వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీరియడ్ గుడిసెలు: 'నెలసరి దగ్గరపడగానే ఆ గుడిసెలో బతుకు తలచుకుని గుండె దడ దడలాడేది'

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కనల్ తోలా గ్రామంలోని మహిళలు

సైన్స్ ఎంత అభివృద్ధి చెందుతున్నా భారతదేశంలో కొన్ని దురాచారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి వాటిల్లో 'నెలసరి గుడిసెలు' ఒకటి.

ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో నెలసరి సమయాల్లో ఆడవాళ్లను ఊరిలోకి రానివ్వకుండా, పొలిమేరల్లోని గుడిసెల్లో ఉండమంటారు.

ఉదాహరణకు అనంతపురం జిల్లా రొల్ల మండలం గంతగొల్లహట్టి గ్రామంలోని ఆడవాళ్లు నెలసరి సమయంలో, ప్రసవించినప్పుడు దాదాపు 3 నెలలు ఊరిబయట ఉండే ఇలాంటి గుడిసెల్లోనే ఉండాలి.

సాధారణంగా ఈ గుడిసెలు అపరిశుభ్రంగా, ఎలాంటి సదుపాయాలు లేకుండా శిథిలావస్థలో ఉంటాయి.

మహారాష్ట్రలో అలాంటి నెలసరి గుడిసెలను మెరుగుపరచి, మహిళలకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది ఓ ఛారిటీ సంస్థ.

ముంబయికి చెందిన ఖెర్వాడి సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ (కేఎస్‌డబ్ల్యూఏ), 'కుర్మా ఘర్' లేదా 'గావ్‌కోర్' అని పిలిచే నెలసరి గుడిసెలను ఆధునిక విశ్రాంతి గృహాలుగా తీర్చిదిద్దే పనిని ఇప్పటికే ప్రారంభించింది.

మహిళలకు అనువైన పడకలు, గుడిసెల లోపలే టాయిలెట్లు, కొళాయిలు, విద్యుత్ కోసం సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తోంది.

ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమం పలువురు ప్రశంసలు అందుకొంటున్నప్పటికీ, మహిళల నెలసరి విషయంలో సమాజంలో ఉన్న అపోహలు, వాటి చుట్టూ అల్లుకుని ఉన్న దురాచారలపై పోరాడవలసిన ఆవశ్యకతను మరోసారి గుర్తు చేస్తోంది.

ఈ గుడిసెలను పూర్తిగా వదిలించుకునే దిశగా చర్యలు చేపడితే బావుంటుందని విమర్శకులు అంటున్నారు.

ఈ రకమైన దురాచారాలు మానిపోనప్పటికీ, కనీసం మహిళలకు సురక్షితమైన, శుభ్రమైన స్థలాన్ని ఏర్పాటు చేయడం ప్రథమ కర్తవ్యం అని ప్రచారకులు అభిప్రాయపడుతున్నారు.

పీరియడ్ గృహాలు

భారతదేశంలో పీరియడ్స్ పట్ల అపోహలు, రుతుస్రావాన్ని అపవిత్రంగా భావించడం, ఫలితంగా తీవ్రమైన ఆక్షలు సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నాయి.

నెలసరి సమయంలో ఆడవాళ్లను ధార్మిక కార్యక్రమాల్లోనూ, సామాజిక వేడుకల్లోనూ పాల్గొననివ్వరు. దేవాలయాల్లోనూ, ప్రార్థనా మందిరాల్లోనూ అనుమతించరు. కొన్ని చోట్ల వంటింట్లోకి వెళ్లడం కూడా నిషిద్దమే.

కాగా, భారతదేశంలోని అత్యంత వెనుకబడిన, పేద జిల్లాల్లో ఒకటైన గడ్చిరోలిలో గోండ్, మాడియా తెగల మహిళల పరిస్థితి మరీ దారుణం.

వీరు ప్రతీ నెల ఐదురోజులపాటూ గ్రామ శివార్లలో అడవి అంచున ఉన్న గుడిసెల్లో గడపాల్సి ఉంటుంది.

వారికి వంట చేసుకోవడం, గ్రామంలోని బావి నీరు తోడుకోవడం నిషిద్ధం. చుట్టాలో, స్నేహితులో ఊళ్లో నుంచి భోజనం, తాగడానికి నీళ్లు తీసుకొచ్చి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పని కూడా మహిళలే చేయాలి.

నెలసరి సమయంలో ఆ స్త్రీలను తాకిన వారు అపవిత్రం అయిపోతారని వాళ్ల నమ్మకం. అలాంటప్పుడు వెంటనే శుద్ది స్నానం చేయాల్సి ఉంటుంది.

నెలసరి గుడిసెల్లో బతుకులు

గత ఏడాది తుకుం గ్రామంలో తొలిసారిగా అన్ని సౌకర్యాలతో కూడిన గుడిసెను ఏర్పాటు చేశారు. దీనివలన, తమ గ్రామంలో ఉన్న 90 మంది మహిళలకు నెలసరి సమయంలో కష్టాలు తగ్గాయని, జీవితం కొంత సులభం అయిందని తుకుం మహిళలు అంటున్నారు.

అంతకుముందు, నెలసరి తేదీలు దగ్గరపడగానే గుండె దడదడలాడేదని, ఊరికి దూరంగా ఆ గుడిసెల్లో ఐదు రోజులు మగ్గాలనే ఆలోచనే భయంగొలిపేదని వాళ్లు చెప్పారు.

గ్రామానికి వెలుపల మట్టి, వెదురు, గడ్డితో పైకప్పు వేసిన పూరిపాకలకు తలుపులు, కిటికీలు ఉండవు. స్నానానికి, బట్టలు ఉతుక్కోవడానికి నీళ్లు ఉండవు. వీటి కోసం ఓ కిలోమీటరు దూరంలో ఉన్న చెరువుకు వెళ్లాల్సి వస్తుంది.

వేసవికాలంలో ఆ గుడిసెల్లో విపరీతంగా వేడిగా ఉంటుందని, దోమలు కుట్టి చంపేస్తాయని 35 ఏళ్ల సురేఖ చెప్పారు.

శీతాకాలంలో గడ్డ కట్టుకుపోయేంత చలి, వర్షాకాలంలో పైకప్పు కారిపోయి గుడిసెంతా బురద అయిపోతుందని, ఒక్కొసారి కుక్కలు, పందులు కూడా గుడిసెల్లోకి వచ్చేస్తుంటాయని ఆమె తమ అవస్థలను వివరించారు.

గుడిసెలో ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు రాత్రంతా భయంతో నిద్రపట్టేది కాదని 21 ఏళ్ల శీతల్ అన్నారు.

"గుడిసె లోపల, బయట కూడా చిమ్మ చీకటి. అలాంటప్పుడు చాలా భయం వేస్తుంది. ఇంటికి వెళిపోవాల్సిపిస్తుంది. కానీ వెళ్లలేను" అని ఆమె చెప్పారు.

శీతల్ నరోతే

పదేళ్ల క్రితం నెలసరి సమయంలో ఊరి చివర గుడిసెలో ఒంటరిగా ఉన్న 21 ఏళ్ల మహిళ పాము కాటుకు గురై చనిపోయారని 45 ఏళ్ల దుర్పాటా ఉసెండి తెలిపారు.

"ఒకరోజు అర్థరాత్రి ఆమె అరుస్తూ, పెద్దగా ఏడుస్తూ గుడిసె బయటకు పరుగులు పెట్టింది. ఏమైపోయిందోనని కంగారుగా మేమందరం నిద్ర లేచాం. ఆమె బంధువుల్లో స్త్రీలు కొందరు ఆమెకు మూలికలు, స్థానిక మందులు తెచ్చి ఇచ్చారు. మగవాళ్లు మాత్రం దూరం నుంచే చూస్తూ ఉండిపోయారు. ఆమె కుటుంబంలోని మగవారు కూడా ఏ రకమైన సహాయం చేయలేదు. ఆమెను తాకితే అపవిత్రమైపోతారు కాబట్టి ఎవరూ దగ్గరకు రాలేదు. విషం ఆమె శరీరం మొత్తం పాకింది. అసహాయంగా నేలపై పడి ఆ నొప్పితో బాధపడుతూనే చనిపోయింది" అని ఉసెండి వివరించారు.

