కర్ణాటక ఎన్నికల్లో పింక్ పోలింగ్ బూత్స్: మహిళల కోసం ప్రత్యేకంగా!
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా 'సఖి' పేరుతో పింక్ పోలింగ్ బూత్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల కమిషన్ అధికారులు. పూర్తి స్థాయిలో మహిళా సిబ్బందితోనే నడిచే ఈ కేంద్రాల వల్ల మహిళా ఓటింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల కమిషన్ భావిస్తోంది.
ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహించే మహిళా సిబ్బందితో పాటు భద్రతా సిబ్బంది కూడా మహిళా పోలీసులే కావడం గమనార్హం. మెడికల్ స్టాఫ్ కూడా అందరూ మహిళలే. వీరంతా గులాబీ రంగు దుస్తుల్లో విధులకు హాజరయ్యారు.

కాగా, కొన్ని పింక్ పోలింగ్ బూత్ కేంద్రాల్లో మహిళా ఓటర్లకు గులాబీలతో స్వాగతం పలికారు. గతంలో పింక్ పోలింగ్ బూత్ కేంద్రాలను పంజాబ్ ఎన్నికల్లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కర్ణాటక ఎన్నికల్లోనే.
తొలిసారి ఓటేసిన ట్రాన్స్-జెండర్:
ప్రముఖ ట్రాన్స్-జెండర్ యాక్టివిస్ట్ అక్కై పద్మశాలి మొట్టమొదటిసారి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన ఈ హక్కును ఉపయోగించుకోవడానికి తనకు 16ఏళ్లు పట్టిందన్నారామె.
ఇప్పటివరకు ఎన్నికల అధికారులు తనకు ఓటర్ కార్డు ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చారని, ఎట్టకేలకు ఈ దఫా మాత్రం తనకు ఓటు హక్కు లభించిందని ఆమె చెప్పారు. ఎట్టకేలకు తాను ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.

మండ్యాలో ఆలస్యంగా పోలింగ్:
సాంకేతిక సమస్యల కారణంగా మండ్యా జిల్లాలోని పలు పోలింగ్ బూత్ లలో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం 84మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications