పీఎం కేర్స్ ఫండ్ ఆడిట్ నివేదికపై ప్రధాని మోడీ టార్గెట్ గా రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు
పీఎం కేర్స్ ఫండ్‌పై ఆడిట్ నివేదికపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. పీఎం కేర్స్ నివేదిక విడుదలైన తర్వాత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై తన మాటల తూటాలు పేల్చారు. ట్విటర్‌లో రాహుల్ గాంధీ "పీఎం అబద్ధాలు" చెబుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు.

కేంద్రంపైనా, పీఎం కేర్స్ ఫండ్‌పైనా రాహుల్ గాంధీ విమర్శలు
కేంద్రంపైనా, పీఎం కేర్స్ ఫండ్‌పైనా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. నిధులను ఉపయోగించి కోవిడ్-19 సెకండ్ వేవ్ సమయంలో అందించిన వెంటిలేటర్లు పనిచేయడం లేదని గతంలో రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆడిట్ ప్రకారం, పీఎం కేర్స్ ఫండ్స్ ద్వారా అందిన మొత్తం బిలియన్లలో ఉంది అని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు కేంద్ర ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం చెప్పిన లెక్కలపై రాహుల్ గాంధీ మండిపడ్డారు.

ఆడిట్ రిపోర్ట్ ప్రకారం పీఎం కేర్స్ ఫండ్ కు వచ్చిన విరాళాలివే
2020- 21 సంవత్సరంలో దాదాపు రూ. 10,990,17,32,873 వచ్చాయని వెల్లడించారు. 2020-21లో రూ.10990 కోట్లు వచ్చాయని నివేదికలో పేర్కొన్నారు. "స్వచ్ఛంద విరాళాలు" నుండి రూ. 7183 కోట్ల కంటే ఎక్కువ విరాళాలు వచ్చాయని, విదేశీ దాతల నుండి నుండి రూ. 494 కోట్లకు పైగా అందాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 2020-21లో రూ.3976 కోట్లు ఖర్చు చేసినట్లు ఆడిట్ ప్రకటన వెల్లడించింది.

ఖర్చు చేసిన లెక్కలు ఇవే
ఖర్చు లెక్కలలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల కోసం "మేడ్-ఇన్-ఇండియా" వెంటిలేటర్ల కోసం దాదాపు రూ. 1311 కోట్లు ఖర్చు చేశారు. వలస సంక్షేమం కోసం రాష్ట్రాలకు రూ.1000 కోట్లు కేటాయించారు. 1392 కోట్లు 6.6 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల కొనుగోలు కోసం కేటాయించారు. 201.58 కోట్లు ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు కోసం, 50 కోట్ల రూపాయలు ముజఫర్ పూర్, పాట్నాలలో 500 పడకల కోవిడ్ ఆసుపత్రుల కోసం, 20.4 కోట్ల రూపాయలు 9 రాష్ట్రాలలో 16 ఆర్ టి పి సి ఆర్ టెస్టింగ్ ల్యాబ్ ల కోసం, 1.01 లక్షలు బ్యాంకు చార్జీలుగా ఖర్చు అయినట్టు ఆడిటింగ్ రిపోర్టు పేర్కొంది.
Recommended Video

ప్రధాని అబద్దాలు అంటూ రాహుల్ ఫైర్
పీఎం కేర్స్ ఫండ్స్ లో వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థల నుంచి ఇచ్చిన విరాళాలు ఉంటాయని బడ్జెట్ నిధులు ఏవీ ఉండవని ఆడిటర్ రిపోర్టు స్పష్టంచేసింది. ఇదిలా ఉంటే పీఎం కేర్స్ ఫండ్ పారదర్శకత పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిధి ఉన్నప్పటికీ, పీఎం కేర్స్ ఏర్పాటు చేయడం ఎందుకని విపక్షాలు మండిపడ్డాయి. అయితే నివేదిక వచ్చిన నేపథ్యంలో ఈ వివరాలపై ప్రధాని అబద్ధాలు చెబుతున్నారని రాహుల్ గాంధీ మరోమారు విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications