వలస కార్మికుల కోసం కొత్త పథకం.. లాంచ్ చేసిన మోదీ... ఇది చారిత్రాత్మకం అంటూ...
కరోనా వైరస్ నేపథ్యంలో లక్షలాది మంది వలస కార్మికులు స్వస్థలాల బాట పట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం(జూన్ 21) 'గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్' పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా రూ.50వేల కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కోసం ఖర్చు చేయనున్నారు. తద్వారా గ్రామాలకు వలస వెళ్లిన కూలీలు,కార్మికులకు ఉపాధి లభించనుంది.

కార్మిక సోదరులారా.. ఇది చారిత్రాత్మకమైన రోజు : మోదీ
కరోనా లాక్ డౌన్ పీరియడ్‌లో వలస కార్మికుల ధీన స్థితిని,వారిని కష్టాలను చూశాక... వారి కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించినట్టు మోదీ తెలిపారు. ఇన్నాళ్లు నగరాల అభివృద్ది కోసం ఎంతో పాటు పడిన ఆ కార్మికులకు ఇక గ్రామాల్లోనే ఉపాధి కల్పించే ఉద్దేశంతో దీన్ని రూపొందించామన్నారు. 'ఇది చారిత్రాత్మకమైన రోజు. పేద ప్రజల సంక్షేమం కోసం వారికి బతుకుదెరువునిచ్చే పథకం ఇవాళ ప్రారంభమైంది. కార్మిక సోదరులారా... మీ బాధలను,అవసరాలను దేశం అర్థం చేసుకుంది.' అని తెలిపారు.

ఏడాదిలో 125 రోజులు ఉపాధి...
'వలస కార్మికులకు ఇకపై వారి స్వగ్రామాలకు సమీపంలోనే ఉపాధి దొరుకుతుంది. ఇప్పటివరకూ మీ ప్రతిభను,కష్టాన్ని నగరాల అభివృద్ది కోసం వెచ్చించారు. ఇకపై గ్రామాల అభివృద్దికి మీరు తోడ్పడుతారు.' అని మోదీ స్పష్టం చేశారు. ఈ పథకం ఏడాదిలో 125 రోజులు అమలులో ఉంటుందని.. బీహార్,ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్,రాజస్తాన్,జార్ఖండ్,ఒడిశా రాష్ట్రాల్లోని 116 జిల్లాలో ఇది అమలవుతుందని చెప్పారు. ఇటీవలి కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు చాలామంది స్వస్థలాల బాట పట్టారు.

నగరాల నుంచి తిరిగి గ్రామాలకు...
నగరాల్లో బతుకుదెరువు కోసం గ్రామాల నుంచి వలస వెళ్లిన కార్మికులు.. కరోనా లాక్ డౌన్ కారణంగా ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కోల్పోయి,తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో స్వగ్రామాలకు చేరారు. వేలాదిమంది వలస కార్మికులు ఎర్రటి ఎండలో వందల కి.మీ నడుస్తూ కాలి నడకనే స్వస్థలాలకు చేరుకున్నారు. గ్రామాలకు చేరిన ఆ వలస కూలీలు,కార్మికులకు ఇప్పుడక్కడ ఉపాధి దొరక్కపోతే.. వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 'గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్' పథకాన్ని ప్రారంభించింది.












Click it and Unblock the Notifications