Parliament special sessions : పార్లమెంట్ ప్రత్యేక భేటీ గుట్టువిప్పని కేంద్రం ! ముందు రోజు అఖిలపక్ష భేటీ..
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ నెల 18 నుంచి 22 వరకూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. అయితే ఈ ఐదు రోజుల్లో ఏం చేయబోతున్నారనే దానిపై కేంద్రం అస్సలు నోరు మెదపడం లేదు. ఎంతమంది ఎన్ని విమర్శలు చేస్తున్న మౌనమే సమాధానంగా మారుతోంది. దీంతో విపక్షాల్లో సైతం అసహనం పెరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రధాని మోడీకి దీనిపై లేఖ కూడా రాశారు. అయినా స్పందన శూన్యం.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఐదు బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఇందులో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు (యూనిఫామ్ సివిల్ కోడ్), జమిలి ఎన్నికల బిల్లు, ఇండియా నుంచి భారత్ పేరు మార్పు బిల్లు, మహిళా బిల్లు ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని బిల్లులు కూడా పెట్టొచ్చనే చర్చ జరుగుతోంది. అయితే వీటిలో ఏ ఒక్క దానిపైనా కేంద్రం నుంచి క్లారిటీ లేదు. దీంతో రాజకీయ పార్టీలన్నీ కేంద్రంవైపే చూస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్రం ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ముందు రోజు అంటే సెప్టెంబర్ 17న అఖిలపక్ష భేటీ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటివరకూ ఆగాల్సిందేనని కేంద్రం పరోక్షంగా తేల్చేస్తోంది. దీంతో విపక్షాలు కూడా ఏమీ చేయలేక మౌనంగా చూస్తున్నాయి. అఖిలపక్ష భేటీలోనే తాడోపేడో తేల్చుకుంటామని చెప్తున్నాయి.
ఈ నెల ప్రారంభంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించిన పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి ఒక రోజు ముందు అంటే 17న ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ప్రత్యేక సమావేశానికి సంబంధించిన అజెండాపై అఖిలపక్ష సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. పార్లమెంటు పాత భవనంలో ప్రత్యేక సమావేశాలు ప్రారంభమై సెప్టెంబర్ 19న కొత్త భవనానికి మారనున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications