Parliament Roundup Today: ఆధార్-ఓటర్ కార్డ్ లింకింగ్ బిల్లుకు లోక్ సభ ఆమోదం,రాజ్యసభలో రచ్చ
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇవాళ కూడా విపక్షాల నిరసనలు మిన్నంటాయి. ఉభయసభల్లోనూ విపక్షాలు పలు కీలక అంశాలపై చర్చ కోరుతూ నిరసనలు చేపట్టాయి. అయితే కేంద్రం మాత్రం వారి డిమాండ్లపై అస్సలు స్పందించలేదు. దీంతో నిరసనల మధ్యే కీలకమైన ఎన్నికల చట్టాల సవరణ బిల్లు ఆమోదం పొందింది.
దేశంలో ఎన్నికల ప్రక్రియలో అక్రమాల నియంత్రణ కోసం ఓటరు కార్డుల్ని ఆధార్ కార్డులకు లింక్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న ఎన్నికల చట్టాల్ని సవరించింది. ఈ మేరకు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు ఇవాళ లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును కాంగ్రెస్, టీఎంసీ, ఎంఐఎం, బీఎస్పీ సహా పలువురు విపక్ష సభ్యులు వ్యతిరేకించారు. బిల్లుకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. నిరసనల మధ్యే ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది.

అటు రాజ్యసభలో విపక్ష ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా విపక్షాల ఆందోళనకు కొనసాగాయి. ఇదే సమయంలో ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ నార్కోటిక్స్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్ధాల చట్ట సవరణ బిల్లును ఆమోదం కోసం ప్రవేశపెట్టారు. దీంతో విపక్ష సభ్యులు నిరసనలకు దిగారు. ఏ తప్పూ చేయని 12 మంది ఎంపీలు పార్లమెంట్ బయట నిరసన తెలుపుతుంటే తప్పు చేసిన కేంద్రమంత్రి మాత్రం సభకు హాజరవుతున్నారని కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. మిగతా ఎంపీలు కూడా కేంద్రం తీరును తప్పుబట్టారు. నిరసనల మధ్యే సభ సాయంత్రం 5 గంటల వరకూ వాయిదా పడింది.
అటు లోక్ సభలో ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ రెండు కీలక ప్రకటనలు చేశారు. విపక్షాల ప్రశ్నలకు సమాధానంగా రుణాల ఎగవేత దారుల నుంచి బ్యాంకులు రూ.13 వేల కోట్లకు పైగా ఆస్తుల్ని జప్తు ద్వారా వసూలు చేశాయని లోక్ సభకు తెలిపారు. అలాగే నిత్యవసర వస్తువులు, ఆహార నూనెల ధరల పెరుగుదలపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై నిర్ణయాలు తీసుకుంటుందని పార్లమెంట్ కు హామీ ఇచ్చారు.
నేటి పార్లమెంట్ హైలెట్స్
- పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం
- పార్లమెంట్ ఉభయసభ్లలోనూ విపక్షాల నిరసనలు
-లోక్ సభలో ఎన్నికల చట్టాల సవరణ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి కిరణ్ రిజిజు
- లోక్ సభలో ఎన్నికల చట్టాల సవరణ బిల్లుపై విపక్షాల నిరసనలు
- ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం
- రాజ్యసభలో నార్కో చట్ట సవరణ బిల్లును ఆమోదం కోసం పెట్టిన మంత్రి నిర్మలా సీతారామన్
- రాజ్యసభలో విపక్ష ఎంపీల సస్పెన్షన్ పై ఎంపీల నిరసనలు, సాయంత్రం 5 గంటలకు వాయిదా












Click it and Unblock the Notifications