వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్ట్ టైమ్ జాబ్ స్కామ్స్: ఫేక్ ఉద్యోగ సైట్లను ఎలా గుర్తించాలి, మోసపోకుండా ఏం చేయాలి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఫేక్ జాబ్స్

రాకేశ్ ఒక యూనివర్సిటీ విద్యార్థి. వీలైనంతవరకూ తన ఖర్చుల కోసం ఇంటివాళ్లపై ఆధారపడకుండా ఏవో చిన్నాచితకా పనులు చేసుకుంటూ ఉండడం అలవాటు.

ఒక రోజు వాట్సాప్‍లో ఒక మెసేజ్ వచ్చింది. “పార్ట్ టైమ్ ఉద్యోగాలు ఇస్తున్నాం. ఈ లింక్‌పైన క్లిక్ చేయండి”అని మెసేజ్‌లో రాసివుంది.

అలా తెలియని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లు నమ్మకూడదని విని ఉన్నాడు, అందుకని ముందు కాస్త తటపటాయిస్తూనే వాళ్ళతో మాట్లాడాడు.

కంపెనీ వివరాలు అడిగాడు. నిమిషాల వ్యవధిలో బ్రాండెడ్ కంపెనీ పేరుతో సహా, రెజిస్ట్రేషన్ నంబరు, అడ్రస్ అన్నీ ఇచ్చారు.

కాస్త నమ్మకం కుదిరి, వెబ్‍సైటులో(shopperstop.com) లాగిన్ అయితే, “టాస్క్” రూపంలో ఏవో కొన్ని పనులు చేయించి, అవి పూర్తవ్వగానే వెబ్‍సైటులో అతని ఖాతాలో డబ్బులు వేశారు. ఆ డబ్బులను తన వ్యక్తిగత బాంక్ అకౌంట్‍కు బదిలీ చేశాడు రాకేశ్.

ఫేక్ జాబ్స్

ఆ తర్వాత ఇంకొన్ని టాస్క్స్. వాటిని చేయడానికి ముందుగా కాస్త డబ్బు పెట్టుబడి పెట్టాలి అంటే, తటపటాయిస్తూనే, చిన్న మొత్తమే కదా అని వేశాడు. వందల్లో మొదలైన వ్యవహారం మరుసటి రోజుకి వేల రూపాయల్లోకి మళ్ళింది. రోజుకో అరగంట-గంట ఆ వెబ్‍సైటులో ఆర్డర్స్ చూసుకుంటే చాలు, డబ్బులు వచ్చాయి.

ఇంకొన్ని పెద్ద టాస్క్‌లు తీసుకోడానికి మరికొన్ని డబ్బులు వేయాలన్నారు. మూడు, నాలుగు సార్లు రూ.1,500 వరకూ తన బ్యాంక్ అకౌంట్‌లోకి వేసుకోగలిగాను కదా అన్న ధైర్యంతో రాకేశ్ వేశాడు. అప్పటినుంచి మొదలు, “నీకు రావాల్సిన మొత్తం: రూ. xxxx, కానీ అవి రావాలంటే ముందు రూ. yyyy” వేయి అని మెసేజ్‌లు రావడం మొదలైంది. రూ.1500 కాస్త ఇరవై నాలుగు గంటలు తిరక్కముందే రూ.30,000కి చేరింది. అంత డబ్బు వేసే స్థోమత లేక, అలా అని చేసిన పనికి రావాల్సిన డబ్బంతా రాకుండా ఆగిపోతుందని నలిగిపోతూ, ఒక ఫ్రెండ్‌కు జరిగిన విషయం చెప్తే, ఇది స్కామ్‍ అన్న చేదు విషం బయటపడింది.

ఫేక్ జాబ్స్

వర్క్ ఫ్రమ్ హోమ్ మోసాలు

ఏదో ఒకసారి, ఒక రూపంలో, ఒకరిద్దరికి ఎదురయ్యే అనుభవం కాదు ఇది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైమ్ ఉద్యోగాల స్కాములు ఎప్పటినుంచో నడుస్తున్నాయి.

ఒకప్పుడు, “మీరు ముగ్గురిని ఈ ప్రాజెక్టులోకి తీసుకురావాలి. ఆపైన వారు ముగ్గురేసి మందిని చేర్పించాలి. అలా ఎంత కాలం లైన్ ఆగకుండా వెళ్తే, మీకన్ని డబ్బులు” అని మోసగించే బాచ్‍లు ఉండేవారు. అయితే, ఇప్పుడు వాళ్ళు కూడా టెక్నాలజీని బాగా వాడుకోగలుగుతున్నారు.

వ్యాసం మొదట్లో చెప్పిన shoppers68.com, అచ్చంగా మనకి తెలిసిన 'షాపర్స్ స్టాప్’ అనే బట్టల బ్రాండ్‍ను పోలి ఉంటుంది.

కంపెనీ గురించి ఏ వివరాలు అడిగినా ఆ కంపెనీవే ఇస్తారు. దానితో వెరిఫై చేసుకునేవాళ్ళు కూడా కరెక్ట్ డీటెయిల్స్ కదా అని ముందుకు కొనసాగుతారు.

ఆ తర్వాత, వెబ్‍సైట్‍లోకి లాగిన్ అయ్యాక, ఫేక్ సైట్‍ ఏమోనని అనుమానాలు వచ్చేలా ఏమీ లేకుండా రూపొందిస్తారు.

ఫేక్ జాబ్స్

ఫేక్‌ సైట్లు ఎలా ఉంటాయి?

  1. వాడే ఇంగ్లిషు భాష పద్ధతిగా, తప్పులు లేకుండా ఏదన్నా నమ్మశక్యమైన సైటులో ఉన్నట్టే ఉంటుంది.
  2. ఇచ్చే “టాస్క్”లు కూడా ఆ కంపెనీకి సంబంధించిన వస్తువులతోనే ఉంటాయి.
  3. మనం డబ్బులు వేయడానికి, మన బాంక్ అకౌంట్‍లోకి వేసుకోడానికి అన్ని విధాల సౌకర్యాలు ఆ వెబ్‍సైటులోనే ఉంటాయి. వాళ్ళకి డబ్బులు వేసేటప్పుడు ఏ బాంక్ అకౌంట్‍లోకి వేస్తున్నామో వివరాలు తెలియనివ్వకుండా, మన వివరాలన్నీ టైపు చేసే వీలుగా ఉంటాయి.
  4. ప్రస్తుతం మన ఖాతాలో ఉన్న బాలెన్స్ చూపించడం, కొత్త టాస్క్‌లను ఎంపిక చేసుకోడానికి ఉన్న ఆప్షన్స్ అన్నీ పకడ్బందీగా, సాఫ్ట్‌వేర్ ద్వారానే అయిపోయేట్టు ఉంటాయి.

దీనికి తోడు, అడపాదడపా సందేహాలు తీర్చడానికి ఉన్న వ్యక్తులు కూడా వాట్సాప్‍లో అందుబాటులో ఉంటూ ప్రొఫషనల్స్‌లా వ్యవహరిస్తూ ఏ మాత్రం అనుమానం రానివ్వకుండా మాట్లాడతారు.

వీటన్నింటితో పాటు, మొదటి రెండు రోజుల పనికి డబ్బు కూడా కచ్చితంగా మన బాంక్‍లోకి జమ చేస్తారు.

ఫేక్ జాబ్స్

అనుమానాలకు తావిచ్చే సూచనలు

వాళ్ళెంత పకడ్బందీగా అన్నీ నిర్వహిస్తున్నా, అనుమానింపజేసేలా కొన్ని విషయాలు ఉంటూనే ఉంటాయి. వాటిల్లో కొన్ని:

  • ఎంత పార్ట్‌టైమ్ ఉద్యోగమే అయినా, కంపెనీ జీతాలు ఇవ్వాలి కాబట్టి కాసిన్ని అదనపు డాక్యుమెంట్స్, వెరిఫికేషన్స్ ఉండకుండా ఉండవు. అలా కాకుండా, కేవలం మన నెట్‍ బ్యాంకింగ్ వివరాలు తీసుకుని, దాంట్లోకి డబ్బులు వేస్తూ పోతారనడం మొదటి హెచ్చరిక.
  • పని చేయడానికి డబ్బు కట్టకతప్పని నియమాలు. “మీరింత పని చేసి ఇంత డబ్బు సంపాదించచ్చు. కానీ, ప్రస్తుతానికి మీకంత అర్హత/అనుభవం లేవు. ఆ అనుభవాన్ని మీరు మీ డబ్బుతో కొని, అప్పుడు పని మొదలుపెట్టండి” అన్న ప్రాథమిక సూత్రంపైన ఈ స్కామ్ మొత్తం నడుస్తుంది. కాస్త నమ్మకం కుదిరి, మన డబ్బు కొంచెం పెట్టి, పని చేశాక, “ఇంకా డబ్బు పెట్టకపోతే నేను ఇప్పటిదాకా సంపాదించుకున్నదీ పోతుంది కదా!” అని దిశగా నెట్టడంలో వాళ్ళు నిష్ణాతులు. ఇది అన్నింటికన్నా పెద్ద ప్రమాద ఘంటిక.
  • వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్, బ్యాంక్ వివరాలు తరుచుగా మారుస్తూ ఉంటారు. దీని వల్ల ఆయా నెంబర్లు/అకౌంట్లని రిపోర్ట్ చేసి స్కామ్ అని నిరూపించినా, మళ్ళీ కొత్త నంబర్లతో తయారవుతుంటారు.
ఫేక్ జాబ్స్

మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?

