Parliament Day 9 : రాష్ట్రపత్ని వ్యాఖ్యల చిచ్చు-బీజేపీ వర్సెస్ కాంగ్రెస్-ఎంపీల సస్పెన్షన్ల పర్వం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొమ్మిదో రోజూ విపక్షాల నిరసనలతోనే సభా కార్యకలాపాలు వృథా అయ్యాయి. ముందుగా కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఉద్దేశించి చేసిన రాష్ట్రపత్ని వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు నిరసన తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో పాటు రంజన్ చౌదరి కూడా క్షమాపణలు చెప్పాలన్నారు. అధిర్ రంజన్ పొరబాటైందంటూ క్షమాపణ చెప్పినా బీజేపీ ఎంపీలు శాంతించలేదు. చివరికి ఇతర అంశాలపై కాంగ్రెస్ కూడా నిరసనలు చేపట్టింది. దీంతో మధ్యాహ్నం వరకూ సభా కార్యకలాపాలు ముందుకు సాగలేదు.
పార్లమెంటు లోపల సభ్యుల నినాదాలు, నిరసనలు కొనసాగించడంతో రాజ్యసభ, లోక్‌సభ రెండూ రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ రాజ్యసభలో మరో ముగ్గురు ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ గుప్తా, సంజీవ్ కుమార్ పాఠక్, స్వతంత్ర ఎంపీ అజిత్ కుమార్ భుయాన్ సభలో ప్లకార్డులు పట్టుకున్నందుకు రాజ్యసభ నుండి సస్పెండ్ అయ్యారు.

గుజరాత్ కల్తీ మద్యం దుర్ఘటనపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ ముగ్గురు ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్ వారిని సస్పెండ్ చేశారు. దీంతో రాజ్యసభ నుంచి సస్పెండ్ చేసిన మొత్తం ఎంపీల సంఖ్య ఇప్పుడు 23కి చేరుకుంది. లోక్‌సభ నుంచి నలుగురు కాంగ్రెస్ ఎంపీలు కూడా ఇంతకుముందు సస్పెండ్ అయ్యారు.
ద్రవ్యోల్బణం, జీఎస్టీ పెంపుపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఆద్యంతం నిరసనలు తెలిపాయి. నిరసనల మధ్య పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొమ్మిదో రోజు కూడా లోక్‌సభ, రాజ్యసభలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. 20 మంది ఎంపీల సస్పెన్షన్‌ను కూడా రద్దు చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. సస్పెన్షన్‌కు గురైన 20 మంది ఎంపీలు గాంధీ విగ్రహం సమీపంలోని పార్లమెంట్ కాంప్లెక్స్‌లో 50 గంటలపాటు నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications