ప్రముఖ హిప్నాటిస్ట్ 'మిస్టరీ డెత్' : అదృశ్య శక్తి వెంటాడిందని..
న్యూఢిల్లీ : పారా నార్మల్ కు సంబంధించి ఎన్నో మిస్టరీ కేసులను సమర్థవంతంగా డీల్ చేసిన ప్రముఖ పారా నార్మల్ పరిశోధకుడు హిప్నాటిస్ట్ గౌరవ్ తివారీ మరణం కూడా అంతే మిస్టరీగా మారిపోయింది. విపరీత మానసిక పోకడలను అదుపులోకి తీసుకురావడంలో మంచి నేర్పరిగా పేరున్న గౌరవ్ తివారీ ఢిల్లీలోని తన ఫ్లాట్ లో గత గురువారం అనుమానస్పద స్థితిలో మరణించారు.
భారత పారానార్మల్ సొసైటీ వ్యవస్థాపక సీఈవో అయిన తివారీ, ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో నివాసముంటున్నారు. కాగా, గత గురువారం ఇంట్లో ఉన్న బాత్రూమ్ లో అనుమానస్పద స్థితిలో మరణించారు తివారీ. బాత్రూమ్ నుంచి పెద్ద శబ్డమేదో రావడంతో పరుగెత్తికెళ్లిన అతని కుటుంబ సభ్యులు, తలుపులు తెరిచి చూడగా అపస్మారక స్థితిలో పడిపపోయి ఉన్నాడు గౌరవ్.
దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే గౌరవ్ ప్రాణాలు విడిచినట్టు వైద్యులు ధృవీకరించారు. కాగా ఆయన భార్య చెబుతున్న వివరాలను చేధించడం గౌరవ్ మిస్టరీ డెత్ కు సంబంధించి పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది. నెలరోజుల క్రితం ఏదో ప్రతికూల అదృశ్య శక్తి తనను బలంగా తనవైపు లాక్కుంటోందని గౌరవ్ తివారీ తనతో చెప్పినట్టుగా ఆయన భార్య తెలిపారు. ఎంతగా ప్రయత్నించినా ఆ శక్తిని ఎదుర్కోవడం తన వల్ల కావట్లేదని తన దగ్గర వాపోయినట్టుగా అతని భార్య పేర్కొంది.

అయితే నిత్యం అలాంటి కేసులనే డీల్ చేసే గౌరవ్, పని ఒత్తిడి కారణంగా అలాంటి ఆలోచనలకు లోనవుతున్నట్టుగా భావించి పెద్దగా పట్టించుకోలేదని వివరించింది గౌరవ్ భార్య. ఇదిలా ఉంటే, గౌరవ్ మృత దేహానికి జరిపిన ప్రాథమిక పోస్ట్ మార్టంలో మెడ చుట్టూ నల్లటి ఛారిక ఉన్నట్లు తేలడంతో, ఊపిరాడక చనిపోయి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే పారానార్మల్ గురించి సమాజంలో అవగాహన తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోన్న గౌరవ్ 2009లో భారత పారానార్మల్ సొసైటీని ఏర్పాటు చేసి దాని ద్వారా సేవలందిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 6000 ప్రాంతాల్లో ఆయన పారానార్మల్ కేసులను డీల్ చేసినట్టుగా సమాచారం. చాలా కేసులు విచారణలో ఉండగానే ఆయన మరణించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం విచారణ వేగవంతం చేసిన పోలీసులు నిజానిజాలను నిర్దారించే పనిలో పడ్డారు.












Click it and Unblock the Notifications