లాక్‌డౌన్ వేళ.. అక్కడ జన జాతర: పోటెత్తిన భక్తులు: గ్రామదేవతకు మొక్కులు.. పూజలు
బెంగళూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే ప్రమాదం ఉన్నందున ఎవ్వరు కూడా గడప దాటి బయటికి రాకుండా ఉండేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలను తీసుకుంటున్నాయి. ఈ పని మీదే పోలీసులు రేయింబవళ్లు పహారా కాస్తున్నారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయడం ద్వారా మాత్రమే ప్రస్తుతానికి కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని అరికట్టవచ్చని ప్రభుత్వాలు విశ్వసిస్తున్నాయి.

వందలాది మందితో..
ఈ పరిస్థితుల్లో కర్ణాటకలోని ఓ గ్రామంలో జాతరను నిర్వహించారు. గ్రామదేవతకు ఏటేటా నిర్వహించే జాతరను ఈ సారి కూడా వైభవంగా జరిపించారు. ఈ ఉత్సవానికి వందలాది మంది భక్తులు హాజరయ్యారు. లాక్‌డౌన్ ఉన్నప్పటికీ.. జిల్లా నలుమూలల నుంచీ భక్తులు అమ్మోరిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. తమిళనాడు నుంచి కూడా ఈ జాతరకు హాజరయ్యారు భక్తులు. అమ్మోరి దయ ఉంటే తమ గ్రామానికి ఎలాంటి మహమ్మారి సోకదని చెబుతున్నారు.

ఏటేటా జాతర..
ఆ ఊరి పేరు కోలగొండనహళ్లి. రామనగర జిల్లాలో ఉంటుందీ గ్రామం. తమిళనాడుతో సరిహద్దులను పంచుకుంటోంది. ఇక్కడ వెలసిన మారెమ్మ అమ్మవారిని గ్రామదేవతగా కొలుస్తుంటారు స్థానికులు. ప్రతి సంవత్సరం మే నెలలో అమ్మోరికి జాతరను నిర్వహిస్తుంటారు. సంప్రదాయబద్ధంగా పొంగలి, సల్లను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. లాక్‌డౌన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో జాతరను నిర్వహించడం తొలుత అనుమానాలు నెలకొన్నాయి. గ్రామస్తులు మాత్రం దీన్ని పట్టించుకోలేదు. జాతరను నిర్వహించడానికి సన్నద్ధం అయ్యారు.

గ్రీన్‌జోన్ కావడం వల్ల
స్థానిక పంచాయతీ అభివృద్ధి అధికారి ఎన్‌సీ మహదేవ కల్మఠ్‌ను అనుమతి కోరారు. పైగా రామనగర జిల్లా గ్రీన్‌జోన్‌లో ఉండటం కూడా వారి వాదనకు బలాన్ని ఇచ్చింది. గ్రీన్‌జోన్‌లో సడలింపులు ఉన్నాయని గ్రామస్తులు గుర్తు చేశారు. ఆంక్షలతో కూడిన జాతరను చేపట్టడానికి ఆయన అనుమతి ఇచ్చారు. ఇక అంతే. భక్తులు ఆంక్షలను పట్టించుకోలేదు. అమ్మోరికి పూజలను చేయడానికి, నైవేద్యాన్ని సమర్పించడానికి పోటెత్తారు. మేకపోతులను బలి ఇచ్చారు. దీనితో ఆ గ్రామం మొత్తం వందలాది మంది భక్తులతో నిండిపోయింది. ఈ ఘటన కాస్తా జిల్లా అధికార యంత్రాంగంలో ఈ ఘటన కలకలం రేపింది. కర్ణాటక ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది.
Recommended Video

విచారణకు ఆదేశం..
స్థానిక తహశీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ అర్చన దీనిపై సమగ్ర నివేదికను తెప్పించుకున్నారు. జాతరను జరపడానికి అనుమతి ఇచ్చిన పంచాయతీ అభివృద్ధి అధికారిపై వేటు వేశారు. ఆయనను సస్పెండ్ చేస్తూ ఆదేశాలను జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్న తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జిల్లా పాలనా యంత్రాంగాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. ఏ ఒక్కరిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించినా గ్రామం మొత్తం దాని బారిన పడుతుందనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.












Click it and Unblock the Notifications