పార్లమెంట్ రౌండప్-లఖీంపూర్ ఘటనపై ఉభయసభల్ని అడ్డుకున్న విపక్షాలు-రేపటికి వాయిదా
యూపీలోని లఖీంపూర్ ఖేరీలో రైతులపై కారు పోనిచ్చి నలుగురి మృతికి కారణమైన ఘటన ఉద్దేశపూర్వకంగా చేసిందేనంటూ సిట్ రిపోర్ట్ ఇచ్చిన వ్యవహారం ఇవాళ పార్లమెంటును దద్దరిల్లేలా చేసింది. సిట్ నివేదికపై పార్లమెంట్ లో చర్చ కోరుతూ విపక్షాలు ఉభయసభల్ని అడ్డుకున్నాయి. దీంతో ఇరుసభల్లోనూ ప్రశ్నోత్తరాల సమయం నుంచి నిరసనలు కొనసాగాయి. తొలుత మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడిన ఇరుసభలు.. అనంతరం కూడా నిరసనలు కొనసాగడంతో రేపటికి వాయిదా పడక తప్పలేదు.
లఖీంపూర్ ఖేరీ ఘటనకు బాధ్యతగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా తేనీ రాజీనామా చేయాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ఇప్పటికే ఈ ఘటనకు బాధ్యుడిగా అజయ్ మిశ్రా కుమారుడు అమిత్ మిస్రాను పోలీసులు అరెస్టు చేశారు. తొలుత అమిత్ మిశ్రా అరెస్టు కాకుండా అడ్డుపడ్డ అజయ్ మిశ్రా సుప్రీంకోర్టు జోక్యంతో వెనక్కి తగ్గక తప్పలేదు. ఆ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేసి తాజాగా నివేదిక ఇచ్చంది. ఇందులో లఖీంపూర్ ఖేరీ ఘటన ఉద్దేశపూర్వకంగా చేసిందేనని పేర్కొంది. దీంతో వచ్చే ఏడాది జరిగే యూపీ ఎన్నికలకు బీజేపీ ప్రత్యర్ధులకు ఇదో అస్త్రంగా కలిసొచ్చింది.

Recommended Video
లఖీంపూర్ ఖేరీ ఘటనను రాజకీయంగా వాడుకుంటూ బీజేపీని టార్గెట్ చేస్తున్న విపక్షాలు.. ఈ పార్లమెంట్ సమావేశాల్లో మిగిలిన రోజులన్నీ అదే విషయంపై చర్చకు పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటులో లఖీంపూర్ ఘటనపై చర్చ జరిగితే దాన్ని యూపీలో రాజకీయంగా వాడుకోవచ్చని విపక్షాలు భావిస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం అలా జరక్కుండా అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో విపక్షాలు కోరుతున్న విధంగా అజయ్ మిశ్రాతో రాజీనామా చేయించేందుకు కూడా ససేమిరా అంటోంది. దీంతో మరికొన్ని రోజుల పాటు ఈ రచ్చ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్లమెంటు సమావేశాల్లో కీలకమైన క్రిప్టో కరెన్సీ సహా ఇతర బిల్లులు ప్రవేశపెట్టేందుకు వీలు పడలేదు. అలాగే ఎన్నికల సంస్కరణల బిల్లు ప్రవేశపెట్టేందుకు కూడా కేంద్రం ప్రయత్నిస్తోంది. కానీ విపక్షాల నిరసనలతో సాధ్యం కావడం లేదు.












Click it and Unblock the Notifications