పట్టు చిన్నమ్మదేనా?: జయ ఇంట్లో శశికళతో పన్నీరుసెల్వం, మంత్రులు భేటీ
జయలలిత మరణంతో అన్నాడియంకె ముక్కలు చెక్కలు కావచ్చునని ఉహాగానాలు చెలరేగుతున్న సమయంలో సిఎం పన్నీరు సెల్వం, ఇతర సీనియర్ మంత్రులు శశికళతో సమావేశమయ్యారు.
చెన్నై: జయలలిత మరణంతో అన్నాడియంకె ముక్కలు చెక్కలవుతుందని ఊహాగానాలు చెలరేగుతున్న తరుణంలో పన్నీరు సెల్వం, ఇతర సీనియర్ మంత్రులు గురువారంనాడు చిన్నమ్మ శశికళతో భేటీ అయ్యారు. అదీ, జయలలిత నివాసంలో వారు ఆమెను కలుసుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
ఎన్డీటివీ వార్తాకథనం ప్రకారం - జయలలిత స్థానంలో శశికళ పార్టీ పగ్గాలను చేబట్టవచ్చుననే ప్రచారం సాగుతోంది. అన్నాడియంకె నేతలు కూడా దీన్ని కాదనడం లేదు. శశికళ మంగళవారంనాడు జయలలితకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
పార్టీలో తన స్థానాన్ని పదిలం చేసుకుని, పార్టీ పగ్గాలు చేతికి తీసుకునేందుకు శశికళ సోమవారంనాడు అన్నాడియంకె అగ్ర నాయకులను ఒప్పించినట్లు సమాచారం. ఆ తర్వాత ఆమె పలు సమావేశాలు కూడా నిర్వహించారు.

ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ఓ. పన్నీరు సెల్వం కూడా శశికళకు సన్నిహితుడని తెలుస్తోంది. ఆ కారణం వల్లనే పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి పదవిని చేపట్టగలిగారని అంటున్నారు. పోయెస్ గార్డెన్‌కు శశికళ వెన్నెముక అని అన్నాడియంకె అధికార ప్రతినిధి డివి మైత్రేయన్ ఎన్డీటివితో అన్నారు. దీన్ని బట్టి పార్టీ ఆమెను బలపరుస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.
పన్నీర్ సెల్వం, శశికళ ఒకే కమ్యూనిటీకీ చెందినవారు. జయలలిత కోసం పన్నీరు సెల్వం గతంలో రెండు సార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆయనను శశికళ నియంత్రించినట్లు చెబుతారు. కొత్త చీఫ్‌ను ఎన్నుకోవడానికి అన్నాడియంకె నేతలు పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించే అవకాశాలు కూడా లేకపోలేదు.
జయలలితకు ఉన్న అపారమైన అధికారాల నేపథ్యంలో ఆమె ఉన్నప్పుడు అటువంటిది ఎప్పుడూ జరగలేదు. ఆమె అధికారాన్ని ప్రశ్నించినవారెవరూ లేరు. ప్రశ్నించడానికి ప్రయత్నించినవారు కూడా లేరు.












Click it and Unblock the Notifications