10కిలోమీటర్లు సైకిల్ తొక్కి సీఎం కార్యాలయానికి వెళ్ళిన మంత్రి నిమ్మల!
ఇంధన పొదుపు మరియు పర్యావరణ రక్షణపై ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ఆచరణలో పెట్టడంలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు ముందుండి నడుస్తున్నారు. ఈ క్రమంలో నో వెహికల్ డేను పాటిస్తున్నారు. తాజాగా జలవనరుల మంత్రి నిమ్మల రామనాయుడు సీఎం క్యాంప్ కార్యాలయానికి సైకిల్‌పై 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వెళ్ళటం ఆసక్తికరంగా మారింది.
క్యాంప్ కార్యాలయం నుండి సీఎం కార్యాలయానికి సైకిల్ తొక్కుతూ వచ్చిన మంత్రి నిమ్మల
విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి ఉండవల్లి వద్ద ఉన్న ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వరకు మంత్రి నిమ్మల సైకిల్ తొక్కుతూ వచ్చిన ఈ చర్య ప్రజల్లో ఇంధన పొదుపు పట్ల అవగాహన పెంచడానికి ఉదాహరణగా నిలిచింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన సూచనల మేరకు ఏపీ ప్రభుత్వం 'నో వెహికల్ డే'ను అమలు చేస్తోంది.

అధికారిక వాహనాలను పక్కన పెట్టి సైకిల్ పై నిమ్మల
ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి నిమ్మల రామనాయుడు తన అధికారిక వాహనాలను పక్కన పెట్టి సైకిల్ ఎక్కారు. ఎర్రటి ఎండలోనూ ఆయన 10 కి.మీ సైకిల్ పై తన ప్రయాణం పూర్తి చేశారు. ఈ సమయంలో పోలవరం నిర్వాసితులకు రూ.307 కోట్ల పరిహారం మరియు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండటంతో ఆయన సైకిల్‌పైనే కార్యక్రమ స్థలానికి చేరుకున్నారు.
ప్రజలకు స్పూర్తినిచ్చిన నిమ్మల
ఈ చర్యతో మంత్రి నిమ్మల రామనాయుడు ప్రజలకు స్ఫూర్తి ప్రదాతగా మారారు. ఇప్పటికే ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తమ కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గించుకున్న విషయం తెలిసిందే. ఇదే స్ఫూర్తితో మంత్రులు కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి నాయకులు కూడా వాహనాల వినియోగాన్ని తగ్గించి, సైకిళ్లు, ఎలక్ట్రిక్ బైక్‌లను వాడుతున్నారు.
పొదుపు చర్యల్లో భాగం కావాలని నిమ్మల సందేశం
ఇలాంటి చర్యలు ఇంధన ఆదా, పర్యావరణ రక్షణ, ఆరోగ్య సంరక్షణలకు దోహదపడతాయని నాయకులు వ్యాఖ్యానించారు. మంత్రి నిమ్మల రామనాయుడు ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పౌరుడు తన వాహన వినియోగాన్ని తగ్గించి, పొదుపు చర్యల్లో భాగం కావాలని సందేశం ఇచ్చారు. సోలార్ ఎనర్జీని ప్రోత్సహించడం, ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచడం వంటి అంశాలపై కూడా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
ఇంధన పొదుపు పట్ల అవగాహన
ఈ చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని, ప్రజలంతా బాధ్యతగా ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఇంధన పొదుపు పట్ల అవగాహన కలిగిస్తోంది. మంత్రులు, ప్రజా ప్రతినిధులు తాము మాట్లాడిన మాటలను ఆచరణలో చూపించడం ప్రజల్లో సానుకూల ప్రభావం చూపుతోంది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతం కావాలని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.













Click it and Unblock the Notifications