అన్నింటికన్నా ఉత్తమం, ఊరికే ఉండడం. తెలిసినవాళ్ళు, నమ్మకస్థుల దగ్గరే ఉద్యోగాల కోసం వెతుక్కోవడం. అయితే, అది అన్నివేళలా కుదిరే పరిస్థితి కాదు ఇది. ఒక్కోసారి పరిస్థితుల వల్ల, మనమున్న మానసికావస్థల వల్ల ఇలాంటి మోసాలకు లొంగిపోతూ ఉంటాం. అప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు:

  1. ఆ ఫలనా కంపెనీ గురించి గూగుల్/యూట్యూబ్‍లలో వెతకడం: దీనివల్ల ఇలాంటివి జరిగి మోసపోయిన వాళ్ళుంటే వాళ్ళ అనుభవం మనకి గుణపాఠం అవుతుంది. నిజంగా, నమ్మదగిన కంపెనీ అయితే అందుకు తగ్గ రేటింగ్స్/ఫీడ్‌బ్యాక్ ఏవో కనిపిస్తాయి.
  2. స్నేహితులతో, సన్నిహితులతో పంచుకోవడం: మన మానసికావస్థ వల్ల ఒక్కోసారి మనం ఇలాంటివాటికి ప్రలోభ పడ్డా, స్నేహితులతో పంచుకుంటే వాళ్ళు మనల్ని అలెర్ట్ చేసే వీలుంటుంది. అప్పుడు అధిక నష్టం కాకుండా బయట పడచ్చు.
  3. ఎక్కువ డబ్బు పెట్టాల్సి వచ్చిన దగ్గర ఆగిపోవడం: నమ్మకం కుదరడానికి వీళ్ళొక రూ.1500-రూ.3000, మన అకౌంట్‍లోకి వేయడానికి వెనుకాడరు. అందుకని ఆ వచ్చినంతా తీసుకుని గమ్మునైపోతే, వాడికే నష్టం (వాళ్ళు లూటీ చేసేదాంట్లో ఇదేం పెద్ద లెక్కల్లోకి రాదు.) ఇది చాలా తిరకాసైన వ్యవహారం, ఇలా ఎత్తుకు పైఎత్తు వేయడంలో వాళ్ళు మనకన్నా నాలుగాకులు ఎక్కువ చదివారని గుర్తుంచుకోవాలి.

ఒకవేళ మోసానికి గురైతే…

ఏ క్షణాన “నేను మోసపోతున్నాను ఇక్కడ” అన్నది వెలిగితే, ఆ వెంటనే అక్కడ నుంచి బయటపడడం. ఎంత డబ్బు పెట్టాను? ఎంత రావాల్సి ఉంది? లాంటి లెక్కలకు పోకుండా వెంటనే బయటకు వచ్చేయడమే! ఆపైన తీసుకోదగ్గ కొన్ని చర్యలు:

  1. మీ దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్/సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం. దీనివల్ల పోయిన డబ్బు తిరిగొస్తుందా అంటే చెప్పలేం కానీ, వాళ్ళని రికార్డులలోకి ఎక్కించినవారవుతారు.
  2. మీ బాంక్/ఫోన్/సోషల్ మీడియా అకౌంట్ల పాస్‍వర్డ్స్ అన్నీ వెంటనే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, మార్చేయడం. ఇలాంటి నేరస్థులకు ఫోన్‍ను సర్వే చేయడం, స్వాధీనం చేసుకోవడం పెద్ద పనేం కాదు. అందుకని ముందు “డిజిటల్ క్లెన్సింగ్”, అంటే ప్రతీ అకౌంటూ పాస్‍వర్డ్ మార్చి, బ్రౌజర్ వాటిల్లో కాష్ (cache) తీసేసి, వాళ్ళు ఇన్‍స్టాల్ చేయమన్న ఆప్స్ ఉంటే తీసేసి మొత్తం ప్రక్షాళన చేయాలి.
  3. ఈ మొత్తం ఘటనలో మీరు బాధితులు అన్న సంగతి మర్చిపోకూడదు. మోసపోయినందుకు సిగ్గుపడనవసరం లేదు. ఎంతటివారమైనా కాలం కలిసిరానప్పుడు ఇలాంటివాటిల్లో ఇరుక్కుపోతాం. వీటిని దాచకుండా, పదిమందికీ తెలిసేలా చేస్తే మరికొంతమంది అమాయకులైనా అప్రమత్తం అవుతారు.

ఇంటర్నెట్‌లో డబ్బులు ఊరికే, ఉన్న ఫలాన ఎవరికీ రావు. ఇది గుర్తుపెట్టుకుంటే ఇలాంటి స్కాములైనా ముందే పసిగట్టగలుగుతాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Part Time Job Scams: How to spot fake job sites, what to do to avoid getting scammed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X