ఇప్పుడు వీరి కోసం కొత్తగా గుడిసెలను నిర్మిస్తున్నారు. అలాంటి ఒక గుడిసెను ఆమె మాకు వీడియో కాల్‌లో చూపించారు. రీసైకిల్ ప్లాస్టిక్ బాటిళ్లల్లో ఇసుక నింపి గోడలుగా అమర్చారు. మంచి ఎర్రటి పెయింట్ వేశారు. మధ్యలోంచి నీలం, పసుపు రంగుల్లో బాటిల్ క్యాపులు కనిపిస్తూ అందంగా ఉంది.

అందులో ఎనిమిది పడకలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా లోపలే టాయిలెట్లు కట్టారు. తలుపులు కూడా అమర్చారు.

వీటిని నిర్మించడానికి రెండున్నర నెలలు పడుతుందని, రూ. 6.5 లక్షలు ఖర్చు అవుతుందని కేఎస్‌డబ్ల్యూఏకు చెందిన నికోలా మాంటెరియో తెలిపారు.

కొత్త గుడిసెల నిర్మాణంలో పాలు పంచుకుంటున్న మహిళలు

ఇప్పటికే వీరు అక్కడ నాలుగు గుడిసెలను నిర్మించారు. మరో ఆరు గుడిసెలు చుట్టుపక్కల గ్రామాల్లో ఈ జూన్‌లో తెరుచుకోనున్నాయి.

గత 15 ఏళ్లుగా ఈ ప్రాంతంలో పని చేస్తున్న 'స్పర్శ్' అనే స్థానిక ఛారిటీ సంస్థ ప్రెసిడెంట్ దిలీప్ బార్సాగడే మాట్లాడుతూ, కొన్నేళ్ల క్రితం 223 ముట్టు గుడిసెలను తాను సందర్శించానని, అందులో 99% అపరిశుభ్రంగా, ఏ రకమైనా భద్రతా లేకుండా ఉన్నాయని తెలిపారు.

"కనీసం 21 మంది మహిళలు ఈ గుడిసెల్లో ఉండడం వలన చనిపోయారు. ఒకామెను పాము కాటేసింది. మరొక మహిళను ఎలుగుబంటి ఎత్తుకుపోయింది. ఇంకో మహిళ తీవ్రమైన జ్వరంతో ప్రాణాలు విడిచారు. ఇవన్నీ కూడా నివారించగలిగిన పరిస్థితులే" అని ఆయన అన్నారు.

వీటన్నిటితో ఆయన ఒక రిపోర్ట్ తయారుచేశారు. అది చూసిన తరువాత, జాతీయ మానవ హక్కుల సంఘం "ఈ దురాచారాన్ని పూర్తిగా నిర్మూలించాలని, ఇది మహిళా హక్కులకు తీవ్ర భంగం కలిగిస్తోందని, వారి భద్రత, పరిశుభ్రత, గౌరవానికి ఆటంకం కలిగిస్తోందని, వీటిని తొలగించాలని" మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అయినప్పటికీ, ఈ దురాచారం ఇంకా కొనసాగుతూనే ఉంది.

శివారు గుడిసెల్లో ఉండడం ఇష్టం లేదని, అక్కడ ఏరకమైన సదుపాయాలు లేకపోవడం కోపం, బాధ కలిగిస్తాయని, కానీ శతాబ్దాలుగా సాగుతున్న ఆచారాన్ని ఎదిరించేందుకు నిస్సహాయులమని తుకుం, ఆ చుట్టుపక్కల గ్రామాల మహిళలు అంటున్నారు.

మార్పు అంత సులభం కాదు

ఈ ఆచారాలకు ఎదురెళితే పాపం చుట్టుకుంటుందని, దేవుడు శిక్షిస్తాడని, కుటుంబం మొత్తం అనారోగ్యం పాలవుతుందని భయమేస్తుందని సురేఖా హలామీ అంటున్నారు.

"మా అమ్మ, అమ్మమ్మ కూడా ముట్టు గుడిసెలకు వెళ్లారు. నేను ప్రతీ నెల వెళుతున్నాను. పెద్దయ్యాక మా అమ్మాయిని కూడా అక్కడికి పంపిస్తాను" అని ఆమె చెప్పారు.

"ఈ సంప్రదాయాలను, ఆచారాలను మార్చలేం. ఇవన్నీ దేవుడు రాసి పెట్టినవి. వీటిని ఎవరైనా అధిగమిస్తే వాళ్లకు శిక్ష పడుతుంది.. గ్రామం మొత్తానికి పోర్క్ లేదా మటన్ వండి వడ్డించాలి. లేదా కొంత సొమ్మును పరిహారంగా చెల్లించాలి" అని తుకుం గ్రామ వృద్ధుడు చెందు ఉసెండి అన్నారు.

దురాచారాలు, కట్టుబాట్ల వెనక ప్రధానంగా మతం, సంప్రదాయాల ప్రస్తావన వస్తుంటుంది.

అయితే, నగర ప్రాంతాల్లో నివసించేవారు, విద్యావంతులైన మహిళలు ఈ కట్టుబాట్లను సవాలు చేయడం క్రమంగా పెరుగుతోంది.

నెలసరి సమయాల్లో హిందూ దేవలయాల్లోకి, ముస్లిం ప్రార్థనా మందిరాల్లోకి మహిళలను అనుమతించాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాలు కోర్టుకెక్కాయి.

చందాలా టోలీ గ్రామం

నెలసరి వెనుక మూఢనమ్మకాలను ప్రశ్నిస్తూ, ముఖ్యంగా మహిళల్లో అవగాహన పెంపొందించేందుకు 'హ్యాపీ టు బ్లీడ్’ (#HappyToBleed) లాంటి ప్రచారాలను సోషల్ మీడియాలో తరచూ నిర్వహిస్తున్నారు.

"అయితే, ఇదంతా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ మార్పు నెమ్మది నెమ్మదిగా వస్తుంది. ఇక్కడ ఇలాంటి విషయాల్లో దూకుడుగా పోరాడలేమని అనుభవం ద్వారా తెలుసుకున్నాం" అని మాంటెరియో అంటున్నారు.

ప్రస్తుతానికి ఈ కొత్త గుడిసెలు మహిళలకు సురక్షితమైన నివాసాన్ని కల్పిస్తాయి. భవిష్యత్తులో ఇక్కడి సమాజానికి అవగాహన కల్పించడం ద్వారా ఈ దురాచారాలను పూర్తిగా రూపుమాపేందుకు ప్రయత్నిస్తామని ఆమె చెప్పారు.

ఈ పని అనుకున్నంత సులభం కాదని బార్సాగడే అంటున్నారు.

"సౌకర్యాలతో కొత్త గుడిసెలు ఏర్పాటు చేయడం ఈ సమస్యకు అసలైన పరిష్కారం కాదని మాకు తెలుసు. నెలసరి సమయంలో మహిళలకు శారీరకంగా, మానసికంగా మద్దతు అవసరం. అది ఎవరి ఇళ్లల్లో వాళ్లకు లభిస్తుంది. కానీ, అది అంత సులభం కాదు. ఇప్పటికిప్పుడు పరిస్థితులను మార్చేయడానికి మా దగ్గరేం మంత్రదండం లేదు" అని ఆయన అన్నారు.

అన్నిటికన్నా పెద్ద సమస్య ఏమిటంటే, ఇది తమ హక్కులకు భంగం అని ఆ మహిళలకే తెలీదని బార్సాగడే చెప్పారు.

"అయితే, ఇప్పుడిప్పుడు అవగాహనలో, ప్రవర్తనలో మార్పు రావడం గమనిస్తున్నాం. చిన్నపిల్లలు, చదువుకుంటున్నవాళ్లు ఈ కట్టుబాట్లను ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా మారడానికి కొంత సమయం పడుతుంది. భవిష్యత్తులో ఆ రోజు వస్తుంది అనే నమ్మకముంది" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Period huts: 'As the month drew to a close the survivors in that hut were heartbroken'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X