 2023 మార్చి 31లోగా పాన్ కార్డుకు లింక్ చేయాలని తెలిపింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవని హెచ్చరించింది. తాజాగా, ఆ గడువు తేదీని జూన్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

కాగా, పాన్-ఆధార్ లింక్ గడువును మరో ఆరు నెలలు పొడిగించాలని.. రూ. 1000 రుసుమును కూడా తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలుడింది.
మార్చి 31, 2022కి ముందు ఆధార్-పాన్ లింక్ ఉచితంగా ఉండేది. ఏప్రిల్ 1, 2022 నుంచి రూ. 500 రుసుము విధించింది. ఆ తర్వాత జులై 1, 2022 నుంచి ఆ రుసుమును రూ. 1000కి పెంచారు. కాగా, అవసరమైన విధంగా తమ ఆధార్‌ను లింక్ చేయడంలో విఫలమైన పన్ను చెల్లింపుదారుల PAN జూలై 1, 2023న పనిచేయదు.












Click it and Unblock the Notifications