ప్రధాని మోడీ-అమిత్ షా.. ఒకేసారి జాయింట్‌గా
న్యూఢిల్లీ: పంద్రాగస్టు సమీపిస్తోన్న కొద్దీ దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవం సంబరాలు నెలకొంటోన్నాయి. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలను చేపట్టింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను నిర్వహిస్తోంది. గత ఏడాది ఆగస్టు 15వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆరంభమైందీ కార్యక్రమం. ఇప్పుడు తాజాగా హర్ ఘర్ తిరంగా (ఇంటింటిపై మువ్వన్నెల జెండా) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

ప్రొఫైల్ పిక్స్..
దీన్ని పురస్కరించుకుని- ప్రధాని మోడీ గత ఆదివారం దేశ ప్రజలకు కీలకమైన సందేశాన్ని ఇచ్చారు. రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ- సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉన్న ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను తమ ప్రొఫైల్ ఫొటోగా మార్చుకోవాలంటూ పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్‌మహోత్సవ్ కార్యక్రమం ఓ సామూహిక ఉద్యమంగా మారడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరూ ఏదో ఒక రూపంలో ఇందులో భాగస్వామ్యులవుతున్నారని పేర్కొన్నారు.

పంద్రాగస్టు వరకు..
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన షహీద్ ఉధమ్ సింగ్ సహా పలువురు అమర వీరులకు ఆయన నివాళి అర్పించారు. అదే సమయంలో ఆయన దేశ ప్రజలకు ఈ పిలుపునిచ్చారు. ఆగస్టు 2 నుంచి 15 తేదీ వరకు దేశ ప్రజలందరూ తమ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్పిక్చర్గా జాతీయ జెండా ఫొటో పెట్టుకోవాలని కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రత్యేక సామాజిక ఉద్యమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

హర్ ఘర్ తిరంగ..
ప్రతి పౌరుడు తన నివాసంపై జాతీయ జెండా ఎగురవేయాలని, దేశం పట్ల తమ భక్తిప్రపత్తులను చాటుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగస్వాములవుతున్నారని ప్రశంసించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న ఈ శుభ సందర్భంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, హర్ ఘర్ తిరంగ కార్యక్రమాలో చరిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించబోతోన్నామని పేర్కొన్నారు.

పిక్ ఛేంజ్..
ఇందులో భాగంగా ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. తమ సోషల్ మీడియా అకౌంట్లకు సంబంధించిన ప్రొఫైల్ ఫొటోలను మార్చివేశారు కూడా. ఇదివరకు ఉన్న ఫొటోలను తొలగించి, వాటి స్థానంలో త్రివర్ణ పతాకం ఫొటోను పెట్టారు. పంద్రాగస్టు వరకూ ఈ ప్రొఫైల్ పిక్ ఇదే ఉంటుంది. పలువురు కేంద్ర మంత్రులు, ఆయా శాఖలకు చెందిన అధికారులు, కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన సోషల్ మీడియా అకౌంట్లల్లో ఇప్పుడిప్పుడే ప్రొఫైల్ పిక్స్.. జాతీయ పతాకంలోకి మారుతున్నాయి.












Click it and Unblock the Notifications