పేటీఎం సీఈఓ అరెస్ట్: ఆ వెంటనే: ఉన్న నష్టాలకు తోడు కొత్త చిక్కులు
న్యూఢిల్లీ: ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎంను కష్టాలు వీడట్లేదు. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ను జారీ చేసినప్పటి నుంచీ అన్ని రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటోందా కంపెనీ. నష్టాల్లో కునారిల్లుతోంది. పేటీఎం షేర్ల ధరలు పాతాళానికి పడిపోయాయి. ఇన్వెస్టర్లకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పట్లో ఈ షేర్ల ధరలు పైపైకి ఎగబాకే అవకాశాలే కనిపించట్లేదు. మరిన్ని నష్టాలను చవి చూడకుండా ఉండటానికి ఇన్వెస్టర్లు పేటీఎం షేర్లను పెద్దఎత్తున విక్రయించుకున్నారు.
ఇది చాలదన్నట్లు- తాజాగా పేటీఎం వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్ శేఖర్ శర్మ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. మితిమీరిన వేగంతో వాహనాన్ని ఢిల్లీ సౌత్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ బెనీత మేరీ జైకర్ వాహనాన్ని ఢీ కొట్టారు. ఈ ఘటనలో విజయ్ శేఖర్ శర్మపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు.
కిందటి నెల 22వ తేదీన ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయ్ శేఖర్ శర్మ తన ల్యాండ్ రోవర్ కారులో ఢిల్లీ అరబిందో మార్గ్‌లో ప్రయాణిస్తూ మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో సౌత్ జోన్ డీసీపీ కారును ఢీ కొట్టారు. ఆ సమయంలో విజయ్ శేఖర్ శర్మే స్వయంగా కారును నడిపినట్లు పోలీసులు నిర్ధారించారు. దీపక్ కుమార్ అనే కానిస్టేబుల్ ఈ ఘటనపై మాలవీయ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు విజయ్ శేఖర్ శర్మపై ఐపీసీ సెక్షన్ 249 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

విజయ్ శేఖర్ శర్మ అరెస్ట్ విషయాన్ని ఢిల్లీ పోలీస్ అధికార ప్రతినిధి సుమన్ నల్వా ధృవీకరించారు. అరెస్ట్ అనంతరం బెయిల్‌పై విడుదల చేశామని తెలిపారు. మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద ట్రాఫిక్ జామ్ వల్ల డీసీపీ తన వాహనాన్ని రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంచిన సమయంలో- విజయ్ శేఖర్ శర్మ స్వయంగా తన ల్యాండ్ రోవర్ కారును డ్రైవ్ చేస్తూ ఢీ కొట్టారని దీపక్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కారు హర్యానాలో రిజిస్ట్రేషన్‌లో అయిందని, దాని యజమాని గురించి ఆరా తీయగా విజయ్ శేఖర్ శర్మదిగా తేలిందని అన్నారు. ఆ సమయంలో తాను స్వయంగా కారును నడిపినట్లు ఆయన అంగీకరించారని చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఆయనను అరెస్ట్ చేశామని మాలవీయ నగర్ పోలీసులు పేర్కొన్నారు. గ్రేటర్ కైలాష్ 2లో నివసిస్తోన్న విజయ్ శేఖర్ శర్మను తమ పోలీస్ స్టేషన్‌కు పిలిపించామని, అనంతరం బెయిల్‌పై విడుదల చేశామని చెప్పారు.












Click it and Unblock the Notifications