Parliament : ధరలమంటపై లోక్ సభ-అగ్నిపథ్ పై రాజ్యసభ-రేపటికి వాయిదాల పర్వం
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం ఇరుసభల్లోనూ తాజాగా ఎన్నికైన సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఈ మధ్యే హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని షింబో అబేకు సభ్యులు నివాళులు అర్పించారు. ఆ తర్వాత విపక్షాల నిరనసలు మొదలయ్యాయి. అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికలకు ఎంపీలు ఓటు వేసేందుకు వీలుగా లోక్ సభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడగా.. రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.
లోక్ సభలో కొత్త ఎంపీల ప్రమాణస్వీకారం తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా మధ్యాహ్నం రెండు గంటల వరకూ స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే దేశంలో ధరల పెరుగుదలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీనికి అధికారపక్షం అంగీకరించడకపోవడంతో విపక్ష ఎంపీలు స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లారు. స్పీకర్ కూడా దీనిపై ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో వారు నిరసన కొనసాగించారు. చివరికి సభ్యులు ఎంతకూ శాంతించకపోవడంతో స్పీకర్ రేపటికి సభను వాయిదా వేశారు.

మరోవైపు రాజ్యసభలోనూ దాదాపు ఇదే పరిస్ధితి. ఇక్కడ కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత విపక్ష ఎంపీలు అగ్నిపథ్ పై చర్చకు పట్టుబట్టాయి. ఆర్మీలో అగ్నిపథ్ పథకం అమలుపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సభలో దీనిపై వెంటనే చర్చించాలని కోరాయి. అయితే ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో విపక్ష ఎంపీలు మరోసారి నిరసనకు దిగారు. రాజ్యసభలో అన్ని ఆంశాలపై చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు విపక్షానికి నచ్చదెప్పేందుకు ప్రయత్నించారు. అయినా విపక్షం శాంతించకపోవడంతో మధ్యాహ్నానికి ముందే రాజ్యసభ రేపటికి వాయిదా పడిపోయింది.
మరోవైపు పార్లమెంటులో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు అభ్యర్ధులకు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాని మోడీతో పాటు బీజేపీ, ఇతర పార్టీల ఎంపీలు వరుసగా క్యూల్లో నిలబడి ఓట్లు వేశారు. ఇప్పటికే ఎన్డీయే నిలబెట్టిన అభ్యర్ధి ద్రౌపదీ ముర్ముకు బీజేపీతో పాటు ఇతర ప్రధాన పార్టీలన్నీ మద్దతిస్తున్న నేపథ్యంలో ఆమె విజయం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హా కూడా గణనీయంగా ఓట్లు సాధించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications