పెట్రో రేట్లు మళ్లీ ఫైర్: మోత మరీ ఈ రేంజ్‌లోనా: లీటర్ పెట్రోల్ రూ.122 ప్లస్
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం కూడా వాటి రేట్లు లీటర్ ఒక్కింటికి 35 పైసల మేర పెరిగాయి. ఇంధన రేట్లను పెంచడం వరుసగా ఇది ఆరోసారి. ప్రతి రోజూ 35 పైసలు, అంతకుమించిన భారాన్ని వాహనదారులపై మోపుతున్నాయి చమురు సంస్థలు. ఏదైనా ఓ రోజు వాటి ధరలు పెంచకపోతే.. తగ్గించినట్టే భావించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంపుదల విషయంలో ఆయిల్ కంపెనీలు ఏ మాత్రం వెనకడుగు వేయట్లేదు..మొహమాటానికి పోవట్లేదు. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలైన కోట్లాది కుటుంబాలపై పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల రూపంలో వీపు విమానం మోత మోగుతోంది.

లీటర్‌పై 35 పైసలు..
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల మేర పెంపుదల కనిపించింది. అన్ని చమురు కంపెనీలకు ఇవే రేట్లు వర్తిస్తాయి. లీటర్ ఒక్కింటికి 35 పైసల మేర పెంచడాన్ని బెంచ్‌మార్క్‌గా పెట్టుకున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో దేశంలోని అనేక నగరాల్లో లీటర్ పెట్రోల్ 115 నుంచి 120 రూపాయలుగా నమోదైంది. డీజిల్ 105 నుంచి 110 రూపాయలకు చేరువైంది. కొన్ని చోట్ల పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 120 రూపాయల మార్క్‌ను కూడా దాటేసింది.

ఢిల్లీ, ముంబైల్లో..
దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ.109.69 పైసలకు చేరింది. డీజిల్ రూ.98.42 పైసలు పలుకుతోంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ 115 రూపాయలను దాటేసింది. లీటర్ రూ.115.50 పైసలుగా రికార్డయింది. అక్కడ డీజిల్ రూ.106.62 పైసలకు చేరింది. కోల్‌కతలో పెట్రోల్ ధర రూ.110 రూపాయల పైమాటే. ఈ నగరంలో పెట్రోల్ రేటు రూ.110.15 పైసలుగా నమోదైంది. డీజిల్ ధర రూ.101.56 పైసలుగా నమోదయింది. చెన్నైలో పెట్రోల్ రూ.106.35 పైసలు, డీజిల్ ధర రూ.102.59 పైసలకు చేరింది.

అక్కడ రూ.118 ప్లస్
కాగా- బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.113.56, డీజిల్ రూ.104.50 పైసలు, భోపాల్‌లో పెట్రోల్ రూ.118.46 పైసలు, డీజిల్ రూ.107.90 పైసలుగా నమోదైంది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.114.12 పైసలు, డీజిల్ రూ.107.40 పైసలకు చేరింది. గువాహటిలో పెట్రోల్ రూ.105.74 పైసలు, డీజిల్ రూ.98.36 పైసలు, లక్నోలో పెట్రోల్ రూ.106.61 పైసలు, డీజిల్ రూ.98.91 పైసలుగా రికార్డయింది. గాంధీనగర్‌లో పెట్రోల్ రూ.106.53, డీజిల్- 106.33 పైసలు, తిరువనంతపురంలో పెట్రోల్ రూ.112.07, డీజిల్ రూ.105.85 పైసలుగా నమోదైంది.

పెట్రోల్ రూ.120కి పైగా..
వరుస పెంపుదలతో దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి 120 రూపాయల మార్క్‌ను దాటి పోయింది. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో పెట్రోల్ రూ.120.92 పైసలుగా నమోదైంది. డీజిల్ 110 రూపాయలను దాటింది. పన్నా, సత్నా, రీవా, షాదోల్, ఛింద్వారాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్, హనుమాన్ గఢ్‌లల్లో 122 రూపాయలకు చేరింది లీటర్ పెట్రోల్ ధర. శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్ రూ.122.32 పైసలు, డీజిల్ రూ.113.21 పైసలుగా పలుకుతోంది.
Recommended Video

మూడు రోజుల్లో రూపాయికిపైగా..
రేట్లు ఎక్కడికి వెళ్లి ఆగుతాయనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచడంతో రేట్లు మరింత వేగంగా పైపైకి దూసుకెళ్తున్నాయి. పెట్రోల్, డీజిల్ లీటర్ ఒక్కింటికి 35 పైసల మేర చొప్పున పెంచుతూ వస్తోండటం వల్ల మూడు రోజుల్లోనే ఒక రూపాయిని దాటస్తున్నాయి వాటి ధరలు. ఇలా ఎంత కాలం కొనసాగుతుందో తెలియదు. రేట్లు తగ్గే అవకాశం ఏ మాత్రం కూడా కనిపించట్లేదు.












Click it and Unblock the Notifications